Gazans in a hunger crisis ……………………..
గాజాలో ఆకలి సంక్షోభం తాండవిస్తోంది.ప్రజలు ఆహారం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మానవతా సహాయం పై కూడా ఇజ్రాయెలు ఆంక్షలు, పరిమితులు విధించడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాడులు కారణంగా ..ఆహారం, వైద్యం లభించక సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణమైన పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
శరణార్థులకు అందించే ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరమని, ఇజ్రాయెల్ కాస్త దయ చూపాలని కోరింది. కొనసాగుతున్న దిగ్బంధనంలో ఆహారంతో సహా మానవతా సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడంతో గాజాలో కరువు ప్రమాదం పెరుగుతోంది.
గాజాలోని మొత్తం 2.1 మిలియన్ల జనాభా దీర్ఘకాలిక ఆహార కొరతను ఎదుర్కొంటోంది, దాదాపు అరమిలియన్ మంది ప్రజలు ఆకలి, తీవ్రమైన పోషకాహార లోపం, అనారోగ్యం బారినపడి విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆకలి సంక్షోభాలలో ఒకటి.
2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతోన్న పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, వైద్య సహాయం అందకపోతే మరణాల సంఖ్య మరింత పెరుగుతుంది. యుద్ధం కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజలను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి.
ఎటూ పోలేని పరిస్థితి.. ఉండలేని పరిస్థితి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలీక పెద్దలు,పిల్లలు కుమిలి పోతున్నారు. దాడుల నేపథ్యంలో 94 శాతం ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 36 ఆస్పత్రుల్లో 19 మాత్రమే పనిచేస్తున్నాయి. అక్కడ తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినా దాడుల కారణంగా అవి ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది.
వెంటనే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. గాజాలోకి ఆహారం ఉన్న 200 ట్రక్కులు ప్రవేశిస్తే ఇప్పటివరకు 90 ట్రక్కుల ఆహారం మాత్రమే స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ అయింది.
అక్కడి ప్రజలు ఆహరం అందక ఆకలితో విలవిల్లాడుతున్నారు. యుద్ధ సమయాల్లో ఆహారాన్ని,సహాయ చర్యలను అడ్డుకోవడం నేరం. వైద్యసదుపాయాలను అడ్డుకోవడం తప్పు.. ఈ యుద్ధం ఇజ్రాయెలు కి మంచిది కాదు. ఇరువైపులా శాంతి అవసరం. ఘర్షణలతో శాశ్వత పరిష్కారం లభించదు. గాజాలోని ప్రజలపై దయచూపించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విజ్ఞప్తి చేసింది.
గాజా ప్రాంతంలో మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. అయితే ఆ సహాయం అక్కడి ప్రజలకు ఏ మాత్రం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2 మార్చి 2025న సహాయ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి 57 మంది పిల్లలు పోషకాహార లోపం, ఇతర కారణాలతో మరణించారని అంచనా.
పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే పదకొండు నెలల్లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు దాదాపు 71,000 మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గాజాలో ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితి లో చిక్కుకున్నారు.. పోషకాహార లోపం..వ్యాధులు ఒకదానికొకటి ఇంధనంగా మారుతాయి. తదుపరి తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. వైద్యం లభించకపోతే ఇక మరణం అనివార్యమవుతుంది.
పోషకాహార లోపం శరీరాలను బలహీనపరుస్తుంది, గాయాల నుండి కోలుకోవడం,విరేచనాలు, న్యుమోనియా,మీజిల్స్ వంటి సాధారణ అంటు వ్యాధులతో పోరాడటం కష్టతరం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు శరీర పోషకాహార అవసరాన్నిపెంచుతాయి. ఆహారం ,మందులు వాడకపోతే పరిస్థితి దుర్భరంగా మారుతుంది.
గర్భిణీలు .. పాలిచ్చే తల్లుల పరిస్థితి మరీ నరకమే. ఈ పరిస్థితి మారకపోతే రాబోయే పదకొండు నెలల్లో దాదాపు 17,000 మందికి తీవ్రమైన పోషకాహార లోపం కారణంగా చికిత్స అవసరమవుతుందని అంచనా. ఆహారం, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోతే ఒక తరం మొత్తం శాశ్వతంగా ప్రభావితమవుతుంది.
ప్రాణాలను రక్షించే వైద్య సామాగ్రి గాజా వెలుపల ఉండగా అవి అందక ప్రజలు చనిపోతున్నారు. మానవతా సూత్రాలకు అనుగుణంగా సహాయం అవసరమైన వారికి అందేలా సహాయ దిగ్బంధనకు ముగింపు పలకాలని WHO విజ్ఞప్తి చేసింది.కానీ ప్రజల ఆకలి కేకలు,ఆక్రందనలు ఇజ్రాయెల్ పాలకులకు, హమాస్ కి వినిపిస్తాయా అనేది సందేహమే.