N.V.S.Rammohan ………..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2025 అక్టోబర్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుల్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర 388 కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
2023 సం..నికి గాను తెలంగాణ పోలీసులు 336 కేసులు నమోదు చేశారు.ముఖ్యంగా వ్యభిచారం (Prostitution) కోసం మహిళల అక్రమ రవాణా జరుగుతున్న కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.లైంగిక దోపిడీ లేదా వ్యభిచారం కోసం జరుగుతున్న అక్రమ రవాణా కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడవ స్థానంలో ఉంది.
మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఏడవ స్థానంలో ఉంది. 2023లో ఏపీలో 123 కేసులు నమోదయ్యాయి. ఇది 2022 (163 కేసులు) తో పోలిస్తే కొంత తక్కువ.తెలంగాణలో2023లో 626 మందిని రక్షించగా, అందులో 604 మంది మహిళలే ఉన్నారు.
ఈ రాష్ట్రాలు అక్రమ రవాణాకు కేవలం మూలస్థానాలు (Source) మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి బాధితులను తీసుకువచ్చే గమ్యస్థానాలుగా (Destination) కూడా మారుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అక్రమ రవాణా కేసుల్లో నేర నిరూపణ రేటు (Conviction Rate) చాలా తక్కువగా ఉంది. ఏపీలో ఇది కేవలం 2.3% కాగా, తెలంగాణలో 3.7% మాత్రమే ఉంది.
నేర నిరూపణ తక్కువగా ఉండటానికి కారణం
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) .. సామాజిక విశ్లేషణల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో మానవ అక్రమ రవాణా కేసుల్లో నేర నిరూపణ (Conviction Rate) తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు
సాక్ష్యుల విముఖత (Hostile Witnesses)….. బాధితులు కోర్టులో తమ స్టేట్‌మెంట్‌ను మార్చడం లేదా నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడం ప్రధాన సమస్య. విచారణలు ఆలస్యం కావడంతో, బాధితులు సామాజిక ఒత్తిడికి లోనవడం లేదా నిందితుల నుంచి బెదిరింపులు ఎదుర్కోవడం వల్ల వెనక్కి తగ్గుతున్నారు.
లోపభూయిష్టమైన దర్యాప్తు……. చాలా కేసులు స్థానిక పోలీస్ స్టేషన్లలో సాధారణ సిబ్బంది ద్వారా దర్యాప్తు చేయబడతాయి. వీరికి అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ఛేదించే ప్రత్యేక శిక్షణ లేదా సమయం ఉండదు. ఫలితంగా, కోర్టులో నిలబడే బలమైన సాక్ష్యాధారాలను (ఎవిడెన్స్) సేకరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు.
అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌లు……….అక్రమ రవాణా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి జరుగుతుంటుంది. కానీ దర్యాప్తు అధికారులు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిహద్దులు దాటి దర్యాప్తు చేసేందుకు అవసరమైన వనరులు, అధికారాలు లోకల్ పోలీసులకు ఉండవు.
AHTU విభాగాలు బలంగా లేకపోవడం…… మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు (Anti-Human Trafficking Units – AHTUs) ఉన్నప్పటికీ, వాటికి కొన్ని చోట్ల స్వయంగా FIR నమోదు చేసే లేదా అరెస్టు చేసే పూర్తి అధికారాలు లేవు. దీనివల్ల ఇవి కేవలం నామమాత్రపు విభాగాలుగా మిగిలిపోతున్నాయి.
సమయం పట్టడం (Trial Delays)…… కోర్టుల్లో కేసులు తేలడానికి ఏళ్ల సమయం పడుతోంది. ఈ క్రమంలో బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం లేదా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడం వల్ల విచారణకు హాజరుకావడం లేదు.
బాధితులకు భద్రత లేకపోవడం……. కేసు నడుస్తున్న సమయంలో బాధితులకు అవసరమైన ఆర్థిక సహాయం, పునరావాసం, రక్షణ (Victim Protection) అందకపోవడం వల్ల వారు నేరస్థులతో రాజీపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2023-2025 మధ్య గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో నేర నిరూపణ రేటు కేవలం 2.3% గా ఉండగా, తెలంగాణలో 3.7% మాత్రమే ఉంది. ఈ పరిస్థితులను మార్చడానికి కోర్టుల్లో ప్రత్యేక విచారణలు (Speedy Trials) సాక్ష్యాధారాల సేకరణలో సాంకేతికతను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

