తమిళనాట రాజకీయాల్లోకి దిగిన సినిమా నటులు చాలామందే ఉన్నారు . వారిలో హీరో విజయ్‌కాంత్ ఒకరు. 2005 లో విజయ్ కాంత్ దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పేరిట పార్టీని పెట్టారు. నగరా గుర్తుతో నాడు బరిలోకి దిగిన విజయ్ కాంత్ పార్టీ ఒక సీటుకే పరిమితమైంది. వ్రిదాచలం నియోజకవర్గంలో విజయకాంత్ మాత్రమే గెలిచారు. మిగిలిన అన్ని చోట్లా పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో 39స్థానాల్లో పోటీచేసిన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అప్పట్లో సుమారు 30 లక్షల ఓట్లు ఆ పార్టీకి పడ్డాయి . ఇక 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 29 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పట్లో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. నాటి ఎన్నికల్లో డీఎంకే ను పక్కకు నెట్టి డీఎండీకే ప్రధాన ప్రతిపక్షం గా అవతరించడం గొప్ప విషయమే. కానీ ఆ విజయాన్నివిజయ్ కాంత్ నిలుపుకోలేకపోయారు. 2016లో ఒక్క సీటు కూడా గెలవ లేకపోయారు.
అప్పటి ఎన్నికల్లో విజయకాంత్ సతీమణి ప్రేమలత పార్టీలో అన్ని తానై వ్యవహరించారు. పార్టీ కోశాధికారిగా ఆమె పనిచేశారు. టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పోటీ చేసే అభ్యర్థులనుంచి సొమ్ములు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు నేతలు ప్రేమలతపై ఆరోపణలు చేస్తూ పార్టీని విడిచిపెట్టి వెళ్లారు. నాటి ఎన్నికల్లో ఈ అంశం పార్టీని దెబ్బతీసింది. పార్టీలో ప్రేమలత ప్రాధాన్యతను తగ్గించాలని విజయ్ కాంత్ అనుకున్నప్పటికీ ఆయన అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేకపోయారు. ఆ మధ్య విజయ్ కాంత్ అమెరికా వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకుని వచ్చారు.2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీతో కలసి బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు. ఒక్క సీటు కూడా పార్టీ గెలవలేకపోయింది.విజయ్ కాంత్ ప్రచారంలో పెద్దగా పాల్గొనక పోవడం వలనే పార్టీ ఓటమి పాలయిందని అభిమానులు అంటారు.తమిళనాడులో కొంత క్రేజ్ ఉన్ననేత విజయకాంత్. ఆయన కంటూ కొంత ఓటు బ్యాంక్ ఉంది. కానీ పార్టీ ని సరైనరీతిలో నడిపించే ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడంతో పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నది.
పార్టీ స్వింగ్ లో ఉన్న సమయంలో మితిమీరిన ఆత్మ విశ్వాసం , సకాలంలో నిర్ణయాలు తీసులేకపోవడం వంటి కారణాలు పార్టీ ని దెబ్బతీశాయి. ప్రస్తుతం విజయకాంత్ ఆర్ధిక పరిస్థితి బాగోలేదు . గత ఏడాది బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవడంతో విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది.ఇక పార్టీకి 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 8.38 శాతం ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో 10.8 శాతం ఓట్లను దక్కించుకున్నపార్టీ … 2011 ఎన్నికల్లో 7.88 శాతం ఓట్లను రాబట్టుకుంది. 2016లో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.39 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో 2.19 శాతం ఓట్లు మాత్రమే రాగా ప్రాంతీయ పార్టీ హోదాను కోల్పోయింది. కాగా కొద్దీ రోజుల క్రితం విజయకాంత్ అన్నాడీఎంకే ఫ్రంట్ నుంచి బయటకొచ్చారు. సొంతంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈసారి అయినా విజయ్ కాంత్ సత్తా చాటుకోగలరో లేదో చూద్దాం.
———–KNM