గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం గా మారుతున్నబీజేపీ వైపు పలువురు నేతలు చూస్తున్నారు. అదే సమయంలో బీజేపీ ఇతర పార్టీ నేతల పట్ల ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో అక్కడ త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దుబ్బాక సీటు గెలుచుకుని , గ్రేటర్ లో బలం పెంచుకున్న బీజేపీ సాగర్ పై కన్నేసింది. నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అవునంటే జానారెడ్డిని లేదంటే జానా కుమారుడు రఘువీరారెడ్డి ని పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన డీకే అరుణ ద్వారా మంతనాలు జరిపిస్తున్నారు.
ఇక జానారెడ్డి విషయానికొస్తే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నరసింహయ్య చేతిలో 7,771 ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఆ నాటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కంకణాల నివేదితకు 2675 ఓట్లు వచ్చాయి. ఓడిపోయినప్పటికీ జానా కుటుంబానికి ఆప్రాంతంలో మంచి పలుకుబడి ఉంది. అందుకే ఆయనను పార్టీ లోకి చేర్చుకోవాలని తద్వారా కేసీఆర్ కి సవాల్ విసరాలని భావిస్తోంది. కాంగ్రెస్ లో 32 సంవత్సరాలనుంచి ఉన్న జానారెడ్డి ఎన్నో పదవులు అనుభవించారు.
మొదటిసారిగా 83 లో జరిగిన ఎన్నికల్లో జానా చలకుర్తి టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచారు. క్యాబినెట్ మంత్రి అయ్యారు. అప్పట్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఎందరినో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1988 లో ఎన్టీఆర్ 31 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన తీరుకి నిరసన గా టీడీపీ నుంచి బయటకొచ్చారు. కొన్నాళ్ళు సొంతంగా పార్టీ నడిపారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నాటినుంచి నేటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. మొదటి నుంచి జానారెడ్డి ప్రజలతో కలసి తిరుగుతూ , వారి సమస్యల కోసం పనిచేస్తూ జననేత గా ఎదిగారు. అందుకే జనం జానారెడ్డి ని అంతగా ఇష్టపడతారు. కాంగ్రెస్ అధికారం లో వచ్చి ఉన్నట్టయితే జానా యే సీఎం అయ్యేవారు.
తెలంగాణ ఏర్పడిన దరిమిలా 2014,2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవాలను ఎదుర్కొంది. పార్టీకి ఇక ముందు కూడా కష్టాలే. ఇది గమనించి చాలామంది నేతలు బీజేపీలోకి వెళుతున్నారు. సత్తాగల నేతలను గుర్తించి బీజేపీ పార్టీలో చేర్చుకుంటుంది. ఇక నలభై యేళ్ల రాజకీయ అనుభవం గల జానా ప్రస్తుత దశలో పార్టీ ఫిరాయిస్తారా అనేది అనుమానమే. పదవులకోసమే అయితే ఆయన ఎపుడో తెరాస లో చేరే వారు. జానా కు మొదటినుంచి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు తెలిపారు.
ఇక ఆయన కాదంటే జానా తనయుడు రఘువీరారెడ్డి ని అయినా పార్టీ లోకి లాగి సాగర్ బరిలోకి దించాలనేది బీజేపీ నేతల వ్యూహం. రఘువీరారెడ్డి కూడా రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్నవారే. గతంలో రాజకీయంగా జానాకు సహాయ పడేందుకే సాగర్ నియోజక వర్గంలో పాద యాత్రలు కూడా చేశారు. నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. పారిశ్రామికవేత్తగా స్థిరపడిన రఘువీరా రెడ్డి తండ్రి ఒకే అంటే బీజేపీ లో చేరే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైతే ఆయన కూడా సుముఖంగా లేరని సమాచారం. పోటీ చేస్తానంటే కాంగ్రెస్ కూడా టిక్కెట్ ఇస్తుంది. అందులో సందేహం లేదు. రఘు వీరా ఛాయిస్ ఏమిటో ? కొద్దీ రోజులు పోతే కానీ తేలదు. రఘువీరా లాంటి వారు పార్టీ లో చేరితే అక్కడ బీజేపీ కి ఊపు రావడం ఖాయం. ఒకప్పుడు కమ్యూనిస్టుల , కాంగ్రెస్ నేతల హవా నల్లగొండ జిల్లాలోఉండేది. తెరాస వచ్చాక ఆ పార్టీలు బలహీన పడ్డాయి. ఈ క్రమంలో అక్కడ బీజేపీ కాలు పెట్టాలంటే బలమైన నేతల అవసరం ఉంది. ఏమి జరుగుతుందో చూద్దాం.
—————KNM