అన్నగారు చేయించిన ఆ స్టింగ్ ఆపరేషన్ కథేమిటి ?

Sharing is Caring...

Bhavanarayana Thota……………..

1984 లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఒక మంత్రి బర్తరఫ్ కు కారణమైంది. అప్పటికి గ్రామపంచాయితీగా ఉన్న కూకట్ పల్లికి సర్పంచ్ గా పనిచేసిన రామచంద్రరావుకు టీడీపీ ఖైరతాబాద్ టికెట్ దక్కింది. పీజేఆర్ ను ఓడించిన రామచంద్రరావును కార్మికశాఖ మంత్రి పదవి వరించింది.

కొద్ది రోజులకే ఆయన తన కొడుకు పెళ్లి ఘనంగా చేశారు. ఎంత ఘనంగా అంటే.. అతిథిగా వెళ్ళిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేంతగా!కానీ ఆ పెళ్లి జరిగిన తీరు ఎన్టీఆర్ ను మరోలా ప్రభావితం చేసిందని చెబుతారు. అది అసూయగా అభివర్ణించినవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి తన మంత్రి మీదనే స్టింగ్ ఆపరేషన్ చేయించారు.

సినిమా నేపథ్యంతో.. నాటకీయత ఇష్టపడే ఎన్టీయార్ ఆదేశాలమీద ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ముందుగా ఒక వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుంటూ మంత్రి పర్సనల్ సెక్రెటరీ గఫార్ తో మాట్లాడి అతనికి వెయ్యి, మంత్రికి పదివేలు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఫోన్ సంభాషణ మొత్తం టేప్ రికార్డర్ లో రికార్డ్ చేశారు. మరునాడు ఆ వ్యక్తి తన కాకినాడ ఆయిల్ మిల్లు సమస్య పరిష్కరించాలంటూ మంత్రికి 10 వేల కవర్ ఇచ్చి బైటికి రావటం రెండే రెండు నిమిషాల్లో పూర్తయింది.
*****
బేగంపేటలోని మంత్రి నివాసం బయట ఎదురుచూస్తున్న అదనపు డీజీపీ అప్పారావు వెంటనే మంత్రి ఛాంబర్ లోకి వెళ్ళటం ఆయన మీద అభియోగం మోపటం వెనువెంటనే జరిగిపోయింది. మోసపూరితంగా ఇరికించారంటూ చెప్పుకోవటానికి మంత్రి ఎన్టీఆర్ దగ్గరికెళ్లినా కలవటం కుదరలేదు. అప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సమావేశాలు అయ్యాక బర్తరఫ్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు.

కానీ ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలు బైటపెట్టటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మంత్రి మాధవరం వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. కావాలనే సీఎం తనని ఇరికించారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్ రాజకీయ గురువైన మదన్ మోహన్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో ఎన్టీఆర్ తీరును సభలో ఎండగట్టారు. ఒక మంత్రి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని గద్దించారు.

ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎన్టీఆర్ సహా చాలామంది మీద ఆరోపణలు ఉండగా మాధవరం మీదనే ఎందుకిలా అని కేశవరావు నిలదీశారు. అక్కినేని నాగార్జున పెళ్ళికోసం మద్రాసు వెళ్ళిన ఎన్టీఆర్ హుటాహుటిన హైదరాబాద్ తిరిగి వచ్చి.. రామచంద్రరావును బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫార్సు చేశారు.

మరుసటి రోజు .. అంటే 1984 ఫిబ్రవరి 20 నాడు ఈ విషయ శాసనసభను కుదిపేసింది. మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించారో, ఎందుకు తప్పించారో సభకు తెలియాలని జనతాపార్టీ సభ్యుడు ఎస్ జైపాల్ రెడ్డి కోరారు. పత్రికలద్వారా బైటికొచ్చిందని, ఆ తరువాత గవర్నర్ ఉత్తర్వులు వెలువడ్డాయని, అసలు విషయం సభకు తెలియజేయాలని బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు కూడా కోరారు.

అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీరామారావు సభలో తన ప్రకటన చదివారు. “ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వచ్చమైన, సమర్థవంతమైన పాలనమ అందించటానికి కృషి చేస్తానని వాగ్దానం చేసిన సంగతి గుర్తు చేశారు. శ్రీ రామచంద్రరావు నిజాయితీ సంశయాస్పదముగా వున్నట్లు అనుమానము కలిగినందున .. మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా నిన్న గవర్నరు గారికి సిఫార్సు చేశాను” అని చెప్పారు. 

చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా జరిగిన ఈ ప్రహసనం మీద తన అభిప్రాయం చెప్పటానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు మదన్ మోహన్ స్పీకర్ ను అడిగారు. మంత్రిని తొలగించటం ముఖ్యమంత్రి ఇష్టమే అయినా, సభ జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకునే హక్కు సభకే ముందుంటుందన్నారు. పైగా, పత్రికల్లో వార్త రాగానే తాను నోటీసు కూడా ఇచ్చానన్నారు.

జైపాల్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వం తనంతట తానుగా సభలో ప్రకటన చేయలేదని, అంతకు ముందే ప్రతిపక్ష నాయకుడు నోటీసు ఇవ్వటం వలన ఈ అంశం భిన్నమైనదని, మదన్ మోహన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వటం సమంజసమేనంటూ మద్దతుగా మాట్లాడారు. వెంకయ్య నాయుడు కూడా ఇదే వాదనను సమర్థించారు.

ఆ తరువాత మదన్ మోహన్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరును సుదీర్ఘంగా విశ్లేషించారు. ఏమైనా.. ట్రాప్ చేసినట్టు మాత్రం సభలో చెప్పకుండా ఎన్టీఆర్ దాటవేశారు. ఆ ఆడియో టేపులు రామకృష్ణ స్టూడియోలోనే ఎందుకు పరిశీలించారన్న ప్రతిపక్షాల ప్రశ్నకూ జవాబు రాలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు తన మంత్రి వర్గ సహచరుడి మీద చేసిన స్టింగ్ ఆపరేషన్ చరిత్రలో ఒక వివాదంగా, ఒక సంచలనంగా మిగిలిపోయింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!