A difficult trip…………
రామేశ్వరం నుండి ఇసుక తీసుకుని కాశీ లో కలిపే యాత్రనే ‘సైకతయాత్ర’గా పిలుస్తారు.ఈ యాత్ర “పితృదేవతల”కు సంబంధించింది. ఇది కేవలం తండ్రి గతించినవారు మాత్రమే ఆచరించాలి.
ముందుగా రామేశ్వరం చేరుకుని అక్కడి సేతువులో స్నానం చేసి కొంత ఇసుకను తీసుకొని మూడు లింగాలుగా(కుప్పలుగా) చేసి వాటిని శ్రీ సేతుమాధవుడు,శ్రీ వేణీమాధవుడు,శ్రీబిందుమాధవుడి స్వరూపాలుగా భావిస్తూ షోడషోపచారాలతో అర్చించి,శ్రీ సేతుమాధవ స్వరూపాన్ని రామేశ్వరంలోని సముద్రంలో నిమజ్జనం చేయాలి.
మిగిలిన రెండుస్వరూపాలను తీసుకుని, ప్రయాగ(అలహాబాద్) చేరుకుని శ్రీ వేణిమాధవ,శ్రీబిందుమాధవ స్వరూపాలను అర్చించి ..శ్రీ వేణీమాధవున్నిత్రివేణీసంగమంలో నిమజ్జనం చేయాలి. మిగిలిన శ్రీబిందుమాధవ స్వరూపాన్నికాశీలోని బిందుమాధవఘాట్ నందు అర్చించి,ఆ స్వరూపాన్ని అక్కడే నిమజ్జనం చేయాలి.
తిరిగిప్రయాగ చేరుకుని త్రివేణిసంగమాన గంగజలాన్ని తీసుకుని కాశీ వచ్చి శ్రీవిశ్వనాధునికి అభిషేకం చేయాలి. మళ్ళీ ప్రయాగ చేరుకుని మరల గంగను తీసుకొని నేరుగా రామేశ్వరం చేరుకోవాలి.
 అక్కడి  రామనాథస్వామి ఆలయంలో ఉన్న స్ఫటికలింగానికి గంగాజలంతో అభిషేకం చేయించాలి.(ఈ అభిషేకం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యజరుగుతుంది.) ఆతర్వాత ఇంటికి చేరుకోవాలి. 
ఈ సైకత యాత్ర వలన పితృదేవతలు తరిస్తారని,వంశాభివృధ్ధి కి మంచిదని పెద్దలు చెబుతారు.
ఈ యాత్ర ప్రారంభించినప్పటి నుండి రామేశ్వరం లో స్ఫటికలింగానికి అభిషేకం చేయించేంతవరకు ఇంటికి రాకూడదనే నియమం ఉందంటారు. అయితే 6నెలల లోపు ఈ యాత్ర పూర్తి చేయవచ్చనే మినహాయింపు ఉందని కూడా చెబుతారు.
రామేశ్వరానికి.. కాశీకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ప్రయాగ నుంచి కాశీ , కాశీ నుంచి ప్రయాగ తిరగడానికి కొంత సమయం పడుతుంది. ఈయాత్ర చేసే మధ్య కాలంలో సూర్య గ్రహణం కానీ చంద్ర గ్రహణం కానీ లేకుండా చూసుకోవాలని అంటారు.
తక్షణం వెళ్లి కలపడం సాధ్యం కానప్పుడు ఆ జలాలను ఇంటిలో పవిత్ర ప్రదేశంలో ఉంచవచ్చు. తర్వాత వీలు చూసుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయాలి.ఇది అంత సులభమైన యాత్ర కాదు .. చాలా సమయం పడుతుంది.చాలా ఓపికగా అన్ని చేయాలి. హిందూ సంప్రదాయంలో దీన్ని ఒక పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఇది మోక్షానికి మార్గమని నమ్ముతారు. 
   
——-  Srinivasamurthy Akkapeddi 
 
				


 
										 
										