Impressive performance ……………..
1981లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా “ప్రేమాభిషేకం”లో జయసుధ వేశ్య పాత్రను పోషించారు. ఈ పాత్ర కథలో అత్యంత కీలకమైన మలుపులకు కారణమవుతుంది.మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే విషయంలో చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
అప్పటికే లక్ష్మి మల్లెపూవు సినిమాలో వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.వేరొకరు ఎవరా అని ఆలోచిస్తే దాసరికి జయసుధ బెటర్ అనిపించింది. కానీ ‘కేవలం 2 పాటలు, కొద్దిపాటి సీన్లు.. పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అని ANR అనుమానం వ్యక్తం చేశారు.ఆమెను ఒప్పించే బాధ్యతను దాసరి పైనే పెట్టారు.
జయసుధ కు ఈ విషయం చెప్పగా ముందు సంశయించారు. హీరోయిన్ శ్రీదేవి పాత్ర కంటే నీకే ఎక్కువ పేరు వస్తుంది. నా మాట విను అని దాసరి ఒప్పించారు.జయసుధ కూడా ధైర్యం చేసి ఆపాత్ర చేసేందుకు ఒకే అన్నారు.తెలుగు సినిమాల్లో చాలామంది వేశ్య పాత్రల్లో నటించారు. పాత్రను బట్టి ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్ లో నటించారు.
ఇక ‘ప్రేమాభిషేకం’లో కథానాయకుడు రాజేష్ (ANR) తనకు క్యాన్సర్ ఉందని తెలిసి, తను ప్రాణంగా ప్రేమించిన దేవి (శ్రీదేవి) తనను అసహ్యించుకుని వేరొకరిని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఈ క్రమంలో దేవి దృష్టిలో చెడ్డవాడిగా కనిపించేందుకు రాజేష్, జయంతి అనే వేశ్య సహాయం తీసుకుంటాడు.
జయంతి పాత్ర కేవలం ఒక వేశ్యగానే కాకుండా, రాజేష్ పడే వేదనను అర్థం చేసుకునే సహృదయవంతురాలిగా కనిపిస్తుంది. రాజేష్ తనపై చూపే గౌరవానికి ముగ్ధురాలై, చివరికి అతని భార్యగా పిలిపించుకోవాలని ఆశపడుతుంది. ఆమె కోరికను రాజేష్ పాత్ర తీరుస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాల్లో ANR జయసుధ పోటీ పడి నటించారు.
ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి కూడా, గ్లామర్ లేని ఒక వేశ్య పాత్రను పోషించడానికి ఆమె అంగీకరించడం విశేషం..ఈ పాత్రలో ఆమె కనబరిచిన భావోద్వేగపూరిత నటనకు గాను జయసుధకు నంది ఉత్తమ నటి అవార్డు లభించింది.
ఈ సినిమాలో రెండు పాటల్లో జయసుధ నటన బాగుంటుంది. అభిమానులను ,ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “ఆగదు .. ఆగదు ఏ నిమిషము” పాటను అక్కినేని ,జయసుధలపై చిత్రీకరించారు. ఈ పాటలో అక్కినేని నటన గురించి చెప్పనక్కర్లేదు. ఆ పాత్రలో అక్కినేని జీవించారు. ఆయనతో పోటీ పడి జయసుధ కూడా నటించారు.ఆ పాటలో జయసుధ పలికించిన హావభావాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. తనను భార్యగా అంగీకరించిన రాజేష్‌ను కళ్ల ముందే కోల్పోతున్న వేశ్యగా ఆమె పండించిన ఆవేదన ఆ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
ఇక “వందనం అభివందనం” పాటలో ఒక వేశ్యగా నర్తిస్తూ రాజేష్ పాత్రని ఆకట్టుకునేలా బాగా చేసింది. ఈ ప్రేమాభిషేకంలో ఆమె నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా హిట్ కావడానికి జయసుధ నటన కూడా కారణమని చెప్పుకోవచ్చు. దర్శకుడిగా దాసరి ఆమె పాత్రను అద్భుతంగా మలిచారు.. అలాగే నటనను రాబట్టుకున్నారు.ఈ సినిమా తర్వాతే జయసుధకు “సహజ నటి” అనే బిరుదు మరింత స్థిరపడింది.

