Ricchest Routine Revenge Story ………………………….
కూలీ ..ఇదొక రొటీన్ రివెంజ్ స్టోరీ.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అభిమానులను అలరించేలా సినిమాతీయడానికి ప్రయత్నించారు. కథలో చెప్పుకోదగిన కొత్త దనం చూపలేకపోయారు.కథపై మరింత కసరత్తు చేయాల్సింది.కొన్ని సన్నివేశాలను పేర్చుకుంటూ వెళ్లారే కానీ వాటికి లింకులు సరిగ్గా లేవు ..లాజిక్ లేని సన్నివేశాలెన్నో ఉన్నాయి. అక్కడక్కడా ఒకటి అరా ట్విస్టులు లేకపోలేదు.
ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్థం కాసేపు బాగానే ఉంటుంది. అక్కడ నుంచి నరుకుడు, పొడుచుడు ,కాల్చుడు వంటి హింసాత్మక సన్నివేశాలే ఎక్కువ.సాంకేతిక హంగులు ఉన్నాయి కానీ ప్రేక్షకులను బలంగా హత్తుకునే సన్నివేశాలు తక్కువే.. రజనీ శ్రుతిహాసన్ల మధ్య కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయి.
రజనీకాంత్ వయసుకు తగ్గ పాత్రలోనే నటించారు. తన స్టైల్ మిస్ కాకుండా దేవాగా అభిమానులను అలరించేలా నటించారు. నేర సామ్రాజ్య నేతగా, స్టైలిష్ విలన్ సైమన్ పాత్రలో నాగార్జున బాగా నటించారు.. అయితే ఆయన పాత్ర పూర్తిగా ఎలివేట్ కాలేదు. నాగార్జున విలనిజాన్ని బాగానే ప్రదర్శించారు.
దయాల్ పాత్రలో సౌబిన్ షాహిర్ బాగా చేసాడనే చెప్పుకోవాలి. క్రూరత్వాన్ని బాగా చూపారు. ఆయన పాత్ర బాగా ఎస్టాబ్లిష్ అయింది. మోనికా పాటలో స్టెప్పులతో అదర గొట్టారు. ఆ పాత్ర తీరు తెన్నులపై కూడా క్లారిటీ లోపించింది.
సైమన్ కొడుకు ప్రేయసి పాత్ర కల్యాణిగా రక్షిత రామ్ బాగానే చేసింది. ఆ పాత్ర కథలో కొత్త ట్విస్ట్ ఇస్తుంది. ఇక సత్యరాజ్ తన పరిథిలో బాగా చేశారు. శృతిహాసన్ సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని సన్నివేశాల్లో బాగానే చేసింది. ఉపేంద్ర పాత్రను ఫైట్స్ కోసమే పెట్టినట్టుంది..అమీర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది. రైఫిల్స్ తీసుకుని కాల్చడం తప్ప చేసింది ఏమీ లేదు.
సినిమా టేకింగ్ బాగుంది ..కానీ కథే అంత ఎఫెక్టీవ్ గా లేదు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది.సినిమా అంతా చూసిన తర్వాత ప్రేక్షకుల మదిలో చాలా ప్రశ్నలు మెదులుతాయి..అవేమిటో కింద స్టోరీ లో చూద్దాం
—–KNM
Paresh Turlapati ………………………….
సినిమాని సినిమాగానే చూడాలి… లాజిక్కులు వెతక్కూడదు వంటి కోటేషన్లు కాసేపు పక్కనబెట్టి తలైవా రజనీ కాంత్ నటించిన కూలీ సినిమా గురించి కొన్ని సంగతులు మాట్లాడుకుందాం.
1.సినిమాలో సత్యరాజ్ ఎలక్ట్రికల్ క్రిమినేషన్ మొబైల్ కుర్చీ కనిపెడతాడు.. శవాల్ని కుర్చీలో కూర్చోబడితే నిమిషాల్లో బూడిడైపోతారు. దర్శకుడి దృష్టిలో అదో పెద్ద ఇన్వెన్షన్ అన్నమాట.. ప్రపంచంలో సత్యరాజ్ మొదటిసారి కనుక్కుంటాడు.. రోజూ దోమల్ని చంపినట్టు మనుషుల్ని చంపే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ నాగార్జున, దయాల్ లకు శవాల్ని ఏం చెయ్యాలో తెలీదు… పెద్ద పెద్ద నేరాలు చేసేవాళ్ళకు చిన్న చిన్న పనులు ఎలా చేయాలో తెలీదనుకోవాలా ??
కుబేరలో విలన్ కి లక్ష కోట్ల వైట్ అండ్ బ్లాక్ మనీ డీల్ ఎలా చెయ్యాలో తెలీక ఆడిటర్ని బదులు సీబీఐ ఆఫీసర్ని పెట్టుకున్నట్టు కూలీలో నాగార్జున సత్యరాజ్ ని పెట్టుకుంటాడు… నాదగ్గర డైలీ శవాలు లేస్తాయి.. నువ్వు వాటిని నీ కుర్చీలో తగలెయ్యాలి అని హోల్సేల్ బేరం మాట్లాడుకుని (బెదిరించి) సత్యరాజ్ కు కూలీ ఇస్తాడు…
ఇహ అప్పట్నుంచి రోజుకోకడ్ని ఆ కుర్చీలో వెయ్యడం సత్యరాజ్ స్విచ్చి నొక్కడం.. తగలెయ్యడం.. ఇదే పని… కథకు కీలకం కూడా ఇదే (సిల్లీ) పాయింట్…గమ్మత్తైన విషయమేంటంటే సత్యరాజ్ చనిపోతే కూతుళ్లు ఆయన శవాన్నిమహా ప్రస్థానంలో ఎలెక్ట్రానిక్ క్రిమినేషన్లో పడేస్తే నిమిషాల్లో కాలి బూడిద అవుతాడు… మరి ఐదు వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిన మాఫియా డాన్ నాగార్జునకు ఈ మెషిన్ ఉంటుందని తెలియదా?
శవాలను కాల్చి బూడిద చేసే కుర్చీ కోసం సత్యరాజ్ వెంబడేందుకు పడతాడు లోకేష్ కనగరాజా?
ఇంతోటి దానికి సత్యరాజ్ చేత అంతంత వర్క్ షాప్ లు అవసరమా? అందరిని కాల్చేసే వాళ్ళు సత్యరాజ్ బాడీని అలాగే ఎందుకు వదిలారు ? అలా వదలక పోతే కథ లేదు..
2. దయాల్ సత్యరాజ్ ను ఎందుకు చంపుతాడు? కొంచెం క్లారిటీ మిస్సింగ్?
3. కూలీ టైటిల్ చూసి గతంలో అమితాబ్ కూలీ అవతారాన్ని, వెంకటేష్ కూలీ అవతారాన్ని ఊహించుకుంటాం. కానీ ఇక్కడ రజనీ కాంత్ చూస్తే సినిమా అంతా (క్లైమాక్స్ మినహా) లాడ్జి ఓనర్ గా కనిపిస్తాడు..మరి టైటిల్ కూలీ అని పెట్టడం వెనక రీజన్ ఆ రెండు నిమిషాల ఫ్లాష్ బ్యాకే కారణమా ?
4. తలైవా నడిస్తే స్టైల్.. నవ్వితే స్టైల్.. బీడీ వెలిగిస్తే స్టైల్.. నల్ల కళ్లద్దాలు పెడితే స్టైల్.. ఇన్ని స్టైల్స్ ఉండగా ఈ వయసులో ఒక పాటలో ఆయన చేత నేల మీద భూచక్రం తిరిగినట్టు గుండ్రంగా తిరిగే ప్రభుదేవా డాన్స్ చేయించాలనే ఆలోచన నీకు ఎట్టా వచ్చింది సామీ?
5. మాఫియా డాన్ నాగార్జునకు ఓ కొడుకునిచ్చావ్ బానే ఉంది.. మధ్యలో వాడికి విలన్ భార్యకి ప్రేమను ఎలా సృష్టించగలిగావు రాజా? అసలు సినిమాలో వాళ్లిద్దరి గోల ఏంటి? అవసరమా?
6. విలన్ డెన్ కి వెళ్లాలంటే రజనీకి ఓ పాత కారు ఇచ్చినా బాగుండేది కదా? తలైవాకి బైకు ఇచ్చి పంపావు సరే కనీసం గ్రాఫిక్ కుర్రాడికి పూర్తి డబ్బులిచ్చి బైకు అటూ ఇటూ ఊగుతున్నట్టు సైడ్ ఎఫెక్ట్స్ సారీ స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చెయ్యొద్దూ..ఆ సీన్ లో రజనీ బల్ల మీద కూర్చుని నేల చూపులు చూస్తున్నట్టు తెలిసిపోతూనే ఉంది..
7. మొదలేమో నాగార్జున పోర్ట్ లోకి చీమైనా దూరదని బిల్డప్ ఇస్తివి.. రజనీ మాత్రం ఎలాంటి చెకింగులు లేకుండా పోర్ట్ మొత్తం తిరిగేస్తుంటాడు.
8. క్లైమాక్సులో చేతిలో కనీసం ఉల్లిపాయ తరిగే కత్తి కూడా లేకుండా రజనీ నాగార్జునతో ఫైటింగ్ చేస్తూంటే అడ్డొచ్చిన మెషిన్ గన్ బాడీ గార్డులను ఒంటిచేత్తో సముద్రంలోకి విసిరికొట్టడం హైలెట్ (సినిమాటిక్ లిబర్టీ అనుకుంటాం లే)
9. అసలు సినిమా మొత్తానికి హైలెట్ ఏంటంటే చచ్చిపోయాడు అనుకున్న దయాల్ ను భూమిలో పాతి పెట్టిన తర్వాత మట్టిని చీల్చుకుంటూ లేచి కూచుంటాడే గూస్ బంప్స్ అన్నమాట..
10. ప్రీతిని బంధించిన దయాల్ తో రజనీ వీడియో కాల్ చేసి ఒక్కసారి మీ వాళ్ళతో మాట్లాడి పరిస్థితేంటో కనుక్కో రాజా అనే సన్నివేశం ఈ మధ్యనే జైలర్ లో చూసేశాం కద.. మళ్ళీ ఇందులో కూడా అదే సన్నివేశం ఎందుకు రాజా? ఈ సీన్ లో శృతి ఫోన్ ద్వారా అవతల కళ్యాణి ని గమనిస్తుంది.. కాసేపటి తర్వాత ఆమె ఎవరో తెలియ నట్టు ప్రవర్తిస్తుంది.. కంటిన్యుటీ ఎక్కడ ?
11. కూలీ సినిమా చూస్తున్నప్పుడు కూలీ సినిమానే చూస్తున్నట్టు అనిపించాలి రాజా? మాకేంటి మధ్యలో కాసేపు బాషా, కాసేపు జైలర్, కాసేపు విక్రమ్ అన్నీ కనిపించాయ్..