డైనోసార్లతో మనుషులు సహజీవనం చేశారా?

Sharing is Caring...

Ravi Vanarasi …………

ఆధునిక సమాజంలో విజ్ఞానం, సమాచారానికి కొదువే లేదు.ఎన్నో సాధనాల ద్వారా అంతులేని సమాచారం అందుబాటులో ఉంది.. అయితే అందులో కొన్ని అపోహలు,అబద్ధాలు, తప్పుడు నమ్మకాలు కలసి పోయి ఉన్నాయి. ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 41 శాతం మంది అమెరికన్లు ఒకప్పుడు మనుషులు డైనోసార్లతో కలిసి జీవించారని నమ్ముతున్నారు. ఇది కేవలం ఒక ఆసక్తికరమైన గణాంకం మాత్రమే కాదు.. మన సమాజంలో విజ్ఞాన శాస్త్ర అవగాహన ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలియజేసే ఒక ప్రమాదకరమైన సంకేతం.

అంశంలో ఎన్ని నిజాలున్నాయో చూద్దాం .డైనోసార్లతో మనుషులు కలిసి జీవించారనే నమ్మకానికి ప్రధాన కారణం మన చలనచిత్రాలు, పాప్ కల్చర్. ‘జురాసిక్ పార్క్’ వంటి విజయవంతమైన సినిమాలు, టీవీ షోలు, యానిమేషన్ చిత్రాలు డైనోసార్లను మనుషులతో కలసి తిరిగినట్టుగా చిత్రీకరించాయి. ఈ సినిమాలు వినోదాన్ని అందిస్తున్నప్పటికీ, అవి సృష్టించిన దృశ్య ప్రపంచం ప్రేక్షకులపై ఒక శాశ్వతమైన ముద్రను వేసింది.

చలనచిత్రంలో చూసింది ఒక కల్పన అని తెలుసుకున్నప్పటికీ, ఆ చిత్రం సృష్టించిన అద్భుతమైన ప్రపంచం మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, డైనోసార్లను వేటాడే ఆదిమ మానవులు, లేదా మనుషులతో స్నేహంగా మెలిగే డైనోసార్ల దృశ్యాలు తరచుగా కనిపిస్తుంటాయి. ఈ రకమైన కల్పనలు వాస్తవాలను కప్పిపుచ్చి, ఒక తప్పుడు అవగాహనను కలిగిస్తాయి.

శాస్త్రీయ వాస్తవాలు ఏమిటంటే ….డైనోసార్లతో మనుషులు కలిసి జీవించారనే నమ్మకం పూర్తిగా అవాస్తవం. భూమి చరిత్రలో ఈ రెండు జాతుల మధ్య కాల వ్యవధి చాలానే ఉంది. డైనోసార్ల కాలం (మెసోజోయిక్ యుగం) సుమారు 230 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.

అవి భూమిపై సుమారు 165 మిలియన్ల సంవత్సరాల పాటు ఆధిపత్యం చెలాయించాయి.

సుమారు 65 మిలియన్ల సంవత్సరాల క్రితం, ఒక భారీ ఉల్కాపాతం భూమిని ఢీకొట్టడం వల్ల సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా డైనోసార్ల యుగం ముగిసింది. అంటార్కిటికాలో లభ్యమైన టైటానోసార్ శిలాజాలు కూడా డైనోసార్ల కాలం చాలా ప్రాచీనమైనదని నిరూపిస్తున్నాయి.

మానవజాతి ఆవిర్భావం…

ఆధునిక మానవజాతి (Homo Sapiens) సుమారు 300,000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అంటే, డైనోసార్ల అంతం తరువాత సుమారు 64.7 మిలియన్ల సంవత్సరాలకు మనుషులు భూమిపై అడుగుపెట్టారు. ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న కాలవ్యవధి అనూహ్యంగా చాలా పెద్దది.

ఈ రకమైన తప్పుడు నమ్మకాలు ప్రబలడానికి మరొక ముఖ్య కారణం పాఠశాల, కళాశాల స్థాయిలో బలహీనమైన శాస్త్రీయ విద్య. చాలా సందర్భాలలో, పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, భూమి చరిత్ర, జీవ పరిణామం,శిలాజాల ప్రాముఖ్యతపై లోతైన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి. కేవలం సిద్ధాంతాలను కంఠస్థం చేయించడం ద్వారా విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి కలగదు, దాని ప్రాముఖ్యత కూడా అర్థం కాదు.

ఈ తరహా అపోహలను ఎదుర్కోవడానికి మనం చేయవలసింది శాస్త్రీయ అవగాహనను పెంచడమే. ఈ కృషి కేవలం పాఠశాలలకు మాత్రమే పరిమితం కాకూడదు, సమాజంలోని అన్ని వర్గాలకు విస్తరించాలి.శాస్త్రవేత్తలు,పరిశోధకులు తమ పరిశోధనలను సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో వివరించాలి. క్లిష్టమైన సిద్ధాంతాలను సరళమైన ఉదాహరణలతో, దృశ్యరూపంలో (Infographics, Short Videos) అందించాలి.

మ్యూజియంలు, ప్లానిటోరియంలు, సైన్స్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు నిర్వహించాలి. శిలాజాల ప్రదర్శనలు, భూమి చరిత్రపై డాక్యుమెంటరీలు, నిపుణులతో చర్చలు ఈ అవగాహనను పెంచుతాయి.

పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని కేవలం సిద్ధాంతాల సమ్మేళనంగా కాకుండా, ఒక ఆసక్తికరమైన అన్వేషణగా బోధించాలి. విద్యార్థులను ప్రాజెక్టులు, పరిశీలనలు, ప్రయోగాల వైపు ప్రోత్సహించాలి.

మళ్ళీ మొదటికొస్తే .. డైనోసార్లతో మనుషులు కలిసి జీవించారనే నమ్మకం కేవలం ఒక అమాయకపు ఆలోచన మాత్రమే కాదు.. అది మన విద్యా వ్యవస్థలో …సామాజిక అవగాహనలో ఉన్న లోపాలను సూచిస్తుంది. ఈ అపోహను తొలగించడానికి, మనం విజ్ఞాన శాస్త్రానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలి, దానిని ఆసక్తికరంగా ప్రజలకు చేర్చాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!