‘అవును’! కనిపించని దెయ్యం కథ!!

Sharing is Caring...

Thriller movie ………………………..

“అవును” హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ..2012 లో రిలీజ్ అయిన సినిమా ఇది. డైరెక్టర్ రవిబాబు పకడ్బందీగా కథ రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. భయపడేంత హారర్ మూవీ కాదు కానీ థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు మొదటి నుంచి చివరి వరకు పుష్కలం గా ఉన్నాయి. సీనియర్ రచయిత సత్యానంద్ స్క్రీన్ ప్లే బాగుంది. ఆ మేరకు కథ అద్భుతంగా తెరకెక్కింది.

‘నువ్విలా’ లో నటించిన నటి యామి గౌతమ్ అనుభవాల ఆధారంగా ఈ కథను రవి బాబు తయారు చేసుకున్నారు.యామీ గౌతమ్ ఒక ఇంట్లో అద్దెకు ఉన్నపుడు ఎవరో తనను వెంటాడుతున్నారని ఫీల్ అయ్యేది. ఇంటిలో అనేక విచిత్రమైన సంఘటనలు జరిగేవట. ఏదో ఆత్మ లేదా దెయ్యం తనను వెంటాడుతున్నట్టు యామి ఫీలయ్యేది.

వాటిని భరించలేక భయపడి ఆ ఇంటిని ఖాళీ చేసింది. ఈ విషయాలన్నీ ఒక సారి రవిబాబు కి యామీ గౌతమ్ చెప్పింది. ఆమె అనుభవాలకు కొంత కల్పన జోడించి కథ గా మార్చారు.హారర్ సినిమా అంటే చీకటి, రకరకాల ఆకారాలు చూపడమే కాదు.

అది పగలైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మనకు కనపడకుండా మనతో ఎవరో ఒకరు ఉన్నారనే భావన కలిగితే .. వెన్నులో వణుకు పుడుతుంది.ఆ ఫీలింగ్స్ నే సినిమాలో మోహిని(పూర్ణ )పాత్రలో చూపారు.కథను ఒక పద్ధతి ప్రకారం నడిపారు. అందుకే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది.

సినిమా బిగినింగ్ పూర్ణ అరెస్ట్ తో మొదలవుతుంది.భర్తను హత్య చేసిందని ఆరోపణ. కథలో సస్పెన్స్ అక్కడే నుంచి కొనసాగుతుంది.హీరో ఫ్రెండ్ కొడుకు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కంటికి కనిపించని తాత తో మాట్లాడే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పూర్ణ నిద్ర పట్టక రాత్రివేళ ఇంట్లో తిరిగి సన్నివేశాలు ఏదో జరగబోతుందని ఇండికేషన్ ఇస్తాయి.

పూర్ణ బట్టలు మార్చుకుంటున్న సమయంలో కుర్చీలో ఎవరో కూర్చున్నట్టు కనిపించే సీన్, పూర్ణ అత్తగారు నిద్రలో నడిచే సీన్ ,ఆమె నిద్రపోతున్నప్పుడు నేలపైకి దెయ్యం నెట్టివేసిన సీన్ బాగుంటాయి.హీరో ఫ్రెండ్ కొడుకును దెయ్యం ఫ్యాన్ పై కూర్చోపెట్టిన సీన్ .. కుర్చీ కదలడం .. బూటు ముద్రలు కనిపించడం వంటి సీన్లు ఆ ఇంట్లో ఏదో ఉందని చెబుతాయి. 

హీరో ఫ్రెండ్ తల్లి సుధ, పూర్ణ దెయ్యాన్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నించే సీన్లు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయి.నటుడు జీవా పూర్ణను ఇంటరాగేట్ చేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులకు జీవాపై కోపం వచ్చేలా అతని వెటకారాన్ని బాగా పండించారు.

పూర్ణ పాత్రలో ఇమిడి పోయి బాగా నటించింది.హర్ష గా హర్షవర్ధన్  బాగానే చేశారు. ఇంతకూ ఆ ఇంట్లో నిజంగా దెయ్యం ఉందా ? లేదా ? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. చివరి సన్నివేశాల్లో దెయ్యం ఎవరో తెలిసిపోతుంది. అదే ఊహించని ట్విస్ట్. దర్శకుడు సినిమాలో ఏ పాత్రకు దెయ్యం కనిపించకుండా కథను నడిపారు.

ఈ సినిమాలో హీరో పాత్రకు తొలుత దేవరకొండ విజయ్ ను అనుకున్నారు. కానీ అతను అందుబాటులో లేకపోవడంతో హర్షవర్ధన్ ను తీసుకున్నారు.కథలో పాత్రలు తక్కువ.పాటలు కూడా లేవు.కథపైనే ఫోకస్ అంతా.రవి బాబు తండ్రి చలపతి రావు హీరో తండ్రి పాత్రలో నటించారు. చలపతి రావు పాత్ర, ఆయన భార్య క్యారెక్టర్ సరదాగా సాగుతాయి. 

ఈ సినిమాను 45 లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సినిమాను 3.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి రిలీజ్ చేసుకున్నారు. నివాస్ సంభాషణలు, సుధాకర్ రెడ్డి కెమెరా పనిదనం..శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యాయి.రవిబాబు తీసిన సినిమాల్లో ఇదొక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో సినిమా ఉంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. చూసిన వారు కూడా చూడవచ్చు. 

——-KNM     

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!