Suspense Thriller ……
దర్శకుడు జీతూ జోసెఫ్ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొట్టింది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు దృశ్యం 3 కూడా రిలీజ్ కి సిద్ధం కాబోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాను ఏప్రిల్ 2 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు..
మలయాళం వెర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. హిందీ వెర్షన్ అక్టోబర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.డేట్స్ ఖరారు కాలేదు.
తెలుగులో వెంకటేష్ హీరోగా ఈ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.నటి శ్రీప్రియ భర్త రాజ్ కుమార్ సేతుపతి, దగ్గుబాటి సురేష్ తెలుగులో రెండు సినిమాలు తీశారు కాబట్టి తెలుగులో ‘దృశ్యం 3’ కూడా వారే తీయవచ్చు.
ఇక దృశ్యం 1,2 సినిమాల గురించి చెప్పుకోవాలంటే దృశ్యంలో ఎక్కడైతే కథ ఆగుతుందో అక్కడనుంచే దృశ్యం 2 మొదలవుతుంది. సినిమాలో కథే హీరో. అందుకే సినిమా అందరిని ఆకట్టుకుంటోంది. నటించిన హీరోలు కమర్షియల్ వాల్యూస్ ను పక్కన బెట్టారు.ముఖ్యంగా ఫైట్స్.. పాటలు లేకుండా తీయడం గొప్ప విషయమే.
మలయాళ మాతృకతో పోలిస్తే తెలుగు వెర్షన్ లో పెద్ద మార్పులేమీ లేవు. ప్రథమార్ధం కొంచెం స్లో గా నడుస్తుంది. ద్వితీయార్ధం కథ,కథనాలు పరుగు దీస్తాయి. ఊహించని మలుపులు… ఏమి జరగబోతుందా అని ప్రేక్షకుడు ఆలోచనలో పడతాడు. హీరో చట్టానికి దొరికిపోయాడు .. శిక్ష పడటమే తరువాయి అనుకునే లోగానే కథ మలుపు తిరుగుతుంది.
సినిమా లో చిన్న చిన్న లోపాలు లేకపోలేదు. కుటుంబాన్ని కాపాడటం కోసం సాక్ష్యాలను తారు మారుచేసి హీరో శిక్ష నుంచి తప్పించుకోవడం నిజ జీవితంలో సాధ్యం కాదు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి …కాబట్టే నేరస్తులు తప్పించుకుంటున్నారని ..ఇలాంటివి సాధ్యమే అన్నట్టుగా ఐజీ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అండర్ కవర్స్ ఎలా పనిచేస్తారో ? ఎలా సమాచారాన్ని సేకరిస్తారో దర్శకుడు బాగా చూపారు. హత్య కేసులో అండర్ కవర్స్ ను ఉపయోగించడం చాలా తక్కువ.
ఇక కొన్ని సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. పోలీస్ ఇంటరాగేషన్ లో వెంకటేష్ పై నదియా చేయి చేసుకోవడం వంటి సన్నివేశాలు బాగా పండాయి. నదియా నరేష్ ల పాత్రలు చిన్నవైనా కీలకమైన క్యారెక్టర్లు. ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే నాకైనా ఆ రహస్యం చెప్పండి అంటూ మీనా వెంకటేష్ ను అడిగే సీన్ కూడా ఆకట్టుకుంటుంది. మీనా వెంకటేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఐజీ పాత్రలో సంపత్ రాజ్ మెప్పించారు. పోలీస్ కరకుదనాన్ని బాగా పలికించారు. తనికెళ్ళ భరణి కూడా అంతే. సినిమా చివరి అరగంట మిస్ కాకుండా చూడాలి. అలాగే మొదటి పార్ట్ చూస్తేనే ప్రేక్షకులు అసలు థ్రిల్ ఫీలవుతారు.
అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ … సతీష్ కురుప్ కెమెరా పనితనం సినిమాకు అస్సెట్ అయ్యాయి. సామల రాసిన డైలాగులు బాగున్నాయి. ప్రస్తుతం ‘దృశ్యం’ హాట్ స్టార్ లో .. ‘దృశ్యం 2’ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సకుటుంబ సమేతంగా చూడవచ్చు.
ఇక ‘దృశ్యం 3’ పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘దృశ్యం 3’ మునుపటి భాగాల తరహాలో కేవలం ట్విస్టుల మీద ఆధారపడకుండా, కథనం చాలా సహజంగా ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్ అంటున్నారు. రెండో భాగంలో మాదిరిగా మూడో భాగంలో కూడా మైండ్ గేమ్స్ ఉంటాయని ఆశించి వస్తే నిరాశ చెందుతారని, ‘దృశ్యం 3’ కథ భావోద్వేగాల చుట్టూ నడుస్తుందని ఆయన ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.
ఆయన చెప్పిన మాటలను బట్టి సినిమా చివరలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుందని అంచనా వేయవచ్చు. మలయాళం సినిమా సాధించే ఫలితాలపై ఇతర భాష ల్లో రీమేక్ కావచ్చు.
‘దృశ్యం’ విజయం సాధించడంతో హిందీ,తమిళం, తెలుగుతో సహా పలు భాషల్లో రీమేక్ చేసారు. ఈ చిత్రం భారతీయ రీమేక్ హక్కులు ₹155 మిలియన్లకు అమ్ముడయ్యాయి. తమిళ్ లో కమల హాసన్, గౌతమి నటించారు. ‘పాపనాశం’ పేరుతో రిలీజ్ అయింది.
దృశ్యం ఫిల్మ్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, సింహళ భాషలతో సహా అనేక భాషలలో మంచి వసూళ్లను రాబట్టింది.
@ తెలుగు… దృశ్యం (2014) : ₹45.6 కోట్లు,
@ తమిళం… పాపనాశం (2015) : ₹105 కోట్లు
@ హిందీ… దృశ్యం (2015) : ₹147.8 కోట్లు,
@ సింహళ… ధర్మయుద్ధయ (2017) : ₹5.07 కోట్లు వసూలు చేసింది..
ఈ సినిమాను చైనా లో కూడా రీమేక్ చేశారు.
@ చైనా … ‘గొర్రెల కాపరి లేని గొర్రెలు’ పేరిట తీయగా (2019) అక్కడ పెద్ద హిట్ అయింది.
@ దృశ్యం (2015) : ప్రపంచవ్యాప్తంగా ₹1.1 బిలియన్ (US$13 మిలియన్లు)
@ దృశ్యం 2 (2022) : ప్రపంచవ్యాప్తంగా ₹345.05 కోట్లు (US$40 మిలియన్లు) వసూలు చేసింది.
@ దృశ్యం సినిమాను కొరియన్ భాషలో కూడా రీమేక్ చేస్తున్నారు.

