ఆకట్టుకునే జానపద కథ !!

Sharing is Caring...

An entertaining movie …………….

మహాబలుడు! సూపర్ స్టార్ కృష్ణ నటించిన జానపద చిత్రాల్లో ఇదొకటి.1969 లో ఈ చిత్రం రిలీజ్ అయింది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అంతకు ముందు సూపర్ స్టార్ నటించిన గూఢచారి 116 కి రవికాంత్ DOPగా చేశారు. అప్పటి నుంచే ఆ ఇద్దరికీ పరిచయం. అందుకే ఆయన డైరెక్టర్ అనగానే కృష్ణ వెంటనే అంగీకరించారు.

భారతి పిక్చర్స్ బ్యానర్ పై పి. మల్లికార్జునరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.అప్పట్లో జనాలు ఈ చిత్రాన్ని బాగానే ఆదరించారు. సూపర్ స్టార్ కెరీర్ లో ఇదొక హిట్ మూవీ.  మంత్రాలు, మాయలతో కూడిన ఈ జానపద కథ మూడుమణులు చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది.

తల్లిదండ్రుల కోరిక మేరకు యువరాజు ప్రతాపసింహుడు (కృష్ణ) ధర్మపురి యువరాణి ఇంద్రప్రభ (వాణిశ్రీ) స్వయంవరానికి వెళ్తాడు.ఇంద్రప్రభ వద్దనున్న ఇంద్రమణిని అపహరించేందుకు మాంత్రికుడు సర్వజిత్ (త్యాగరాజు) శిష్యుడు దుర్ముఖి (రావి కొండలరావు) అక్కడికి వస్తాడు.

దుర్ముఖి మాయతో ప్రతాపుడు యువరాణి దగ్గరగా వెళ్లడంతో ఇంద్రమణి నల్లగా మారుతుంది. ఇంద్రప్రభ అచేతనమవుతుంది. వీటన్నింటికీ ప్రతాపుడు కారణమని భావించిన మహారాజు అతగాడిని శిక్షించమని ఆదేశిస్తాడు. ప్రతాపుడిని రాజభటులు హింసించి అడవుల్లో పడేస్తారు.

సైనికుల చావుదెబ్బలు తట్టుకుని బతికిన ప్రతాపుడు దాహమవుతుంటే ఒక గుహలోకి వెళ్లి .. అక్కడ ఉన్న కుండలోని నీటిని తాగి మహాబలుడు అవుతాడు. ఆ తర్వాత ఇంద్రప్రభను ఎలా రక్షిస్తాడు ? మణులను ఎలా తీసుకొస్తాడు ? అనేది తెరపై చూడాల్సిందే.

ఈ సినిమాలో హీరోయిన్ వాణిశ్రీ మూడు పాత్రల్లో నటించారు.రవికాంత్ సూపర్ స్టార్ ను చాలా అందంగా చూపారు. హీరో కృష్ణ మహాబలుడు గా మారే సన్నివేశాలు బాగుంటాయి. అంతకు ముందు కొంచెం సన్నగా ఉండే ప్రతాపుడికి మహాబలుడు అయ్యాక ప్రతాపుడికి తేడా స్పష్టంగా చూపించారు. సూపర్ స్టార్ మహాబలుడు పాత్రలో అభిమానులను అలరిస్తారు.

దుర్ముఖి మాయ ప్రభావంతో కృష్ణ రాజకుమారి వాణిశ్రీని టీజ్ చేస్తూ పాడే ‘ ఏమే ఒప్పుల కుప్పా’ పాట బాగుంటుంది.పెద్ద హిట్ సాంగ్ అది. స్వయంవరానికి  వచ్చిన రాకుమారులను అలరిస్తూ నటి గీతాంజలి చేసే డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘దుర్ముఖి’ గా రావి కొండలరావు తనదైన శైలిలో నటించారు. చిన్న సైజు మాంత్రికుడిగా బాగా చేశారు. 

మణులను వెతికే క్రమంలో అడవిలో కృష్ణ ఒక పండు తిని అమ్మాయిగా మారిపోతాడు. అమ్మాయిగా నటి లక్ష్మి చేశారు. రాజబాబు కోయదొర పాత్రలో కాసేపు నవ్విస్తాడు. రక్తాక్షి అనే రాక్షసుడితో హీరో పోరాట దృశ్యాలు బాగుంటాయి.మూడు మణులను ఏకం చేయటంతో ఇంద్రప్రభ, కోయ యువతి, సూర్యప్రభ ముగ్గురూ ఒకటిగా మారే సన్నివేశాలను బాగా చిత్రీకరించారు.

పాతాళలోకంలో కృష్ణ కు పరీక్ష పెట్టే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. కథను వేగంగా నడిపారు. అప్పలాచార్య సంభాషణలు అందించారు. ఒక సందర్భంలో ‘అసంభవం అనేది నా జాతకంలో లేదు’అని సూపర్ స్టార్ అంటారు. నిజమే కదా.. ఇక ఆరుద్ర, సినారె  పాటలు రాసారు. ఎస్. కోదండపాణి మంచి ట్యూన్స్ కట్టారు. ‘ఏమే ఒప్పుల కుప్పా ?’ ‘విశాల గగనం’లో పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.  యూట్యూబ్ లో సినిమా ఉంది. చూడని వారు చూడవచ్చు .  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!