అట్లాంటిక్ సముద్రంలోనే మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న ఆ మంచుకొండ లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అతి త్వరలో ఇది ముక్కలై విడిపోయి సముద్రంలో తేలియాడే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రిటీష్ పరిశోధకులు ఈ ఐస్ బర్గ్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న ఈ మంచు కొండను A 68A గా పిలుస్తున్నారు. చిన్న ద్వీపమంత పరిమాణంలో ఉండే ఈ భాగం ఐస్ బర్గ్ నుంచి విడిపోయి A 68D గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. దక్షిణ జార్జియాకు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఈ విడిపోయే భాగం ఉంది.
ఈ విడిపోయిన భాగం దగ్గరలోని ఒక దీవిని ఢీకొట్టే ప్రమాదం ఉందా ? లేదా అని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే ఈ మంచుకొండ ప్రయాణిస్తున్న మార్గాన్ని అంచనా వేసిన పరిశోధకులు అది ఖచ్చితంగా జార్జియా ద్వీపం వైపు దూసుకెళ్తున్నదని అప్పట్లో ప్రకటించారు .ఈ మంచు పర్వతం చాలాకాలం క్రితం దక్షిణ ధృవంలోని అంటార్కిటికా మంచు ఖండం నుంచి వేరయింది. ఒకప్పుడు అది ఇపుడున్న సైజు కంటే పెద్దగా ఉండేది. కాలక్రమంలో ఈ మంచుకొండ మూడు ముక్కలయింది. ఆ మూడు ముక్కల్లో A 68 A అతి పెద్దదని పరిశోధకులు చెబుతున్నారు. దీని పొడవు 150 కిలోమీటర్లు. వెడల్పు 48 కిలోమీటర్లు ఈ కొలతలను బట్టి దాని సైజు ఎంతదో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కాగా మిగిలిన రెండింటిని సైజులు వారీగా A 68 B, A 68 C గా విభజించి పిలుస్తున్నారు. ఇపుడు పగుళ్లు ఏర్పడి విడిపోయే అవకాశం ఉన్న భాగాన్ని A 68 D గా ఇకపై పిలుస్తారు.
2017 లో అంటార్కిటికా లోని లార్సెన్ సి ప్రాంతంలో ఈ మంచుపర్వతం ముక్కలుగా విడిపోయింది . వాతావరణం లో వచ్చే మార్పుల కారణంగా మంచు కరిగి పర్వతం మూడు భాగాలుగా మారిందని భావిస్తున్నారు. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. మంచు ఎక్కువ కాలం గడ్డగా ఉండదని… నెమ్మదిగా కరిగిపోక తప్పదని శాస్త్రజ్ఞుల వాదన. మొత్తం మీద ఏదో ఒకనాటికి అంటార్కిటికా లో మంచు కరిగిపోతుందని వారు చెబుతున్నారు. అక్కడ మంచు కరిగిపోయే పక్షంలో భూమిపై సముద్ర మట్టం పెరిగిపోవచ్చు. ఫలితంగా కొన్ని ద్వీపాలు , కొన్ని దేశాల్లోని ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం కూడా లేకపోలేదు.
——————-– KNM