ఆ ఇద్దరి కాంబినేషన్ అదుర్స్ !!

Sharing is Caring...

గరగ త్రినాధరావు……………

నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా అంటేనే నాకు భయం వేసింది.. అనిల్ రావిపూడి బెస్ట్ రైటింగ్స్ ‘పటాస్’, ‘రాజా ది గ్రేట్’.. ఈ రెండూ తప్ప అతని సినిమాలు నాకు పెద్దగా నచ్చవు.. మనకు నచ్చకపోతే ఏమవుతుందిలే జనాలు ఎగబడి చూస్తున్నారుగా.

అంతెందుకు నిరుడు రిలీజ్ అయిన’ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అయితే నేను ఓటిటిలో చూశాను. అంత భయం నాకు అనిల్ అంటే..ఇంట్లో వాళ్ల పోరుతో తప్పక మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ చూసా..చూశాక నా మొట్టమొదటి ఇన్నర్ ఫీలింగ్.. సూపర్ స్టార్లతో సినిమా ఎలా తీయకూడదో మారుతి ‘రాజాసాబ్’ చిత్రం ద్వారా చెబితే.. అదే మెగాస్టార్ తో సినిమా ఇలా కూడా తీయొచ్చని అనిల్ రావిపూడి చేసి చూపించాడు.

ఇంత క్లీన్ అండ్ క్లియర్ మూవీని ఇంత డీసెంట్‌గా తీయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఈ విషయంలో దర్శకుడు తో పాటు ప్రొడక్షన్ టీమ్ పనితనం, వాళ్ల వర్క్ డెడికేషన్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక్కడ మాత్రం అనిల్ రావిపూడి నాకు తెగ నచ్చేసాడు.కొందరు డైరెక్టర్లు ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే సంవత్సరాల తరబడి సమయం తీసుకుని, వందల వేల కోట్లు ఖర్చుపెట్టించి, అటు నిర్మాతలను ఇటు ప్రేక్షకులను అనవసరమైన ఎక్సైట్‌మెంట్‌తో అలసటకు గురిచేస్తున్నారు. 

అలాంటి పరిస్థితుల్లో ఈ దర్శకుడు మాత్రం తక్కువ సమయంలో, క్లారిటీతో, అవసరమైనంత మాత్రమే చూపిస్తూ సినిమా ఎలా తీయాలో చేసి చూపిస్తున్నాడు. హాట్సాఫ్ టు అనిల్ రావిపూడి..కథ, కథనం, నటీనటుల వినియోగం అన్నీ ప్లాన్డ్ గా,డిసిప్లిన్‌తో నడిచాయి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా ఇండస్ట్రీలో చాలా మందికి నేరుగా ఒక సవాల్ విసురుతున్నాడు.

సినిమా మొత్తం చిరంజీవినే సెంటర్ పాయింట్ గా , ఫ్యాన్స్ ఒక్క క్షణం కూడా నిరుత్సాహపడకుండా వింటేజ్ చిరంజీవి స్టైల్, స్వాగ్, కామెడీ టైమింగ్‌ను ఫుల్‌గా వాడుకున్నాడు అనిల్ రావిపూడి.చిరు సిగ్గుపడటం, తన మీద తానే జోకులు వేసుకోవడం, ఎమోషన్ పండించడం చూస్తే ఇంకో పదేళ్లు మెగాస్టార్ కు డోకా లేదు అనిపిస్తుంది.

ఏంటి సినిమాలో అన్ని ప్లస్ లేనా మైనస్లు లేవా అంటే..ఉన్నాయి..ఎందుకంటే చిరంజీవి అంటే…యాక్టింగ్‌లో ఒక ఈజ్..డైలాగ్ డెలివరీలో ఒక క్యాజువల్ ఫ్లో. కామెడీలో అద్భుతమైన టైమింగ్.కానీ చాలా రోజులుగా ఇవన్నీ మిస్ అవుతున్నామనే ఫీలింగ్.

ఖైదీ నెంబరు 150 తర్వాత చిరు యాక్టింగ్ కష్టపడుతూ చేసినట్టు అనిపించడం,డైలాగులు పట్టి పట్టి చెప్పడం,కామెడీ సరిగ్గా కుదరకపోవడం..ఇవన్నీ నిజంగా నిరాశ పరిచే అంశాలే..కానీ ఈ అనిల్ రావిపూడి సినిమాతో ఆ దిగులు పూర్తిగా పోయింది.మళ్ళీ కొన్ని సినిమాల రిఫరెన్సు ల ద్వారా పాత చిరంజీవిని అనిల్ చిరు అభిమానులకు వంద శాతం చూపించాడు.

ఎప్పుడూ సెకండాఫ్ వీక్ గా రాసుకునే అనిల్ ముఖ్యంగా సెకండాఫ్ లో విక్టరీ వెంకీని తేవడం ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్..చిరు, వెంకీ ఇద్దరినీ పెద్ద స్క్రీన్ మీద కలిపి చూడటం నిజంగా చాలా బాగుంది..వీక్ విలనిజం ఓ మైనస్సు.

ఇక నటీనటుల విషయానికొస్తే చిరుకి జోడీగా శశిరేఖ పాత్రలో నయనతార చూడటానికి చాలా అందంగా కనిపించారు. ఆమె ఈ సినిమాలో కనిపించినంత స్టైలిష్‌గా ఈ మధ్య కాలంలో అయితే ఏ మూవీలోనూ కనిపించలేదు.చీర కట్టినా,సూట్ వేసినా,మోడ్రన్ లుక్‌లో మెరిసినా ప్రతి సీన్ లో నయన్ కూడా ఒకప్పటి గ్లామర్ క్వీన్‌లా మెరిశారు. తన పాత్రని అలా అలా ఈజ్‌తో ఈజీగా చేసుకుపోయారు. 

చిరు-నయన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది.సొంతంగా తనే డబ్బింగ్ కూడా చెప్పుకోవడం, అది బాగుండడం విశేషం. సచిన్ ఖేద్కర్ హీరోయిన్ తండ్రి పాత్రలో బాగా చేశాడు. వెంకటేష్ ఉన్న 20 నిమిషాలు ఆకట్టుకున్నాడు. కేథరిన్ థ్రెసా.. హర్షవర్ధన్.. అభినవ్ గోమఠం.. తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్ సుదేవ్ నాయర్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. తన పాత్రలో పెద్దగా విషయం లేదు. చిరు తల్లి పాత్రలో జరీనా వహబ్ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు.

 ‘సంక్రాంతికి  వస్తున్నాం’ బుల్లి రాజు పాత్రధారి రేవంత్.. ఇందులో మామూలే. చాన్నాళ్ల తర్వాత తెలుగు స్క్రీన్ మీద కనిపించిన శరత్ సక్సేనా జస్ట్ ఓకే అనిపించాడు.సినిమాలో సాంకేతికతను పరిశీలిస్తే భీమ్స్ సిసిరోలియో పాటలు ఆకట్టుకుంటాయి. అన్నింట్లోకి శశిరేఖ పాట హైలైట్ గా నిలిచింది. ఈ పాట టైమింగ్- చిత్రీకరణ బాగా కుదిరాయి. హుక్ స్టెప్ సాంగ్.. మీసాల పిల్ల కూడా ఆకట్టుకుంటాయి. 

భీమ్స్ నేపథ్య సంగీతం మాత్రం సోసోగా సాగింది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. సినిమాలో క్వాలిటీకి ఢోెకా లేదు. అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రిచ్ గా తీశారు. అనిల్ రావిపూడి తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే ఇచ్చాడు.చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే బాస్ ఈజ్ బ్యాక్ విత్ హిజ్ స్స్వాగ్ & వింటేజ్.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!