ఆ సినిమా విజయం వెనుక అంత కథ ఉందా ?

Sharing is Caring...

Ravi Vanarasi……..

కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, అసంఖ్యాకమైన ఆశలకు, అంతులేని పోరాటాలకు, అద్భుతమైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన  సినిమా 1976లో విడుదలైన ‘రాకీ’ (Rocky).. ఈ సినిమా కేవలం ఒక బాక్సింగ్ డ్రామా కాదు, ఇది కటిక పేదరికం నుండి కీర్తి శిఖరాలకు చేరుకున్న ఒక వ్యక్తి  నిజ జీవిత పోరాటాన్ని తెరమీద ప్రతిబింబించిన అపురూపమైన కావ్యమని చెప్పవచ్చు.

మనమందరం ‘రాకీ బాల్బోవా’ను (Rocky Balboa) తెరపై చూశాం, కానీ తెర వెనుక సిల్వెస్టర్ స్టాలోన్ (Sylvester Stallone) పడిన కష్టాలు, అతడి స్థిరచిత్తం, అతడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈ చిత్రం అసలైన కథ.

అది 1975 సంవత్సరం. సిల్వెస్టర్ స్టాలోన్ వయస్సు అప్పటికి 29 ఏళ్లు. ఇరవై ఏళ్ల వయసులో ప్రతి నటుడు కనే కలలు కన్నప్పటికీ, అతడు కేవలం విఫల నటుడిగా, నిరుద్యోగిగా మిగిలిపోయాడు. అతడి భార్య గర్భవతి, కుటుంబానికి ఏ ఆధారం లేదు. బ్యాంక్ ఖాతాలో కేవలం $16 డాలర్లు మాత్రమే ఉన్నాయి.

జీవితంలో ముందుకు సాగడానికి కనీస డబ్బు కూడా లేని పరిస్థితి. భార్యకు ఆహారం పెట్టడానికి, బిల్లులు కట్టడానికి మార్గం లేక, స్టాలోన్ ఒక అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అతడికి ప్రాణ స్నేహితుడు, కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువైన ఒక బుల్‌మాస్టిఫ్ (Bullmastiff) జాతి కుక్క ఉండేది. దాని పేరు బట్‌కస్ (Buttkus).

ఆ కుక్కను పోషించడం కూడా భారంగా మారడంతో, స్టాలోన్ ఒక మద్యం షాప్ బయట నిలబడి ఉన్న ఒక అపరిచితుడికి కేవలం $50 డాలర్లకు బట్‌కస్‌ను అమ్మాడు. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడిని, డబ్బు కోసం అమ్ముకోవాల్సిన ఆ నిస్సహాయ పరిస్థితి, స్టాలోన్ జీవితంలో అత్యంత చీకటి రోజు.ఈ సంఘటన, రాబోయే ‘రాకీ’ కథకు, ఆత్మవిశ్వాసానికి, పోరాట స్ఫూర్తికి ఎంతగానో దోహదపడింది.

ఈ భావోద్వేగ ఘట్టమే అతడికి సినిమా పట్ల ఎంత అంకితభావం ఉందో తెలియజేస్తుంది. ఈ కుక్క విషాదకరమైన విక్రయం, ఆ తర్వాత దాని పునరాగమనం, మొత్తం కథనానికే ఒక బలం.
అదే వారం స్టాలోన్ ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మహ్మద్ అలీ (Muhammad Ali)  మ్యాచ్ చూశాడు.

అలీతో తలపడిన ప్రత్యర్థి ఎవరంటే – చక్ వెప్నెర్ (Chuck Wepner). వెప్నెర్ బాక్సింగ్ ప్రపంచంలో ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తి. అతడికి ‘బేయోన్ బ్లీడర్’ (Bayonne Bleeder) అనే పేరు ఉండేది. ఈ నిక్ నేమ్ వెనుక పెద్ద చరిత్ర ఉంది. వెప్నెర్ బాక్సింగ్‌లో బాగా దెబ్బలు తిని ముఖంపై బాగా గాయాలై, రక్తం ఎక్కువగా కారుతుండేది.. అందుకే అతడికి ఆ పేరు వచ్చింది.

వెప్నెర్‌ను ఎవరూ లెక్కచేయలేదు. అతడు మొదటి రౌండ్‌లోనే ఓడిపోతాడని అంతా అనుకున్నారు. కానీ వెప్నెర్ అద్భుతమైన ధైర్యంతో, పోరాట పటిమతో, ఊహించని విధంగా 15 రౌండ్‌ల వరకు నిలబడ్డాడు. కేవలం నిలబడటమే కాదు, ఏకంగా ఛాంపియన్ అయిన మహ్మద్ అలీనే ఒకసారి కింద పడగొట్టాడు. అతడు ఆ మ్యాచ్‌లో గెలవకపోయినా, అతడి హృదయం, పట్టుదల, పోరాట స్ఫూర్తి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

ఈ పోరాటాన్ని చూస్తున్న స్టాలోన్‌కి ఒక గొప్ప ఆలోచన మెరుపులా తట్టింది. ఇది బాక్సింగ్ గురించి కాదు! ఒక సామాన్య వ్యక్తి ఒక ఛాంపియన్‌తో రింగ్‌లో తలపడి, చివరి వరకు పోరాడగలిగితే, అది ప్రేక్షకులకు ఎంత గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది!

ఆ ప్రేరణను అందుకున్న స్టాలోన్, దాదాపు 86 గంటల పాటు, అంటే మూడున్నర రోజులకు పైగా, నిరంతరాయంగా, నిద్ర లేకుండా, నాన్‌స్టాప్‌గా కూర్చుని ఒక స్క్రిప్ట్ రాశాడు. తన గుండెలో దాగి ఉన్న ఆశను, కోపాన్ని, ఆవేదనను,పోరాట స్ఫూర్తిని అక్షరీకరించాడు. అన్నీ కలసి ఒక శక్తివంతమైన స్క్రిప్ట్‌గా రూపాంతరం చెందాయి. ఆ స్క్రిప్ట్ పేరే ‘రాకీ’.

స్క్రిప్ట్‌ను పూర్తి చేసిన తర్వాత, స్టాలోన్ దానిని నిర్మాతలు ఇర్విన్ వింక్లర్ (Irwin Winkler)  రాబర్ట్ చార్టోఫ్ (Robert Chardoff) లకు చూపించాడు. వారికి స్క్రిప్ట్ విపరీతంగా నచ్చింది. అద్భుతమైన కథ, కొత్తదనం,గొప్ప సందేశం ఉన్నఈ కథకు నిర్మాతలు వెంటనే ఆకర్షితులయ్యారు. వెంటనే వారు స్టాలోన్‌కి $125,000 డాలర్ల ఆఫర్‌ ఇచ్చారు.

పేదరికంలో ఉన్నవ్యక్తికీ అది ఊహించని అదృష్టం.స్టాలోన్ ఒక షరతు పెట్టాడు. “నేను రాసిన ఈ స్క్రిప్ట్‌ను అమ్ముతాను, కానీ దీనిలో ‘రాకీ బాల్బోవా’ పాత్రను నేనే పోషించాలి. లేదంటే నేను అమ్మను”. నిర్మాతలు, ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖులు, దీనికి ఒప్పుకోలేదు.

సినిమా విజయం సాధించాలంటే ఒక ‘బ్యాంకబుల్ స్టార్’ (Bankable Star), అంటే ఇప్పటికే పేరున్న నటుడు కావాలి. ర్యాన్ ఓ’నీల్ (Ryan O’Neal) లేదా బెర్ట్ రేనాల్డ్స్ (Bert Reynolds) వంటి స్టార్స్‌ని పెడితేనే తమ డబ్బు తిరిగి వస్తుందని వారి నమ్మకం.

నిర్మాతలు స్టాలోన్ పట్టుదలను చూసి, తమ ఆఫర్‌ను పెంచుతూ పోయారు.మొదట $125,000. ఆ తర్వాత $250,000. చివరికి $360,000 డాలర్లు. తన కుటుంబానికి ఆహారం పెట్టలేని, అప్పుల్లో కూరుకుపోయిన ఒక వ్యక్తికి ఇది ఒక అద్భుతమైన సంపద. అయినా  స్టాలోన్ నిరాకరించాడు.

ఎంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినా, స్టాలోన్ వెనక్కి తగ్గలేదు. అతడు అన్న మాటలు అతడి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. “నేను వేరే ఎవరైనా ‘రాకీ బాల్బోవా’ పాత్ర పోషించడాన్ని చూసే బదులు, ఈ స్క్రిప్ట్‌ను నా పెరట్లోనే పూడ్చిపెడతాను”అన్నాడు.ఆకలి, పేదరికం, భార్య, బిడ్డ, అప్పులు… ఇవేవీ అతడి ఆత్మవిశ్వాసాన్ని కదిలించలేకపోయాయి.

చివరికి, యునైటెడ్ ఆర్టిస్ట్స్ అనే నిర్మాణ సంస్థ గొప్ప సాహసం చేయడానికి అంగీకరించింది. “సరే, స్టాలోన్ నటించు, కానీ ఈ మొత్తం సినిమాను కేవలం $1 మిలియన్ డాలర్ల తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయాలి” అని షరతు పెట్టారు. ఈ కండిషన్ ప్రకారం, స్టాలోన్ చాలా తక్కువ పారితోషికాన్ని అంగీకరించాల్సి వచ్చింది. అతడు నటుడిగా, రచయితగా సంపాదించింది కేవలం $23,000 డాలర్లు మాత్రమే. $360,000 డాలర్లను వదులుకుని, కేవలం $23,000కు సంతకం చేశాడు.

$23,000 డాలర్లు అతడికి చేతికి అందిన తర్వాత, స్టాలోన్ చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, తన ప్రాణ స్నేహితుడైన కుక్క బట్‌కస్‌ను తిరిగి కొనుక్కోవడం. అతడు $50 డాలర్లకు అమ్మిన ఆ కుక్కను, మళ్లీ ఆ అపరిచితుడి వద్దకు వెళ్లి, $1,500 డాలర్లు (అంటే సుమారు 30 రెట్లు ఎక్కువ) చెల్లించి తిరిగి కొనుగోలు చేశాడు.

ఈ సంఘటన స్టాలోన్ వ్యక్తిత్వాన్ని, అతడిలోని మానవత్వాన్ని, అతడి జీవితంలో బట్‌కస్‌కు ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది.  ఈ బట్‌కస్  ‘రాకీ’ సినిమాలో కూడా నటించింది. కేవలం $1 మిలియన్ డాలర్ల బడ్జెట్ కారణంగా, సినిమా నిర్మాణం చాలా కష్టంగా, కానీ అత్యంత వాస్తవికంగా జరిగింది.
రాకీ ..  ఆడ్రియన్ (Adrian) ల మధ్య ఐకానిక్ ఐస్ స్కేటింగ్ డేట్ సీన్‌ను కేవలం ఒక్క టేక్‌లో మాత్రమే చిత్రీకరించారు. 

స్టాలోన్ తండ్రి సినిమాలో ఒక ఎక్స్‌ట్రా పాత్రలో నటించారు..డబ్బు ఆదా చేయడానికి తన కుటుంబాన్ని కూడా సినిమాలో ఉపయోగించుకున్నాడు.రాకీ తన పదును పెంచడానికి చనిపోయిన పశువుల మాంసాన్ని బాక్సింగ్ బ్యాగ్‌లుగా ఉపయోగించి పంచింగ్‌లు చేసే సన్నివేశం బాగుంటుంది.. ఈ సన్నివేశంలో స్టాలోన్ నిజంగా అంత సేపు కష్టపడి పంచ్‌లు చేయడం వల్ల, అతని వేళ్ల కీళ్లు శాశ్వతంగా చదునుగా మారిపోయాయి.

మొత్తం మీద ప్రతికూల పరిస్థితుల మధ్య, ఈ చిత్రాన్ని కేవలం 28 రోజుల్లోనే పూర్తి చేశారు. తక్కువ బడ్జెట్, సమయ పరిమితి కారణంగా సినిమా సహజంగా, కఠినంగా, ఆకర్షణీయంగా రూపొందింది.  విడుదలైన తర్వాత ‘రాకీ’ ఒక సంచలనం సృష్టించింది. ఇది 1976 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం వాణిజ్య విజయం మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

రాకీ సినిమా ఏకంగా 10 అకాడమీ అవార్డులకు (ఆస్కార్) నామినేట్ అయ్యింది. ఆ సంవత్సరంలో, ‘టాక్సీ డ్రైవర్’  ‘నెట్‌వర్క్’ వంటి దిగ్గజ సినిమాలను వెనక్కి నెట్టి మరీ, అత్యుత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.

తన ప్రతిభపై, తన కథపై, తన ఆత్మవిశ్వాసంపై నమ్మకంతో ఒక పేద నటుడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం చరిత్రను మార్చింది. సిల్వెస్టర్ స్టాలోన్ జీవితంలో గెలిచాడు. గెలవడం ముఖ్యం కాదు, చివరి వరకు పోరాడటం ముఖ్యం అన్నదే అసలు సందేశం.   

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!