Ravi Vanarasi………….
మెక్సికన్ చిత్రకళా చరిత్రలో మాత్రమే కాదు, ప్రపంచ కళారంగంలో మ్యాగ్డలీనా కార్మెన్ ఫ్రిడా కాహ్లో కాల్డెరాన్ (Magdalena Carmen Frida Kahlo y Calderón) స్థానం అద్వితీయమైనది. ఆమె కేవలం ఒక చిత్రకారిణి మాత్రమే కాదు, ఆమె జీవితమే ఒక సుదీర్ఘమైన, రంగులమయమైన, హృదయాన్ని మెలిపెట్టే ఆత్మకథా చిత్రం .
ఫ్రిడా కాహ్లో (1907-1954) తన చిత్రాల ద్వారా సొంత జీవితంలోని ప్రతి అనుభవాన్ని – శారీరక క్షోభను, మానసిక సంఘర్షణను, ప్రేమ వైఫల్యాన్ని, రాజకీయ నిబద్ధతను – నగ్నంగా, నిష్కర్షగా చిత్రించి, కోట్లాది మంది ప్రేక్షకులను కదిలించింది. 143 చిత్రాలలో 55కి పైగా ఆత్మచిత్రాలు (Self-Portraits) చిత్రించిన ఆమె, తనను తాను అత్యంత దగ్గరగా, అత్యంత నిజాయితీగా అర్థం చేసుకున్న ఏకైక కళాకారిణిగా నిలిచింది.
ఫ్రిడా కళను విశ్లేషించే ముందు, ఆమె జీవిత నేపథ్యాన్నిఅర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె కళ, ఆమె జీవితం నుండి విడదీయరానిది. ఇది మెక్సికో విప్లవం తరువాత దేశం కొత్త గుర్తింపు కోసం అన్వేషిస్తున్న కాలం. ఆమె తన పుట్టిన తేదీని 1907 నుండి 1910కి మార్చుకుంది. దీనికి కారణం, ఆమె తన ఉనికిని మెక్సికన్ విప్లవం ప్రారంభంతో ముడిపెట్టాలని, దేశభక్తిని బలంగా చాటాలని కోరుకుంది.
ఆమె చిత్రాలు కేవలం రంగులు, గీతలతో కూడినవి కావు.. అవి మెక్సికనిడాడ్ అనే మెక్సికన్ జాతీయ గుర్తింపు సంస్కృతి, పూర్వ-కొలంబియన్ నమ్మకాలు, కాథలిక్ సంప్రదాయాలు, ఆధునిక రాజకీయ భావనల సమ్మేళనం.ఫ్రిడా కాహ్లో జూలై 6, 1907న మెక్సికో సిటీ శివార్లలోని కోయోకాన్ లో ఉన్న లా కాసా అజుల్ లో జన్మించింది.
ఆమె తండ్రి, గుల్లెర్మో కాహ్లో జర్మన్ సంతతికి చెందిన ఫోటోగ్రాఫర్, తల్లి మాటిల్డే కాల్డెరాన్ య్ గొంజాలెజ్ , స్పానిష్, స్వదేశీ (Mestiza) సంతతికి చెందినవారు. ఫ్రిడా తన తండ్రితో అనుబంధాన్ని పెంచుకుంది. గుల్లెర్మో ఆమెకు ఫోటోగ్రఫీలోని మెలకువలు నేర్పించారు. కళ పట్ల అవగాహనను పెంచారు. తండ్రి ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే ఆమె కళాత్మక దృక్పథానికి పునాది వేసిందనడంలో సందేహం లేదు.
ఆమె జీవితంలోని మొదటి పెను సవాల్ ఆరేళ్ల వయసులోనే ఎదురైంది. 1913లో, ఫ్రిడాకు పోలియోమైలైటిస్ (Polio) వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆమె కుడి కాలు పూర్తిగా ఎదగకుండా బలహీనపడింది.. శాశ్వతంగా నడవలేకపోవడానికి దారితీసింది. ఫ్రిడా తన లోపానీ కప్పిపుచ్చడానికి జీవితాంతం పొడవైన, సంప్రదాయ టెహువానా (Tehuana) దుస్తులను ధరించింది.
ఈ అనారోగ్యం ఆమెకు చిన్న వయస్సులోనే శారీరక నొప్పి, ఒంటరితనపు లోతైన అవగాహనను కలిగించాయి, ఇది భవిష్యత్తులో ఆమె కళలో ప్రధాన ఇతివృత్తంగా మారింది. తన శారీరక వైకల్యాన్ని అధిగమించేందుకు, ఆమె తండ్రి ప్రోత్సాహంతో ఫుట్‌బాల్, బాక్సింగ్ వంటి ఆటలలో చురుకుగా పాల్గొంది, అరుదైన మానసిక స్థైర్యాన్ని అలవర్చుకుంది.
కళ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, ఆమె మొదట్లో వైద్యురాలు కావాలని ఆశపడింది. 1922లో, ఆమె మెక్సికోలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ప్రిపరేటరీ స్కూల్ లో చేరింది. ఆ రోజుల్లో కేవలం ముప్పై-ఐదు మంది మహిళా విద్యార్థులలో ఆమె ఒకరు. ఇక్కడ ఆమె ‘లోస్ కాచుచాస్’ (Los Cachuchas) అనే విద్యార్థి సమూహంలో చేరి, రాజకీయ, మేధో చర్చలలో పాల్గొనేది.
ఈ పాఠశాలలోనే ఆమె ప్రఖ్యాత మెక్సికన్ కుడ్య చిత్రకారుడు డియాగో రివెరాను మొదటిసారి కలిసింది.ఫ్రిడా జీవితాన్ని మలుపు తిప్పిన భయంకరమైన సంఘటన 1925, సెప్టెంబర్ 17న జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వస్తున్న బస్సు, ఒక ట్రామ్ ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటన కారణంగా ఫ్రిడా శరీరం ఛిద్రమైంది.
ఆమె వెన్నెముక మూడు చోట్ల విరిగింది, పక్కటెముకలు పగిలాయి, కాలర్ ఎముక ఛిద్రమైంది, ముఖ్యంగా, ఆమె కటి ఎముక (Pelvis) బద్దలైంది. ఒక ఇనుప హ్యాండ్రైల్ ఆమె పొత్తికడుపు, గర్భాశయానికి గుచ్చుకుంది, అది ఆమెకు జీవితాంతం సంతాన సాఫల్యం లేని బాధను మిగిల్చింది. ఈ గాయాల తీవ్రత అసాధారణమైనది, మృత్యువుతో పోరాడిన ఆ ఘట్టం ఆమె జ్ఞాపకాల నుండి ఏనాడూ చెరిగిపోలేదు.
ఈ ప్రమాదం కారణంగా, ఫ్రిడా కొన్ని నెలల పాటు కదలకుండా పడకకే పరిమితమైంది, జీవితంలో దాదాపు 30కి పైగా శస్త్రచికిత్సలకు గురైంది. ఈ దీర్ఘకాలిక విశ్రాంతి కాలంలోనే ఆమె వైద్య వృత్తిపై ఆశలు వదులుకుని, కళను తన జీవిత మార్గంగా ఎంచుకుంది. తన తండ్రి, గుల్లెర్మో, ఆమెకు రంగులు, బ్రష్‌లు ఇచ్చారు.
ఆమె మంచంపై పడుకుని కూడా పెయింట్ చేయగలిగేలా ఒక ప్రత్యేకమైన ఈజిల్ను తయారు చేయించారు. తనను తాను మాత్రమే చూడగలిగేందుకు ఈజిల్‌పై అద్దం అమర్చారు. ఈ పరిమిత ప్రపంచంలో, ఫ్రిడా తనకు అత్యంత బాగా తెలిసిన విషయాలను చిత్రించడం ప్రారంభించింది.ఆమె బాధను, గాయాలను, వైద్య పరికరాలను, బలహీనతను, మృత్యువుకు దగ్గరగా వెళ్లి వచ్చిన అనుభవాన్ని అపారమైన శక్తితో కాన్వాస్‌పైకి తీసుకువచ్చింది.
స్త్రీలు తమ శారీరక, భావోద్వేగ బాధలను బహిరంగంగా వ్యక్తం చేయడం అరుదైన కాలంలో, ఫ్రిడా తన గర్భస్రావాలు, శస్త్రచికిత్సలు, నిరంతర వేదనను ప్రపంచం ముందు నిర్భయంగా ఉంచింది.ఫ్రిడా కాహ్లో జీవితం డియాగో రివెరా (Diego Rivera) పేరుతో ముడిపడి ఉంది. అతను అప్పటికే అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన, మెక్సికన్ కుడ్య చిత్రకళాకారులలో అగ్రగణ్యుడు.
కమ్యూనిస్ట్ ఉద్యమకారుడు. ఫ్రిడా కళాకారిణిగా తన భవితవ్యం గురించి సలహా అడగడానికి 1928లో డియాగోను ఆశ్రయించింది. డియాగో ఆమెలోని అసాధారణ ప్రతిభను, చిత్రాలలో వ్యక్తమవుతున్న నిజాయితీని వెంటనే గుర్తించాడు. వారి బంధం కొన్నాళ్ళకు ప్రేమగా మారింది.1929లో, 22 ఏళ్ల ఫ్రిడా, 42 ఏళ్ల డియాగో రివెరాను వివాహం చేసుకుంది.
ఇది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, కళాకారుల మధ్య, రాజకీయ సహచరుల మధ్య, మేధావుల మధ్య ఏర్పడిన శక్తివంతమైన అనుబంధం. వారిద్దరూ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీలో చురుకైన సభ్యులుగా ఉన్నారు, మార్క్సిస్ట్-లెనినిస్ట్ సిద్ధాంతాలకు నిబద్ధులై ఉన్నారు.
డియాగో రివెరా తన అపారమైన ప్రతిభకు ఎంత ప్రసిద్ధి చెందాడో, స్త్రీల విషయాలలో అంత అపఖ్యాతి పాలయ్యాడు. ఫ్రిడా కూడా, డియాగో వైఫల్యాల వల్ల కలిగిన బాధతో ఇతరులతో సంబంధాలను కొనసాగించింది. ఈ వైవాహిక సంక్షోభం ఫ్రిడా కళకు గొప్ప ప్రేరణగా మారింది.
1930 నుండి 1933 వరకు, డియాగో రివెరా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, డెట్రాయిట్, న్యూయార్క్ నగరాలలో కుడ్య చిత్రాల కమిషన్ల కోసం వెళ్లినప్పుడు ఫ్రిడా కూడా అతనితో పాటు ప్రయాణించింది.ఈ కాలంలోనే ఫ్రిడా గర్భస్రావాలను ఎదుర్కొంది, ఇది ఆమెను తీవ్రంగా బాధించింది. ఈ బాధను ఆమె “హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్ (Henry Ford Hospital, 1932)” వంటి చిత్రాలలో హృదయం ద్రవించే విధంగా చిత్రించింది.
అమెరికాలో ఉండగా, ఫ్రిడా పెట్టుబడిదారీ సంస్కృతిని విమర్శిస్తూ కూడా చిత్రాలు వేసింది. 1939లో, డియాగో తన సొంత చెల్లెలైన క్రిస్టినాతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడంతో, ఫ్రిడా విపరీతంగా బాధపడి, డియాగోకు విడాకులు ఇచ్చింది.
ఈ విడాకుల అనంతరం ఆమె చిత్రించిన అత్యంత ముఖ్యమైన చిత్రం “ది టూ ఫ్రిడాస్ (The Two Fridas, 1939)”. అయితే, కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే, 1940లో, వారు మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈసారి, రివెరా భార్యాభర్తల సంబంధం కంటే స్నేహితులుగా, కళాకారులుగా ఉండడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు, కానీ వారిద్దరూ జీవితాంతం ఒకరిపై ఒకరు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నారు.
ఫ్రిడా కాహ్లో కళా శైలిని ఏ ఒక వర్గంలోనూ ఇమడ్చడం సాధ్యం కాదు. ఆమె కళ నైఫ్ ఫోక్ ఆర్ట్ (Naïve Folk Art) నుండి ప్రేరణ పొందింది, ఇది మెక్సికన్ సంప్రదాయ, గ్రామీణ కళా రూపాలను ప్రతిబింబిస్తుంది.ఫ్రిడా మొత్తం 143 చిత్రాలలో 55కి పైగా స్వీయ-చిత్రాలను చిత్రించింది. దీనికి ప్రధాన కారణం ఆమె ఒంటరితనం, నిరంతర అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడం.
ఈ స్వీయ-చిత్రాలు కేవలం ఆమె ముఖాన్ని చూపించేవి కావు, అవి ఆమె అంతర్గత ప్రపంచానికి కిటికీలు. ఫ్రిడా కాహ్లో చిత్రాలలో తరచుగా కలలు, వింతైన సంకేతాలు, అవాస్తవ దృశ్యాలు ఉంటాయి కాబట్టి, ఫ్రెంచ్ సర్రియలిస్ట్ సిద్ధాంతకర్త ఆండ్రీ బ్రెటన్ (André Breton) ఆమెను సర్రియలిస్ట్గా ప్రకటించాడు. బ్రెటన్ 1938లో ఆమె చిత్రాలను “రిబ్బన్ చుట్టబడిన బాంబు”గా అభివర్ణించాడు.. పారిస్‌లో ఆమెచిత్రాలతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాడు.
అయితే, ఫ్రిడా తనను తాను సర్రియలిస్ట్గా ఎప్పుడూ అంగీకరించలేదు.ఆమె చిత్రాలలో తరచుగా కనిపించే సంకేతాలు, ఇతివృత్తాల ద్వారా ఆమె లోతైన విషయాలను తెలియజేసింది.. విరిగిన వెన్నెముకను చూపే “ది బ్రోకెన్ కాలమ్ (The Broken Column, 1944)” లో ఆమె శరీరం తెరిచి ఉంచబడుతుంది, లోపల ఉన్న పురాతన గ్రీకు స్తంభం విరిగిపోయి కనిపిస్తుంది. శారీరక క్షోభను ఇంత నిష్ఠూరం గా చిత్రించిన కళాకారులు అరుదు.
ఆమె మెడలో ముళ్లు ఉన్న హారం, ఒంటి నిండా గుచ్చుకున్న మేకులు ఆమె నిరంతర వేదనకు ప్రతీకలు.ఆమె చిత్రాలలో తరచుగా కోతులు, చిలుకలు, ఇక్స్క్వింక్లే (Xoloitzcuintli – మెక్సికన్ జంతువు) వంటి జంతువులు కనిపిస్తాయి. మెక్సికన్ పురాణాలలో కోతి కామానికి సంకేతం అయినప్పటికీ, ఫ్రిడా వాటిని తరచుగా రక్షించే, సున్నితమైన పెంపుడు జంతువులుగా, ఆమె ఒంటరితనంలో తోడుగా చూపిస్తుంది..
ఫ్రిడా గీసిన చిత్రాలలో ‘ది టూ ఫ్రిడాస్’ చిత్రం శక్తివంతమైన చిత్రాలలో ఒకటి. డియాగో రివెరాతో విడాకులు తీసుకున్న సమయంలో దీనిని చిత్రించింది.’ది బ్రోకెన్ కాలమ్’ ఫ్రిడా జీవితాంతం అనుభవించిన శారీరక హింసకు పరాకాష్ట ఈ చిత్రం. ఇలాంటి వెన్నో తాను గీశారు.
1953లో మెక్సికోలో ఫ్రిడా ఒక సోలో ప్రదర్శన కు హాజరైంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె ఆ చారిత్రక ఘట్టాన్నిమిస్ కాలేదు. ఆమెను స్ట్రెచర్‌పై పడుకుని ప్రదర్శనకు వచ్చారు. ఆ సంవత్సరమే, గ్యాంగ్రీన్ కారణంగా, ఆమె కుడి కాలు మోకాలి కింద నుండి తీసివేశారు. చివరి సంవత్సరాలలో కూడా ఆమె రాజకీయ నిబద్ధత ఏమాత్రం తగ్గలేదు.
1954, జూలై 2న, తన 47వ పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందు, ఆమె యునైటెడ్ స్టేట్స్ మద్దతుతో గ్వాటెమాలా అధ్యక్షుడు జాకోబో అర్బెంజ్‌ను పడగొట్టడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో వీల్‌చైర్‌లో కూర్చుని పాల్గొంది.
ఫ్రిడా కాహ్లో తన 47వ ఏట మరణించింది. ఆమె మరణానికి కారణం ఊపిరితిత్తుల ఎంబోలిజం అని అధికారికంగా ప్రకటించినప్పటికీ కొందరు ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అనుమానించారు. ఆమె మరణానికి ముందు రాసిన చివరి డైరీ ఇలా ఉంది: “ఈ నిష్క్రమణ సంతోషంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను – నేను మళ్లీ తిరిగి రాకుండా ఉంటాను. ఒక అద్భుత చిత్రకారిణి జీవితం అలా విషాదం గా ముగిసింది.

