సురేశ్ వెలుగూరి…………..
(నల్లమల వాలిమామ ప్రపంచం సిరీస్ రచయిత)
పై మాటలన్నది ఒక సాధారణ వ్యక్తి కాదు. రోదసిలో మూడుసార్లు ప్రయాణించిన నాసా సైంటిస్టు, భారతీయ సంతతి మహిళ సునీతా విలియమ్స్. ఆమధ్య తిరువనంతపురాన్ని సందర్శించిన సునీత మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకున్నారు.
మనం జీవిస్తున్న భూమి గొప్పతనాన్ని మనం సక్రమంగా గుర్తించటం లేదని, అనేక రకాల మానసిక రుగ్మతలతో దీనిని మనమే విషమయం చేసుకుంటున్నామని ఆమె అన్నారు. తాను ఆకాశం నుంచి చూసినప్పుడు భూమి చాలా చిన్నదిగా కనిపించిందని, భారతదేశం ఒక చిన్న ముక్క లాగా కనిపించిందని, మనుషుల ఉనికి అసలుకే కనిపించలేదని చెప్పారు.
చంద్రుడి కక్ష్య నుంచి భారతదేశాన్ని ఫొటో తీయటం కూడా సాధ్యం కాదన్నారు. మనం విమానం నుంచి చూస్తేనే మనుషులు కనిపించరని, కానీ దానికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో వున్న చంద్రుడి మీద నుంచి చూస్తే ఎలా వుంటుందో ఊహించుకోమంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన జీవితాల్లోకి మనకు మనమే ఎన్నో ఇరుకులు తెచ్చిపెట్టుకుంటున్నామని, లేనివాటిని ఉన్నాయనే భ్రమలో జీవించటానికి ఇష్టపడుతున్నామన్నారు.
ఒకేఒక్క జీవితాన్ని జీవించటానికి మనిషి ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేనేలేదని, పనికిరాని ఆలోచనలు, చర్యలతో మన జీవితాల్ని సంక్లిష్టమయం చేసుకోవటం మంచిది కాదని సునీత హితవు చెప్పారు. మానవ జాతికి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు జీవించే అవకాశం వుందని, మనం భూమ్మీదికి తీసుకొస్తున్న మన తరాలు మనకంటే మెరుగ్గా జీవించగల అవకాశాల్ని కల్పించాల్సిన బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు.
ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సంఘటనలు ప్రకృతికి విరుద్ధంగా వుంటున్నాయన్నారు. కాలుష్యాన్ని అపరిమిత స్థాయిలో పెంచుకుంటున్నామని, ఇలాంటి చర్యలు ప్రకృతిని నాశనం చేయటమే కాక మనుషుల మధ్య సంబంధాల్నీ చెడగొడుతున్నాయన్నారు. మనం రాతియుగంలో జీవించటం లేదని, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఎంత సౌకర్యవంతంగా జీవి స్తున్నామో, మన జీవితాల ఆచరణ కూడా అంతే వుండాలన్నారు.
భూమిని ఇల లో స్వర్గం అంటారని, కేరళను దేవభూమి అని అందుకే పిలుస్తారని చెప్పారు. కేరళ జీవితం నుంచి తానెంతో నేర్చుకున్నానని, ఇక్కడి ప్రజలు వివేచనతో కూడిన ఆలోచనలు చేయటానికి ప్రాధాన్యమిస్తారన్నారు.
మానసిక అపోహల నుంచి బయటపడితేనే మనిషికి మనుగడ సాధ్యమని, మనకు భోజనం, నిద్ర ఎలాగో ప్రకృతిని సంరక్షించుకోవటమూ అంతే అవసరమన్నారు.మనం మన ఉనికిని కాపాడుకోవటానికి డబ్బు రూపంలో సంపాదించేదాంట్లో కొంతైనా ప్రకృతి కి వెనక్కివ్వాలని సునీత సూచించారు.
ఈ పర్యాటనలో సునీత భారత రాష్ట్రపతి, ప్రధాని,కొందరు ముఖ్యమైన నేతలు, పారిశ్రామికవేత్తలను కలిశారు. అన్నిచోట్లా ఆమె తన భావనల్ని స్పష్టంగా వ్యక్తపరిచారు. భూమిని మరింత నివాస యోగ్యంగా మార్చుకోవాలని, అందుకు తన బాధ్యతను తాను నిర్వహిస్తూనేవున్నానని చెప్పారు.

