కర్ణ పిశాచి కథ !!

Sharing is Caring...

Supernatural powers can sometimes be deadly….. 

నిత్యానందం పేరుకు తగ్గట్టు చాలా ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉండటం మూలంగా తను ఎక్కువ కష్టపడకుండా ఎక్కువగా ఆటపాటలతో విందువినోదాలతో కాలం గడపసాగాడు.

ఒక రోజు గుర్రంమీద విహారానికి ఊరి బయటకు వెళ్ళాడు.  వీపుమీద చద్దిమూట కట్టుకుని- సొరకాయలో మంచినీరు తీసుకుని ప్రకృతి అందాలు చూస్తూ వనవిహారం చేయసాగాడు. అలా పోతుండగా ఒక మూలుగు వినిపించింది. గుర్రాన్ని అటుగా మళ్ళించాడు.

దారిలో ఒక సాధువు ‘ఆకలి ఆకలి’- ‘దాహం దాహం’అంటూ నేలమీద పడుకుని బాధపడుతున్నాడు. నిత్యానందంకు జాలి కలిగి గుర్రం దిగి అతనిని సమీపించి నమస్కరించాడు. సాధువు ‘ఆకలి’అని అడిగాడు. ‘దాహం’అని సైగ చేశాడు. వెంటనే నిత్యానందం అతనికి తను తెచ్చుకున్న సద్దిమూట, సొరకాయలోని నీళ్ళు అందించాడు.

సాధువు తృప్తిగా తిని, గడగడ మంచినీరు తాగేశాడు ‘అన్నదాత సుఖీభవ!’ అని దీవించాడు.
‘‘స్వామీ! తమరు గుర్రం ఎక్కితే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపొమ్మంటే అక్కడికి తీసుకుపోయి వదిలిపెడతాను’’ వినయంగా చేతులు జోడించి చెప్పాడు నిత్యానందం.

‘‘నాయనా! నాకు అవసానదశ వచ్చింది. ఎక్కడికి వచ్చినా ప్రయోజనం లేదు. కాకపోతే నా బాధల్లా నేను మరణిస్తే నా విద్య కూడ నాతో కాలగర్భంలో కల్సిపోతుంది. అందుకే నీకు ఇస్తాను. స్వీకరించు.’’ అని అడిగాడు సాధువు. నిత్యానందంకు ఏం చెప్పాలో తెలియక తల వూపాడు.

సాధువు తన తొడ చీల్చి అందులో నుంచి  ఒక బంగారు రేకును బయటకు తీశాడు. దానిని నిత్యానందం తొడలో అమర్చాడు.శస్తచ్రికిత్స చేయకుండా కేవలం చేతితో యిలా అని అలా తీయడం, తిరిగి చేత్తోనే తన తొడలో అమర్చడం. మళ్ళీ చర్మం మూసుకుపోవడం అతనికి అద్భుతంగా తోచింది. అక్కడ చిన్నమచ్చ మటుకు పడింది. ఆ తర్వాత అతని చెవిలో ఒక మంత్రం ఉపదేశించాడు.

‘‘దీనిని నియమాలతో లక్షసార్లు జపిస్తే సిద్ధిస్తుంది..  దీనివలన ప్రజలకు మేలుచేస్తావు. కీడు మటుకు చేయద్దు.’’అంటూ కన్నుమూశాడు. సాధువు మరణానికి ఎంతో చింతిస్తూ అతనికి అక్కడే అంత్యక్రియలు చేసి బయలుదేరాడు.ఆ తరువాత ఆ మంత్రాన్ని లక్షసార్లు జపించాడు.

అతనికి ఒక దేవత ప్రత్యక్షమయింది. చాలా అందంగా ఉంది. ఆమెని చూడగానే అతను అచేతనుడయ్యాడు. ‘ భయపడకు..నీకు నేను ఏ హాని తలపెట్టను. నేను కర్ణపిశాచిని.భవిష్యత్తు గురించి నీకు చెబుతాను. ఎవరు నీ దగ్గరకు వచ్చినా వారి సమాచారాన్ని, వారి భవిష్యత్తును నీకు తెలియచేస్తాను.

తద్వారా నువ్వు ఎక్కువ ధనం సంపాదించుకో. కాని ఒకటి గుర్తుంచుకో! రోజుకు వంద మందికి మాత్రమే నేను కచ్చితంగా భవిష్యత్తు చెప్పగలను. ఆ తరువాత నన్ను అడగవద్దు. నీకే ఇబ్బంది.’’ అని హెచ్చరించి మాయమైపోయింది.నిత్యానందంకు యిదంతా కలలా అనిపించింది. పట్టించుకోలేదు. ఒకరోజు దండోరా వినిపించింది.

ఆ వూరి జమీందారుగారి తాళాల గుత్తిపోయిందని.  అది తెచ్చిచ్చినవారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుందని దండోరా వేసినతను చెప్పుకొచ్చాడు.‘‘అరే! జమీందారుగారి తాళాల గుత్తి ఎక్కడ పోయుంటుందబ్బా!’’ అని తనలోతాను అనుకున్నాడు ఆశ్చర్యపోతూ నిత్యానందం. వెంటనే కర్ణపిశాచి బదులిచ్చింది.

‘‘ఎక్కడికీ పోలేదు. గుర్రపుశాలలోని దాణాకింద పడి ఉంది.’’ అది నిజమా కాదా తేల్చుకుందామని అక్కడికి బయలుదేరాడు. అక్కడ వెతికితే నిజంగానే తాళాల గుత్తి కనిపించింది. అది తీసుకుని జమీందారుకిచ్చాడు. అది చూసి అతను సంతోషించి ఇతనికి ఒక బంగారు చెంబులో వెండి కాసులు పోసి యిచ్చాడు బహుమానంగా.

‘‘అక్కడ పడిందని నువ్వెలా ఊహించావు?’’ అడిగాడు జమీందారు. ‘‘నాదేముందండి. అంతా ఆ దేవత దయ!’’ అని చెప్పాడు.వెంటనే నిత్యానందంకు దేవత అనుగ్రహం ఉందని,తద్వారా ఏదైనా చెప్పగలడని  దివాణం లో అనుకున్నారు.

‘‘మా అమ్మాయికి పెళ్ళిచేయడం కష్టంగా ఉంది. వరుడు ఎక్కడున్నాడో కాస్త చెప్పు’’ అని బ్రతిమాలింది జమీందారు భార్య. వెంటనే ఫలానా గ్రామంలో వున్నాడని అక్కడ ప్రయత్నిస్తే జరుగుతుందని కర్ణపిశాచి అతని చెవిలో చెప్పింది. దాన్ని నిత్యానందం ఆమెకు తెలియచేశాడు. అది నిజమై వెంటనే వారి కూతురికి పెళ్ళి జరిగిపోయింది.

ఇదంతా ఆనోట ఈనోట ఊరువాడా వ్యాపించింది. మాట పెదవి దాటితే పృథ్వి దాటు తుందన్నట్లు చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా అతని ఖ్యాతి పాకిపోయింది. తమ కష్టాలు చెప్పుకుంటూ ప్రజలు రాసాగారు. ఒకరు తమ ఆవు తప్పిపోయిందని వస్తే- యింకొకరు యింటినుండి తన కుమారుడు పారిపోయాడని- ఎక్కడ ఉన్నాడో చెప్పమని వచ్చేవారు. 

అలా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య.. దాని పరిష్కారంకోసం నిత్యానందం దగ్గరకు పరుగెత్తుకు వస్తున్నారు.అతను చెబుతున్నాడు. వాళ్ళు తృణమో పణమో ఇచ్చి వెళుతున్నారు. చాలామందికి జరుగుతున్నాయి. వందమంది కాగానే కర్ణపిశాచి చెప్పనంటున్నది. మొదట్లో వంద మంది వచ్చేవాళ్ళు కాదు. సమస్య రాలేదు.

కాలక్రమేణా అతను నిద్రలేవకుండానే వీధిలో ప్రజలు బారులుకట్టి నిలబడేవారు. తన కాలకృత్యాలు తీర్చుకుని వాళ్ళకు ప్రశ్నలు చెప్పి పంపడం తలకు మించిన భారం అవుతున్నది. నూరు మంది అయినా కొందరు మొండిగా తమకూ చెప్పమని వేధిస్తారు. అప్పుడు కర్ణపిశాచిని బ్రతిమాలినా చెప్పదు. నవ్వుతుంది. ఇంక లాభం లేదనుకుని తానే నోటికొచ్చింది చెప్పేవాడు. కొందరికి జరిగేవి- కొందరికి జరిగేవి కాదు.

మొత్తానికి అతనికి పేరులోనే ఆనందం మిగిలింది.ఒకసారి సాయంత్రం, వచ్చిన జనాలను పంపించి, విశ్రాంతి తీసుకుంటూ ఉంటే రాజభటులు వచ్చారు. రాజుగారు పిలుస్తున్నారంటూ. రేపు వస్తానని చెప్పినా వినకుండా అతన్ని బలవంతాన రాజుగారి సమక్షంలో నిలబెట్టారు.
‘‘నిత్యానందం! నీకేదో విద్య వస్తుందట- నిన్ను పరీక్షించాలి.’’ రాజుగారు అడిగారు.

‘‘క్షమించాలి- రేపు ఉదయం మీ పరీక్షకు నేను సిద్ధం!’’ ‘‘అది కుదరదు- యిప్పుడే చెప్పి తీరాలి!’’ ‘‘నానియమం ప్రకారం ఈరోజుకు నేను చెప్పలేను.’’ ‘‘అంటే నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు- వారి బలహీనతలని ఆసరా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నావు. విద్య వున్నవాడివి ఎప్పుడైనా చెప్పాలి!’’ గద్దించి అడిగాడు రాజుగారు.

‘‘కానీ రాజా..జ్యోతిష్యానికి పార్వతీదేవి శాపం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు.’’ తప్పించుకుందామని చూశాడు. ‘‘ఇది రాజాజ్ఞ! చెబుతావా! తల తీయించమంటావా?’’ మంత్రి అడిగాడు. భయపడిపోయి చెబుతానన్నాడు. రాజుగారు అడిగారు. ‘‘రాజ ముద్రిక మాయం అయింది. ఎవరు తీశారో చెప్పు.’’ మనసులో కర్ణపిశాచిని ప్రార్థించాడు చెప్పమని. నా నియమము ప్రకారం ఈరోజుకు నూరు అయిపోయింది.రేపు చెబుతాను అని చెప్పింది.

దాంతో కోపం వచ్చి ఆ కర్ణపిశాచిని తిట్టాడు- ‘అవసరానికి ఆదుకోని దానివి నువ్వేం దేవతవని.’ కర్ణపిశాచికి కోపం వచ్చింది. వీడి పని పడదామనుకుంది. రాజుగారి మూడవ భార్య గదిలో ఉందని చెప్పింది. ‘‘రాజా! మన్నించండి- దానిని తమరి మూడవ ముద్దుల భార్యగారు తీశారు.’’ అని చెప్పాడు ఊపిరి పీల్చుకుంటూ.. ‘‘నిజం తేలేదాకా వీడిని గదిలో బంధించండి’’. అని రాజుగారు ఆజ్ఞాపించి మూడవ భార్య దగ్గరికి వెళ్ళాడు.

రాజుగారు ఆమె గదిని పరిశీలించాడు- భటులతో వెతికించారు. రాజావారి మూడవ భార్యకు అవమానం జరిగి బాధపడింది. కన్నీరు కార్చింది. రాజావారికి ఒళ్ళు మండిపోయి నిత్యానందాన్ని పిలిపించాడు. ‘‘వీడి జ్యోతిష్యం  తప్పుల తడక.  వీడికి నూరు కొరడాదెబ్బలు కొట్టండి. అప్పటికి నిజం చెప్పకబోతే తల తీయండి.’’ అని ఆజ్ఞాపించాడు.

రాజభటులు అతన్ని తీసుకుపోయి కొరడాలతో కొట్టసాగారు. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. మనసులో నిత్యానందం కర్ణపిశాచిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. రాత్రి దాటిపోతున్నది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. ‘‘ఆగండి- నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. మీకు రాజముద్రిక దొరకాలి . అంతేగదా! నన్ను వదలండి’’. అని ప్రార్థించాడు. అంతేగాక తన ఒంటిమీదున్న బంగారాన్ని ఇస్తానన్నాడు. వాళ్ళు అవి తీసేసుకుని కరుణించారు.

కొరడా దెబ్బలు కొట్టేవాళ్ళు కూడా అలసిపోయి మిగతావి రేపు చూసుకుందాములే అని విశ్రమించారు. ఈలోగా తూర్పున సూర్యోదయం కాసాగింది. రోజు గడిచింది. కర్ణపిశాచి నోరు తెరిచింది. చెప్పింది. ‘‘దానిని రాజుగారి మొదటి భార్య తమ్ముడు తస్కరించాడు’’ అని. వెంటనే అతను దానిని రాజుగారికి తెలియచెప్పాడు. ఈసారి నిజంగానే రాజుగారి బావమరిది దగ్గర రాజముద్రిక దొరికింది. రాజుగారు నిత్యానందంను విడిపించి ఘనంగా సన్మానించి కానుకలు యిచ్చి పంపారు.

నిత్యానందం కోలుకోవడానికి కొంత కాలం పట్టింది. వెంటనే తొడలోంచి బంగారు రేకును తీసి నదిలో విసిరేశాడు..  మంత్రాన్ని ఆవు చెవిలో వదిలేశాడు. కర్ణపిశాచి నవ్వుకుంటూ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ‘‘ఈ విద్యలు వద్దు- మిద్దెలు వద్దు బ్రతికుంటే బలుసాకు తినచ్చు’’ అతను ఆ వూరి నుంచి భార్యబిడ్డలతో పారిపోయాడు.
నీతి:- అతీత శక్తులు ఒక్కోసారి ప్రాణాంతకం అవుతాయి. 

 కె.విజయప్రసాద్ గారి సౌజన్యంతో 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!