వరలక్ష్మి కాదు! సుస్వర లక్ష్మి !!

Sharing is Caring...

Coconut pieces dipped in honey are her songs …………………

‘వేయి శుభములు కలుగు నీకు’ .. ఈ పాట వినగానే  ఓ నలభై  ఏళ్ళ క్రితం పుట్టిన వారికి  నటి,గాయని ఎస్ వరలక్ష్మి చప్పున గుర్తుకొస్తారు. అలాంటి పాటలు బోలెడు ఆమె ఖాతాలో ఉన్నాయి. అరుదైన గాత్రం ఆమెది. కొన్ని పాటలకు ఆమె గొంతు మాధుర్యాన్ని అద్దుతుంది.

తేనెలో ముంచి తీసిన కొబ్బరి ముక్కల్లాగా ఆ పాటలు అంత తియ్యగా ఉంటాయి. అందుకే ఆమె పాటలు  మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహామంత్రి తిమ్మరుసు లోని “లీలా కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగా”  పాట వింటే మనసు మరో లోకం లోకి వెళ్ళిపోతుంది.

ఆ పాటలో విరుపులు .. మెరుపులు అద్భుతంగా ఉంటాయి. పింగళి సాహిత్యానికి  పెండ్యాల బాణీలకు ఎస్ వరలక్ష్మి నూరు శాతం న్యాయం చేశారు.అలాగే  తన గాత్రానికి తగినట్టుగానే ఆ పాటలో నటిగా అపురూప హావభావాలను వరలక్ష్మి ప్రదర్శించారు.

అలాగే “తిరుమల తిరుపతి  వెంకటేశ్వరా” ‘నమో భూతనాథా’ , ‘రామా ఇది ఏమి కన్నీటి గాథ’  ఇంకా ఇలాంటి పాటలు చాలానే ఉన్నాయి. దేనికదే ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి. అసలు కొన్ని పాటలు ఆమె కోసమే పుట్టాయా అన్నట్టు కూడా ఉంటాయి.  ఎస్.వరలక్ష్మి కేవలం పాటలే కాదు తన తీయని గొంతుతో పద్యాల్ని కూడా ఎంతో చక్కగా పాడేవారు.

అప్పట్లో ఆమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇపుడు ఉన్నారు. ఇతర గాయనీ మణులతో ఆమెను పోల్చలేం.వరలక్ష్మి గొంతులో పలికే వేరియేషన్స్ ఇతరుల గొంతులో పలకవు. ‘వేయి శుభములు’ పాటలో రకరకాల వేరియేషన్స్ తన గొంతులో పలికించింది ఆమె. పాటకు తగినట్టు ధీరత్వం, సరసం, లాలిత్యం, మమకారం, ఎడబాటు వంటి ఫీలింగ్స్ ఆమె గొంతులో స్పష్టంగా వినబడుతాయి. 

అందుకే కాబోలు అప్పట్లో సినిమా పత్రికలు వరలక్ష్మిని తెలుగు సినిమా సుస్వరలక్ష్మి గా వర్ణించేవి.ఎన్టీఆర్ కూడా ఆమె ఫ్యాన్ అట. తన సినిమాల్లో నటించేటపుడు  షాట్ బ్రేక్ సమయంలో ఆమె చే పాటలు పాడించుకునే వారట. ఇక వరలక్ష్మి బాలమురళి ఫ్యాన్.’సతీ సావిత్రి’ కోసం కొన్నిపాటలు ఆయన సంగీతదర్శకత్వలో ఆమె రికార్డు చేయించారు.

మరికొన్ని పాటలకు  ఎస్. రాజేశ్వర రావు,మల్లిక్,వేణు,బాబూరావు, హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి,లక్ష్మీనారాయణ బాణీలు అందించారు. వీరు కాక పద్యాలకు పి.సూరిబాబు సంగీతం అందించారు. నేపధ్య సంగీతం వెంకట్రామన్ నిర్వహించారు. ఇంతకూ ఆ సినిమా నిర్మాత మరెవరో కాదు వరలక్ష్మే. అక్కినేని సత్యవంతుడిగా, ఎస్వీఆర్ యమధర్మరాజుగా నటించారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

కాగా తొమ్మిదేళ్ల వయస్సులోనే  ‘బాలయోగిని’ చిత్రం ద్వారా వరలక్ష్మి వెండితెరకు పరిచయమయ్యారు. ‘బాలరాజు’ సినిమాతో ఆమె కథానాయికగా తెలుగు పరిశ్రమ కొచ్చారు. మంచి గాత్రం, తనదైన సహజ నటనతో ఆమె దక్షిణాది ప్రేక్షకులను అలరించారు.ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో నటించారు.ఏ భాషలో నటించినా అవసరాన్నిబట్టి తన పాత్రకు తానే గాత్రం ఇచ్చేవారు.

‘దీపావళి’,’శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’, ‘మాంగల్య బలం’, ‘ఆదర్శ కుటుంబం’, ‘ప్రేమ్‌నగర్’, ‘బొమ్మా బొరుసా’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘లవకుశ’, ‘సత్య హరిశ్చంద్ర’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’ వంటి సినిమాల్లో ఆమె నటించారు.

అత్తగారి పాత్రల్లో బాగా రాణించారు. ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో కుంతీ పాత్ర ఆమెదే. సాంఘిక సినిమాల్లో వదిన పాత్ర కూడా ఆమె చేసేది. కమల హాసన్ హీరోగా చేసిన ‘గుణ’ చిత్రంలో ఆమె చివరి సారి నటించారు.

జగ్గంపేట కు చెందిన వరలక్ష్మి చిన్నప్పుడే చెన్నై వెళ్లారు. ప్రముఖ తమిళ కవి కణ్ణదాసన్ తమ్ముడు పి.ఎల్.శ్రీనివాసన్ ను ఆమె వివాహమాడారు. అయిదు దశాబ్దాలు ఒక వెలుగు వెలిగిన వరలక్ష్మి చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డారని అంటారు. 2009 సెప్టెంబర్ లో ఆమె కన్నుమూసారు. గాయనీమణులు ఎందరు వచ్చినా ఆమె స్థానాన్ని పూరించే వారు లేరు. 

————-KNM

ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>   ఎవర్ గ్రీన్ సాంగ్ ‘సఖియా వివరించవే’ !

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!