Credibility has eroded………….
ఢిల్లీ మద్యం విధానం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. దేశ రాజధాని ముఖ్యమంత్రిని నెలల తరబడి జైలు పాలు చేసిన ఈ కేసులో, చివరకు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల పరువు పోయింది.వాటి విశ్వసనీయత సన్నగిల్లిపోయింది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిస్తూ, ఈ కేసు కేవలం “ఊహల మీద ఆధారపడి నిర్మించిన కథ” అని తేల్చింది. సాక్ష్యాధారాలు లేకపోయినా నిందితులను ఇరికించినందుకు దర్యాప్తు అధికారులపై చర్యలకు ఆదేశించింది. ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇతరులకు క్లీన్ చిట్ ఇస్తూ కీలక తీర్పునిచ్చింది..
సాక్ష్యాధారాల లేమి (Lack of Evidence)
సీబీఐ మోపిన అభియోగాలు కేవలం “అంచనాలు, ఊహల” (Conjecture) పై ఆధారపడి ఉన్నాయని, ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.మద్యం కుంభకోణం నుండి వచ్చిన సొమ్ముకు, కేజ్రీవాల్‌కు మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం (Money Trail) ఉన్నట్లు ఈడీ నిరూపించలేకపోయిందని గతం లోనే న్యాయస్థానం చెప్పింది.మద్యం విధానం రూపకల్పనలో ఎటువంటి నేరపూరిత కుట్ర లేదా దురుద్దేశం లేదని కోర్టు తేల్చిచెప్పింది.
దర్యాప్తు తీరుపై తీవ్ర విమర్శలు
నిందితులుగా ఉండి అప్రూవర్లుగా మారిన వారి సాక్ష్యాల ఆధారంగానే కేసును నిర్మించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ విలువల ఉల్లంఘన అని అభివర్ణించింది. సీబీఐ దర్యాప్తు అస్తవ్యస్తంగా ఉందని కోర్టు తప్పుబట్టింది. దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణకు (Departmental Inquiry) కూడా సిఫార్సు చేసింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం 22 నెలల పాటు లేనప్పుడు, ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని సుప్రీంకోర్టు గతంలోనే ప్రశ్నించింది.
రాజకీయ వేధింపుల ఆరోపణలు
దర్యాప్తు సంస్థలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈ కేసులను వాడుకుంటున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలకు, తాజా కోర్టు తీర్పు బలాన్ని చేకూర్చింది.
సీబీఐ కేసు కుప్పకూలడంతో దానిపై ఆధారపడిన ఈడీ కేసు కూడా బలహీనపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది..అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానంలో రూ. 100 కోట్ల అవినీతి జరిగిందని, ఆ నిధులను గోవా ఎన్నికల్లో వాడారని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి అగ్రనేతలను అరెస్ట్ చేసి, దాదాపు 156 రోజుల పాటు జైలులో ఉంచారు.తర్వాత వారు బెయిల్ పై విడుదలయ్యారు.
ఒక ముఖ్యమంత్రిని అక్రమంగా నిర్బంధించారనే కోర్టు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని రాజేశాయి. ఇది కేవలం అవినీతిపై పోరాటమా లేక రాజకీయ వేధింపా? అనే చర్చకు దారితీసింది.ఇక ఈ తీర్పు తన నిజాయితీకి నిదర్శనమని చెబుతూ కేజ్రీ వాల్ ప్రధాని మోదీకి ఒక బహిరంగ సవాలు విసిరారు.
“దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించండి. ఒకవేళ బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే, నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను” ఛాలెంజ్ చేశారు.ఈ కేసు స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని ఆయన అభివర్ణించారు.

