‘మేడే కాల్’ వెనుక కథేమిటి ?

Sharing is Caring...

May Day Call ………………

విమాన ప్రమాద ఘటనలు జరిగినపుడు పైలట్ మే డే కాల్ చేశారని వార్తల్లో వింటాం లేదా చదువుతాం . ఇంతకీ మేడే కాల్ అంటే..ఏమిటి ? 

మేడే కాల్‌ అంటే డిస్ట్రెస్‌ కాల్‌. తాము ప్రమాదకర పరిస్థితిలో ఉన్నామని రేడియో కమ్యూనికేషన్‌ ద్వారా సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి  తెలియజేయడానికి పైలట్ చేసే కాల్..తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే స్పందించండి .. సాయం చేయండి అని పైలట్  విజ్ఞప్తి చేయడమే.

అత్యవసర సందర్భాల్లో మాత్రమే ‘మేడే’ అనే పదాన్ని పైలట్ వరుసగా మూడు సార్లు ఉపయోగిస్తారు.ఒక పైలట్ ఏదైనా విపత్తు పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు , “మేడే” అనే పదంతో సంభాషణను మొదలు పెట్టి మూడుసార్లు పునరావృతం చేసి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. విమానాల్లోను, నౌకల్లోనూ ఈ మేడే కాల్‌ను వాడతారు..

ఏ విమాన పైలట్ లేదా ఓడ కెప్టెన్ ఎప్పుడూ కూడా అలా కాల్ చేయకూడదని అనుకుంటారు. ఈ మేడే అనేది ప్రపంచవ్యాప్తంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా డిస్ట్రెస్ కాల్ చేయడానికి ఉపయోగించే పదం. మేడే  కాల్ అంటే ప్రాణాంతక పరిస్థితిని సూచిస్తుంది. సాధారణంగా ఓడ లేదా విమానంలో అయితే దీనిని వివిధ ప్రమాదకర పరిస్థితులలో ఉపయోగించవచ్చు.

మేడే డిస్ట్రెస్ సిగ్నల్‌ను వరుసగా మూడుసార్లు చెప్పాలని శిక్షణలో నేర్పిస్తారు. ఈ మేడే కాల్ అందుకున్న వెంటనే సంబంధిత వ్యక్తులు స్పందిస్తారు. మేడే 1923లో అంతర్జాతీయ విపత్తు కాల్‌గా ప్రారంభమైంది. దీనిని 1948లో అధికారికంగా ప్రకటించారు.

లండన్‌లోని క్రోయ్‌డాన్ విమానాశ్రయంలో సీనియర్ రేడియో అధికారిగా పనిచేసిన ఫ్రెడరిక్ మాక్‌ఫోర్డ్  ఆలోచనే ఈ మేడే కాల్.. ఇది ఫ్రెంచ్ పదం మైడర్ లాగా ధ్వనిస్తుంది, అంటే “నాకు సహాయం చేయి” అని అర్థం.

కొన్నిసార్లు ఒక నౌక ప్రమాదంలో ఉన్నపుడు దాని తరపున  మరొక నౌక  మేడే డిస్ట్రెస్ కాల్ పంపుతుంది. దీనిని మేడే రిలే అంటారు. ప్రమాదంలో ఉన్న నౌక రేడియో కమ్యూనికేషన్లను కోల్పోతే  ఈ మేడే రిలే అవసరం అవుతుంది. మేడే కాల్ ని వెంట వెంటనే  చేస్తారు.

అవతల వైపు నుంచి స్పందన లేకపోతే .. మరొక నౌక సహాయం తీసుకుని  మళ్లీ మళ్లీ  కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.  ఏదైనా సహాయం అందేవరకు చేస్తూనే ఉంటారు.  మేడే కాల్‌ను ఆషామాషీగా తీసుకోకూడదు. యునైటెడ్ స్టేట్స్‌లో, నకిలీ డిస్ట్రెస్ కాల్ చేయడం చట్టవిరుద్ధం. అలా చేసినవారికి ఆరు సంవత్సరాల వరకు జైలు శిక్ష,  $250,000 జరిమానా విధించవచ్చు. 

ప్రాణాపాయం కంటే తక్కువ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నపుడు  ఇతర అత్యవసర సందేశాలలో ఒకదాన్ని పంపవచ్చు. ఉదాహరణకు, “పాన్-పాన్” – ఫ్రెంచ్ పదం పన్నే నుండి వచ్చింది, దీని అర్థం “విచ్ఛిన్నం” breakdown  – ఈ మెసేజ్ వెళ్ళగానే విషయం అవతలివారికి అర్ధమవుతుంది. యాంత్రిక లేదా వైద్య సమస్యతో కూడిన అత్యవసర పరిస్థితిని సూచించడానికి ఉపయోగించవచ్చు.

మరొక సంకేతం “సెక్యూరైట్”—ఫ్రెంచ్ పదం సెక్యూరిటే నుండి వచ్చింది, దీని అర్థం “భద్రత”. చెడు వాతావరణం లేదా నావిగేషన్ ప్రమాదాలు వంటి భద్రత గురించి సందేశాన్ని అందించడానికి ‘సెక్యూరైట్’ తరచుగా ఉపయోగించబడుతుంది. మేడే లాగా,ఈ పదాలను కూడా మూడుసార్లు వరుసగా వాడతారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!