People only supported him as an actor ………………….
రాజకీయాలు అందరికి కలసి రావు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది.
కరుణానిధి, ఎంజీఆర్ ల హవా కొనసాగుతున్న సమయంలోనే సుప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించారు. అయితే విజయం సాధించ లేకపోయారు. సరైన ప్రణాళికలు లేక.. వ్యూహాత్మకంగా వ్యవహరించక,కేవలం గ్లామర్ నే నమ్ముకోవడం వలన రాజకీయంగా దూసుకెళ్ల లేకపోయారు.
మొదట్లో శివాజీగణేశన్ కూడా డి.ఎమ్.కె. పార్టీలోనే ఉండేవాడు.ఆయన తొలి చిత్రం ‘పరాశక్తి’ ఆ సినిమాకు రచయిత కరుణానిధి.డీఎంకే పార్టీ భావాలకు తగినట్టుగా సినిమాలకు కరుణానిధి డైలాగులు రాసేవారు. సినిమారంగంలో శివాజీ, ఎంజీఆర్ పోటీ పడేవారు.
ఎమ్.జి.ఆర్. సూపర్ స్టార్ గా ఎదిగిన తరువాత మాస్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ను చూసి కరుణానిధి ఎంజీఆర్ ను కూడా పార్టీ లోకి ఆహ్వానించారు.అదికూడా ఆయనకు నచ్చలేదు అంతకుముందు నుంచే పార్టీ నుంచి బయటకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు.
శివాజీ గణేషన్ తిరుపతి వెంకన్న భక్తుడు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవారు. ఆయన తిరుపతి పర్యటన పై పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఈ విషయంలో అన్నాదురై ,శివాజీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.
తన అనుచరులు నాస్తికులు అని అన్నాదురై పదే పదే చెప్పేవాడు.ఈక్రమంలో ఆయన డీఎంకే లో ఇమడలేపోయారు. బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.నాటి ప్రముఖ నాయకుడు కె. కామరాజ్‌కు బలమైన మద్దతుదారుడయ్యాడు. 1975లో కామరాజ్ మరణించిన తర్వాత ఆయన ఇందిరాగాంధీ పట్ల విధేయతను ప్రకటించారు.
ఎంజీఆర్ కూడా 1972 లో డి.ఎమ్.కె. నుండి బయటకొచ్చి సొంతంగా ‘అన్నా డి.ఎమ్.కె. పార్టీ’ పెట్టారు.పార్టీని పూర్తిగా అట్టడుగు స్థాయి నుంచి నిర్మించడానికి ఎంజీఆర్ ఎంతో కృషి చేశారు. కేవలం తన సినీ గ్లామర్ నే నమ్ముకోలేదు.
1600 కి పైగా గ్రామాలను సందర్శించి ప్రచారం చేశారు. తన అభిమాన సంఘాల ఆఫీసులను పార్టీ కార్యాలయాలుగా మార్చారు.డబ్బు కూడా బాగానే ఖర్చు పెట్టారు.కరుణానిధి కూడా ఎంజీఆర్ ను ఎదుర్కొనేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు
1977 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంజీఆర్ సారధ్యంలోని అన్నాడీఎంకే, డీఎంకే,కాంగ్రెస్, జనతా పార్టీ లు విడివిడిగా పోటీ చేశాయి. అంతకుముందు జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్నా డీఎంకే కలసి పోటీ చేశాయి. జనతా డీఎంకే ఉమ్మడిగా బరిలోకి దిగాయి. శాసనసభ ఎన్నికలకు విడిగా పోటీ చేశాయి.
శివాజీగణేశన్ కొన్ని చోట్ల ప్రచారం చేశారు కానీ పార్టీకి అదేమీ ప్లస్ కాలేదు. ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ విజేతగా నిలిచారు.రాజ్యసభ ఎంపి నర్గిస్ దత్ 1981 లో కన్నుమూసారు. ఆ సీటు శివాజీకి దక్కింది. రాజ్యసభ సభ్యులు అయ్యారు. 1988 లో ఎఐఎడిఎంకె అంతర్గత గొడవలో జయలలిత,జానకి రామచంద్రన్‌లలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అనే అంశంపై తమిళ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. దాంతో శివాజీ బయటికొచ్చారు.
‘తమిళగ మున్నేట్ర మున్నని’ పేరిట కొత్త పార్టీ పెట్టారు.దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కేవలం తన గ్లామర్ నే నమ్ముకుని బరిలోకి దిగారు. అదే దెబ్బకొట్టింది తమిళనాట అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన ఆయన పార్టీ పరాజయం పాలైంది. తిరువయ్యారు బరిలో నిలిచిన శివాజీ గణేశన్ 10,643 ఓట్ల తేడాతో డిఎంకె అభ్యర్థి చంద్రశేఖరన్ దొరై చేతిలో ఓడిపోయారు.
ఆనాటి ఎన్నికల్లో శివాజీ ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ కి మద్దతు పలికారు. ఎవరినైతే వ్యతిరేకించారో ఆయన భార్య కే మద్దతు శివాజీ ఇవ్వడం విశేషం. ఆ విషయంలో రాంగ్ స్టెప్ వేశారు. అప్పటికే డీఎంకే కి వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. జానకి రామచంద్రన్ సామర్ధ్యాన్ని ఓట్లర్లు నమ్మలేదు. ప్రజలు జయలలిత కు అనుకూలంగా ఓటింగ్ చేశారు.
ఫలితాలు వ్యతిరేకంగా రావడం తో శివాజీ పార్టీని వీపీ సింగ్ ఆధ్వర్యంలోని జనతాదళ్లో విలీనం చేసి కొన్నాళ్ళు తమిళనాడు జనతాదళ్ శాఖ అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత రాజకీయాలను విడిచి పెట్టారు. కరుణానిధిని. ఎంజీఆర్ ను, జయలలితను రాజకీయంగా ఎదుర్కోలేకపోయారు. నటుడిగా ఆయనను ఆదరించిన ప్రజలు రాజకీయంగా మాత్రం తిరస్కరించినట్టే చెప్పుకోవాలి.
————— KNM