Siva Ram………………
Sringeri Monastery ………………………
ఆదిశంకరాచార్యులు వారు తన మొదటి పీఠాన్ని శృంగేరిలోనే ఎందుకు స్థాపించారు ?దేశమంతా అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసుకుంటూ వెళ్లినా సరియైన ప్రాంతమే దొరకలేదా.? తన శిష్యగణం ఎన్ని ప్రాంతాలను చూపిన కూడా అక్కడే ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణం ఉంది. దాని వెనుక చిన్న కథ ఉంది.
ఆదిశంకరాచార్యులు వారు దక్షిణ దేశ యాత్రలో వుండగా ఒకచోట సేద తీర్చుకునేందుకు ఆసీనులైనారు.. రోహిణీ కార్తె కావడంతో ఎండ మరింత తీవ్రంగా వుంది… అదే సమయంలో అక్కడ చిత్రాన్ని చూసారు.. ఆ ఎండ తీవ్రతకు ఓ గర్భవతి అయిన కప్ప నీటిలోకి దూకలేక శోష తప్పింది.ఆ ప్రాంతంలోనే పాము పుట్ట వుంది… ఆ పుట్టలో వున్న నాగుపాము ఆ కప్పను చూసింది.
ఎప్పుడు కప్ప దొరికతే తిందామా అని చూసే పాము ఆ కప్పకు మాత్రం తన పడగతో నీడ నిచ్చి ఎండ నుంచి సేద తీరేలా చేసింది. ఈ సంఘటనను చూసిన ఆదిశంకరాచార్యులు వారు విస్మయులై ఆ స్థల విశిష్టత ఏమిటో ? జ్ఞాన నేత్రం ద్వారా చూసి అది రుష్యశృంగుడు తపస్సు చేసిన ప్రాంతం అని తెలుసుకున్నారు.
అందుకే అక్కడ అన్ని జీవరాశులు విరోధం లేకుండా కలిసిమెలిసి జీవిస్తున్నాయని భావించారు. ఇటువంటి ప్రాంతంలోనే తన మొదటి పీఠాన్ని నెలకొల్పాలని సంకల్పించి అక్కడ ఆదిశంకరాచార్యులు వారు పీఠాన్ని స్థాపించారు..ఆ పీఠమే శృంగేరి మఠం గా కాలక్రమంలో ప్రసిద్ధి గాంచింది.
శృంగేరి చరిత్ర శారదా పీఠంతో ముడిపడి ఉంటుంది. ఈ పీఠం అద్వైత వేదాంతానికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం శతాబ్దాలుగా వేద అధ్యయనాలకు, మతపరమైన పండితుల కార్యకలాపాలకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు భారతదేశం నలుమూలలా అద్వైత వేదాంతం వ్యాప్తి కోసం నాలుగు మఠాలను స్థాపించారు.
వాటిలో శృంగేరి లోని శారదా పీఠం ఒకటి. ఈ పీఠం అద్వైత వేదాంతానికి ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడి ఆచార్యులు వేదాలపై వ్యాఖ్యానాలను రచించి, తత్వాన్ని మరింతగా వివరించారు. శృంగేరి కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది.
శృంగేరి మఠం తుంగ నదిఒడ్డున ఉంది . ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రమైన శృంగేరికి, శ్రీ శారదా పీఠంతో సహా అక్కడి దేవాలయాలకు తుంగా నది ఒక ముఖ్యమైన నీటి వనరు గా ఉంది.
శృంగేరి మఠం ఆలయాలు
శృంగేరి శారదా పీఠంలో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. మొదటిది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడిన విద్యాశంకర ఆలయం.రెండవది అభ్యాస దేవత శారదాంబ (సరస్వతి) ఆలయం. తరువాత కాలంలో ఆలయ సముదాయంలో ఒక గ్రంథాలయం, వేద పాఠశాల, ఆదిశంకరుల మందిరం నిర్మించబడ్డాయి.
శృంగేరి ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.వర్షాకాలంలో శృంగేరిలో భారీ వర్షాలు కురుస్తాయి.
శృంగేరి శారదా పీఠం చేరుకోవడానికి బెంగళూరు, మైసూర్, మంగళూరు, ఉడిపి, శివమొగ్గ, హసన్, చిక్కమగళూరు, ధర్మస్థల, కొల్లూరు, కొప్ప నుండి రెగ్యులర్ బస్సులు నడుస్తాయి.
శృంగేరిలో రైల్వే స్టేషన్ లేదు. శృంగేరికి సమీప రైల్వే స్టేషన్ ఉడుపి రైల్వే స్టేషన్, ఇది దాదాపు 79 కి.మీ దూరంలో ఉంది. యాత్రికులు శివమొగ్గకు రైలులోవెళ్లినా అక్కడనుంచి రావచ్చు.ఉడుపి లేదా శివమొగ్గ నుండి క్యాబ్ లేదా బస్సులో శృంగేరికి చేరుకోవచ్చు.
శృంగేరికి సమీప విమానాశ్రయం మంగళూరు, ఇది దాదాపు 105 కి.మీ దూరంలో ఉంది. అక్కడి నుండి, యాత్రికులు శృంగేరి శారద పీఠానికి క్యాబ్ అద్దెకు తీసుకోవచ్చు.శృంగేరి శారదా ఆలయం సమీపంలో యాత్రికులు బస చేయడానికి నామమాత్రపు ధరకు శృంగేరి శారదా మఠం అందించే అతిథి గృహాలు ఉన్నాయి.
యాత్రికులు శృంగేరి మఠాన్ని సందర్శించడానికి ఉడిపి (81 కి.మీ), శివమొగ్గ (96 కి.మీ) లేదా మంగళూరు (117 కి.మీ)లో కూడా బస చేయవచ్చు.కర్ణాటక టూర్ వెళ్లిన వారు తప్పని సరిగా దర్శించాల్సిన ప్రదేశమిది.