Bharadwaja Rangavajhala …………………….
యండమూరి జోగారావు … చూడ్డానికి రివటలా కనిపిస్తాడు గానీ … రెండు మూడు సినిమాల్లో విప్లవకారుడి పాత్ర పోషించాడు. విప్లవకారుడు అంటే నారాయణమూర్తిలా ఉండాల్సిన అవసరం లేదనేశాడాయన . ఆయన నటించిన చివరి చిత్రం ‘ఏది నిజం’ లో కూడా విప్లవకారుడి పాత్రే.ఎస్.బాలచందర్ డైరక్ట్ చేసిన సుంకర సత్యనారాయణ కథ అది.నాగభూషణం హీరోగానూ గుమ్మడి విలన్ గానూ నటించడం మరో విచిత్రం ఈ సినిమాలో..
జోగారావు చాలా ప్రాక్టికల్ .. యాభై ఆరు ప్రాంతాల్లో .. ఓ సారి డాక్టర్ దగ్గరకు వెళ్లి వచ్చి .. నిర్మాతలతో బాబూ నా పోర్షన్ కాస్త పెందరాడే పూర్తి చేసుకోవడం మంచిది .. ఎందుకంటే నా సినిమా కాస్త తేడాగా ఉందన్నాడు డాక్టరు అన్జెప్పేశారట.నాకు తెల్సినంతలో జోగారావుగారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం లేరు. స్టేజ్ మీద చాలా కాలం ఆయన కసరత్తులు చేశారు.
ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్రల్లో బొబ్బలి నాటకం లో బుస్సీదొర పాత్ర. అలాగే రంగూన్ రౌడీలో రౌడీ పాత్ర. ఈ రెండు పాత్రల గురించీ మనకు తెలిస్తే … ఆయన కమేడియన్ కాదనే విషయమూ తెల్సిపోతుంది. చాలా సీరియస్ పాత్రలనే సహజపద్దతుల్లో నటించేవారాయన. సన్నివేశంలో అంతర్లీనంగా ఉండే హాస్యం వల్ల ఆయన అలా అనిపించి ఉండవచ్చు.. అంతే …విపరీతమైన ఈజ్ ఉండేది .. డైలాగుల్లో చక్కటి విరుపుండేది.
‘పెళ్లిచేసి చూడు’లో ఎస్వీఆర్ గురించి సావిత్రి చెప్తుండగా వినే సన్నివేశంలోనూ చెల్లెలి పెళ్లి చెడగొట్టిన మేనమామ తో మాట్లాడే సన్నివేశంలోనూ … జోగారావు చూపుల్లో సమాజాన్ని చదివినతనం కనిపిస్తుంది.అది జీవితం తెల్సిన తనం అని కూడా అనుకోవచ్చు…అలాంటి సందర్భంలో మనమేనా అలానే ప్రవర్తిస్తామేమో అనిపిస్తుంది .
ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశంలోనూ ముస్లిం విప్లవకారుడి పాత్రలో కనిపిస్తారు జోగారావు. చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఓ బ్రైట్ స్మైల్ ఆయన ముఖాన్ని ఆవరించి ఉంటుంది ‘మన దేశం’లో. …. ‘పెళ్లిచేసి చూడు’లో కాస్త చాప్లిన్ లా కనిపించినా .. తనదైన పద్దతిలోనే కొనసాగుతాడు. చాప్లిన్ లోనూ విప్లవభావాలెక్కువే కదా .. అలాన్నమాట.
మన కమెడియన్లలో చాలా మంది ముఖ్యంగా ఎంత సీరియస్ కమేడియన్ అయితే అంత సీరియస్ గా సమాజం గురించి ఆలోచించడం కనిపిస్తుంది.వారి సొంత చిత్రాల్లో సామాజిక స్పృహ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాజబాబు తీసిన సినిమాల విషయంలో ఇది అర్ధమౌతుంది.
జోగారావుది నాకు తెలిసి అమలాపురం … ఐదో క్లాసు చదువుతూ లీలా నాటక సంఘం వారి ‘కుశలవ’ నాటకంలో పిల్లోడి పాత్ర చేశారు.
అలా స్టేజ్ఎ క్కి దాదాపు ముప్పై నాలుగు వరకు అక్కడే కాలక్షపం చేశారు. ఆ తర్వాత నరసాపురం వారి మురళీమోహన నాటక సమాజం వారి ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితాశ్యుడుగా నటించడం ప్రారంభించారు.ఇలా నడుస్తుండగానే అమలాపురంలో నే నల్ల రామ్మూర్తితో కలసి నవకళా నాట్యమండలి ప్రారంభించి ‘ఓన్లీ డాటర్’ నాటకం ఊరూరా ఆడారు.
ఆ తర్వాత బోయిభీమన్న రాసిన’ కూలిరాజు’ నాటకంలో నాయకుడుగానూ పినిసెట్టి రాసిన ‘అపనింద’ నాటకంలోనూ కూడా జోగారావు నటించేవారు.తెలుగుతల్లి అనే నాటకంలో కవి తిక్కన పాత్రలో నటించి మెప్పించిన చరిత్ర ఆయనది. ఇలా నాటకాల పనిమీద తిరుగుతూ నలభై ఆరులో ఏదో పనిమీద బందరు వెళ్లారు.
అక్కడ అప్పటికి మద్రాసులో కెమేరా విభాగంలో పన్జేస్తున్న శ్రీధర్ కళ్లల్లో పడ్డాడు. అలా మద్రాసు చేరి శ్రీధర్ ఇంట్లోనే ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు.ప్రకాశరావు గారి ‘ద్రోహి’ సినిమాలో చిన్న వేషం వేశారు. ఈయన సినిమా ప్రవేశానికీ నటనకు కూడా ఎల్వీ ప్రసాద్ బాగా దోహద పడ్డారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలే మనదేశం , షావుకారు , పెళ్లి చేసి చూడు…అలా ఆయన సినీజీవితం ముందుకు కొనసాగింది. కానీ మొదలైన కొద్ది కాలానికే అది ముగియడం విషాదం.


