భావోద్వేగాల సమ్మేళనం ఈ ‘ఇరుముడి’ !!

Sharing is Caring...

త్రినాధరావు గరగ……

మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మనకు తెలిసీ యాక్షన్ ,కామెడీ, అల్లరి, వీటితో పాటుగా ఈ మధ్యకాలంలో వచ్చిన వరస రొట్ట కొట్టుడు సినిమాలు.. కానీ ‘ఇరుముడి ‘అనే సినిమాలో హీరో రవితేజ మాత్రం కనిపించలేదు. ఆటోలో అరటి గెలలు అమ్ముకునే త్రినాధరావు మాత్రమే కనిపించాడు.

కూతురే లోకంగా బతికే ఓ తండ్రిలా మనందరికీ కన్నీళ్లు తెప్పించాడు .. తండ్రి కూతుళ్ళ భావోద్వేగాల సమ్మేళనం ఈ ఇరుముడి. త్రినాథ్ పాత్రలో రవితేజ చాలా కొత్తగా కనిపించాడు. మాస్ హీరో ఇమేజ్‌కు కాస్త దూరంగా వెళ్లి ఒక సాధారణ తండ్రిగా నటించడం చాలా గొప్ప విషయమే.

మళయాళ ఓటీటీ చిత్రాలు చూసి ఆ రకమైన కథాంశాలతో మనవాళ్లు ఎందుకు తీయలేరని అప్పుడప్పుడూ అనిపిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఈ ఇరుముడి. అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరులో ఎంచుకున్న లొకేషన్ దగ్గరనుంచి.. కథ, కథనం, పాత్రధారులు, పాత్రల రూపకల్పన , సస్పెన్స్, భావోద్వేగం, ముగింపు.. ఇలా అన్ని అంశాల్లోను గ్రిప్పింగ్ గా నడపాలంటే ఆడియన్స్ ని మమేకం చేసుకోవాలి. ఆ ప్రయత్నం పూర్తిగా జరిగింది.. హాట్సాఫ్ టూ శివనిర్వాణ.

న‌టుడిగా మాస్ మ‌హారాజాను కొత్త కోణంలో ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఆవిష్క‌రించారు.టైటిల్ ని బట్టి ఇందులో అగ్రభాగం డివోషనల్ యాస్పెక్ట్ ఉంటుందని అనిపించవచ్చు. కానీ అయ్యప్ప మాల, ఇరుముడి వగైరాలు కథనానికి ఒక నేపథ్యంగా వాడుకోవటంలో కూడా దర్శకుడు శివ సక్సెస్ అయ్యాడు.

కొన్ని చోట్ల ఊహించని విధంగా ట్విస్టులుంటే.. కొన్ని ప్రెడిక్టెబుల్ గా ఉన్నాయి. అయినప్పటికీ కథనంలో ఎమోషన్ వర్కౌట్ అవ్వడం వల్ల ప్రేక్షకులు కథనంలో ఈ లీనమై గమనించే పరిస్థితి ఉండదు.ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రిగే దౌర్జ‌న్యాలు,ఎవ‌రికీ చెప్పుకోలేని అన్యాయ‌మైన స్థితి, కూతురికి జ‌రిగిన అన్యాయం తెలిసినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌, నార్మ‌ల్‌గా క‌నిపించే సైకో క్యారెక్ట‌ర్స్‌, ఇవే మనకు కనిపించి, మనతో ట్రావెల్ అవుతూ ఉంటాయి.

నిజానికి ఇలాంటి క‌థ‌లు మ‌రీ కొత్త‌వేం కాదు. కానీ ఇరుముడి అంతకు మించి ఉంది.. నటీనటుల విషయానికి వస్తే… హీరో రవితేజ సహజ నటన ప్రదర్శించాడు. పోరాట సన్నివేశాలూ ఇరగదీశాడు. బేబీ నక్షత్రకు ఇదే మొదటి తెలుగు సినిమా. చాలా చక్కగా ఆ పాత్రను పోషించింది. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ సగటు తల్లి పాత్రలో ఒదిగిపోయింది.

గురుస్వామిగా సాయికుమార్ బాగా సెట్ అయ్యారు..మలయాళ నటి శ్వాసిక తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా… భిన్నమైన పాత్రలే ఆమెకు లభిస్తున్నాయి. ఇదీ ఆ కోవకు చెందిదే. ఇతర ప్రధాన పాత్రలను అజయ్ ఘోష్, సురభి ప్రభావతి, రమేశ్‌ ఇందిర, మీసాల లక్ష్మణ్, కిశోర్ కుమార్, కసిరెడ్డి రాజ్ కుమార్, రమణ భార్గవ్ తదితరులు చేశారు.

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే జీవీ ప్రకాశ్‌ కుమార్ స్వరపర్చిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. గడిచిన మూడు వారాల వ్యవథిలో తెలుగులో వచ్చిన అతని నాలుగో సినిమా ఇది. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణం విషయంలో రాజీ పడలేదు.చివరగా సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆ సన్నివేశాల ప్రభావం కొంతకాలం ప్రేక్షకులను వెంటాడేలా ఉంటుంది. కఠినమైన మనసున్న ప్రేక్షకుడిని సైతం కంటతడి పెట్టించే స్థాయిలో క్లైమాక్స్‌ను దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కించారు.

రవితేజ తన ఇమేజ్‌ను పూర్తిగా పక్కనపెట్టి చేసిన ప్రయోగం ఫలించింది. ఆయనకు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఇరుముడి ద్వారా ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను ఈ చిత్రం దాటేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ ఇరుముడి సినిమా ఈ వీకెండ్ లో కుటుంబంతో కలిసి హాయిగా చూడదగిన భావోద్వేగ చిత్రమని నా అభిప్రాయం..

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!