ఆ ‘ భీమశిల’ కథేమిటి ?

Sharing is Caring...

Bhima Shila……….

కేదార్‌నాథ్ ఆలయం వెనుక ఉన్న పెద్ద బండరాయిని ‘భీమశిల’ అని పిలుస్తారు. 2013లో సంభవించిన విధ్వంసకర వరదల సమయంలో ఈ రాయి ఆలయాన్ని రక్షించిందని భక్తులు నమ్ముతారు.

కథ ఏమిటంటే…. 

2013 జూన్ 16న కేదార్నాథ్‌లో భారీగా వరదలు వచ్చాయి. మూడు కిమీ దూరంలో ఉన్న చోరాబరి హిమానీ నదం వద్ద మేఘాల విస్ఫోటనం తో భారీ గా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు మంచు వేగంగా కరిగి, చోరాబరి సరస్సు నీళ్లు (గాంధీ సరోవర్) పొంగిపొర్లి కేదార్ వ్యాలీని ముంచెత్తాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు, ఒక పెద్ద బండరాయి (భీమశిల) వరదలో కొట్టుకొచ్చి, కేదార్‌నాథ్ ఆలయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ పెద్ద రాయి ఒక సహజమైన అడ్డుగోడ (natural barrier) గా పనిచేసి, ఉధృతంగా వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ఆలయానికి ఇరువైపులకు  మళ్లించింది.

దీని ఫలితంగా చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు, దుకాణాలు అన్నీ కొట్టుకుపోయినప్పటికీ, ప్రధాన ఆలయానికి ఎటువంటి పెద్ద నష్టం జరగలేదు.ఈ రాయి సుమారు 20 అడుగుల వెడల్పు,12 అడుగుల ఎత్తుతో (సుమారు 1000 మెట్రిక్ టన్నుల బరువు) చాలా భారీగా ఉంటుంది. ఈ సంఘటనను చూసిన భక్తులు దీన్నొక అద్భుతంగా భావించారు.

ఈ రాయికి మహాభారతంలోని పాండవ సోదరులలో ఒకరైన బలశాలి భీముడితో ఏదో సంబంధం ఉందని నమ్ముతారు. ఆలయాన్ని రక్షించిన ఈ ‘దివ్యమైన రాయి’కి భీమశిల అని పేరు పెట్టారు. అప్పటి నుండి దీనిని పూజిస్తున్నారు.

కొంతమంది ఇంజనీర్లు..భూగర్భ శాస్త్రవేత్తలు ఆలయ రూపకల్పన, రాయి అక్కడ కొచ్చి నిలవడం కేవలం యాదృచ్చికం కావచ్చు అంటారు. కానీ భక్తులు మాత్రం దీన్ని పరమశివుడి దైవిక జోక్యం గా భావిస్తారు.ఈ సంఘటన తరువాత, భీమశిల కేదార్‌నాథ్ ఆలయ పవిత్రతలో ఒక అంతర్భాగంగా మారింది.యాత్రికులు దీనిని భక్తితో దర్శించుకుంటారు.

కేదార్‌నాథ్ ఆలయం హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. ఈ ప్రాంతంలో హిమనీనదాలు ఉంటాయి. ఇది కొండచరియలు విరిగిపడే  ప్రాంతం కావడంతో, పర్వతాలలో సహజంగానే అలాంటి పెద్ద బండరాళ్లు అనేకం ఉంటాయి. వరదల సమయంలో ఇలాంటి రాళ్లు తరచూ కొట్టుకువస్తుంటాయి. అయితే, భీమశిల నిలచిన స్థానం..అది ఆలయాన్ని రక్షించిన తీరును భక్తులు ఒక అద్భుతంగా భావిస్తారు.

ఈ సంఘటన తరువాత, ఆలయ పునర్నిర్మాణ సమయంలో, భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల నుండి ఆలయాన్ని రక్షించడానికి ఇంజనీర్లు ఇదే “భీమశిల సిద్ధాంతాన్ని ఉపయోగించారు. ఆలయం వెనుక భాగంలో వరద ప్రవాహాన్ని మళ్లించేందుకు కాంక్రీట్ గోడలు,అడ్డుకట్టలు నిర్మించారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!