Pudota Showreelu ………….
అనంతపురం జిల్లా తాడిపత్రి లో 14,15 శతాబ్దం లో విజయనగరరాజులచే నిర్మింపబడి,పెమ్మసాని వంశీయులతో అబివృద్ధి చేయబడిన బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతలరాయుని ఆలయాలు ఉన్నాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం అద్భుతమైన శిల్పసంపద కు నెలవు అని చెప్పుకోవాలి.
బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడిలోని శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించాడు..ఇక్కడ శివలింగం కింద నున్నబుగ్గలో నుండి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఈ గుడిని బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడి అంటున్నారు.చింతలు తీర్చేవాడని,చింతచెట్టు తొర్రలో బయల్పడినందున చింతలరాయుడని ఆ మహావిష్ణువుని అంటున్నారు.
హంపి కన్నాకూడా అద్భుతమైన శిల్పసంపద ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రెండు గుడులలోనూ శిల్పులు రామాయణ,మహాభారత,భాగవత ఘట్టాలనే గాక అనేక నాట్యభంగిమలు అద్భుతంగా మలిచారు.అయితే నేనేదైనా శిల్పసంపద కల్గిన గుడులకు వెళ్ళినపుడు అక్కడి శిల్పాలను ఎంతో పరిశీలనగా చూస్తాను.ఆ శిల్పాలలో శిల్పులు ఎక్కడైనా సామాన్య మానవ జీవితాన్ని చెక్కారా అని చూస్తాను.
ప్రధాన స్తపతి ( శిల్పి) రాజాజ్ఞ ననుసరించి ఆయన చెప్పినట్లుగానే శిల్పాలు చెక్కుతాడు.అందుకే మనకు దేవాలయాలపై రామాయణ,మహాభారత,భాగవత ఘట్టాలతో పాటు మహారాజు,రాణులు,వారి పరివారం శిల్పాలు, రాజ్య చిహ్నాలు కన్పిస్తాయి.ప్రధాన శిల్పితో పాటు,ఇతర పెద్దా చిన్నాశిల్పులు,రాయిని చీల్చే వడ్డెరలు గూడా ఈ గుడి నిర్మాణం లో పాల్గొని అద్భుతమైన గుడిని నిర్మిస్తారు.
ఏళ్ల తరబడి శిల్పాలు చెక్కే శిల్పులు ఏదో ఒక సమయంలో తమ సామాన్యజీవితం మదిలో మెదిలి,వాటిని గూడా తప్పక ఎక్కడో ఒకచోట చెక్కి,తమ వారికి కూడా ఒక స్థానాన్ని తప్పక కల్పిస్తాడు.నేను గుడిలో శిల్పాలను పరిశీలించేటపుడు అలాంటి శిల్పాల కోసమే నా కళ్ళు వెతుకుతాయి.నా ఆశ నిరాశ కాకుండా అలాంటి శిల్పం తప్పక నా కంటబడుతుంది.
ఇంతకుముందొకసారి అనంతపురం వెళ్ళినపుడు గోరంట్ల లోని మాధవరాయ స్వామి ఆలయంలో ఇలాంటి శిల్పమే చూశాను. అదొక మామూలు మనిషి తన భార్యతో కలిసి,అడవిలో వేటకు వెళ్ళినపుడు,ఆమె కాలిలో విరిగిన ముల్లును తీయటం.ఆమె కాలిని తన మోకాలిపై పెట్టుకుని ముల్లు తీస్తుంటాడు.ఆమె అతని విల్లుని నేలకు ఆనించి, ఊతగా పట్టుకుని,అతని తలపై చేయి వేసి, నిలబడి ఉంటుంది.
అలాగే గిద్దలూరు దగ్గర సత్యవోలు లోని శిల్పం.భార్యాభర్తలైన ఇద్దరు ఆటవికులు అడవిలో వేటకు వెళ్ళినపుడు,ఆమె కాలిలో విరిగిన ముల్లును తీస్తుంటాడు.విల్లును ఆమె నేల కానించి పట్టుకుని ఉంటుంది.ఆటవికుడు తల్లో ఈకలు ధరించివుంటాడు..అతడు ఆమె కాలిని మోకాలిపై పెట్టుకోడు..
అలాగే పాదం పట్టుకుని ముల్లు తీస్తుంటాడు..ఆమె కూడా అతని తలను ఆసరా కోసం పట్టుకోదు..
పై రెండింటిలో, పైనున్న శిల్పం లోని మహిళ సున్నితమైనదని,కింది ఆటవిక స్త్రీ బలవంతురాలని తెలుస్తుంది.
అలాగే తాడిపత్రి గుడులలో గూడా శిల్పి సామాన్యజనాన్ని తన ఉలి నైపుణ్యంతో చెక్కి,వాళ్ళను శిలలపై చిరంజీవులను చేశాడు.బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడి గోడలపై శిల్పి బర్రెలు కాచుకునే ఒక సామాన్యుని,అతని పక్కనే పుట్టగోసి పెట్టుకుని,నేలపై కూర్చొన్న పేద మనిషిని చెక్కారు.
ఇంకో చోట అరుగుపై కూర్చున్న ముగ్గురు ఆడవాళ్లు,తమ బిడ్డల్ని, మనవలను వళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు. కొప్పులు వేసుకున్నపెద్ద ఆభరణాలేమి లేని సాధారణ ఆడవాళ్ళ శిల్పాలవి.శిల్పుల భార్య,అమ్మ అయి వుండవచ్చేమో..
విజయనగర రాజుల రాజ్య చిహ్నాలైన పంది,సూర్యచంద్రులు, విజయ ఖడ్గం ఒకచోట చెక్కారు.
రాజులకు భార్య కాల్లో ముల్లు తీసే పని లేదు,బర్రెలు కాసే పని లేదు,పుట్టగోసి అవసరమే లేదు.రాణుల పిల్లలను ఆడించేదానికి దాదులు వుంటారు.కాబట్టి ఇవన్నీ సామాన్యజనానివే అని నా అభిప్రాయం.
ఇంకోచోట శిల్పి కోతులను చెక్కాడు.అతను పనిచేసేచోట కోతులున్నాయేమో..అల్లరి చేస్తున్న కోతులు,అరటిపండు తింటున్న కోతులు శిల్పి ఉలి లో ప్రాణం పోసుకున్నాయి. ఇంకో చోట కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళు..రకరకాల కోలాట భంగిమలు.ఆ రోజుల్లో అద్భుతమైన కోలాటం అడుగులు వేసేవారని ఈ శిల్పాల వల్ల తెలుస్తుంది.
ఇక బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం చరిత్ర గురించి చెప్పుకోవాలంటే గుడిలో ఉన్నది స్వయంభూ శివలింగం. ఈ ఆలయానికి 500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది.. ఈ ఆలయం 1490 –1509 మధ్య నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
శివలింగం కింద నుండి నిరంతరం ప్రవహించే భూగర్భ ప్రవాహం ఉంది, దీనిని గంగగా భావిస్తారు. ఈ నీరు సమీపంలోని చెరువులోకి ప్రవహిస్తుంది.భూమిలో నుండి స్వయంగా ఉద్భవించిన గంగ ప్రవాహం కారణంగా ఈ ప్రదేశాన్ని “పాపనాశక తీర్థం”గా భావిస్తారు.
తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కిమీ (2.5 మైళ్ళు) దూరంలో ఉంది.. అనంతపురం నుంచి 58కిలోమీటర్ల దూరం లో ఉంది. తాడిపత్రిలో వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు


