Katta Srinivas …………………..
మరణం అంటే ఏమిటి? భౌతిక దేహం పనిచేయకుండా పోవడమా? లోపటి సాప్ట్ వేర్ కు క్రియేటివ్ టాస్క్ కానీ డ్రైవింగ్ ఫోర్సు కానీ లేకపోవడమా? కవి ఏమంటున్నాడు?
కొన్నిసార్లు స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చాలాసార్లు చుట్టూ వున్నదంతా మాయమైపోయి రోజూ ఆవరించుకున్న అదే డిమ్ లైటింగ్ లో ఎందుకెళుతున్నామో తెలియకుండా ప్రయాణం సాగుతూ….నే వుంటుంది. దీనికి సైకాలజీ కౌన్సిలరే సిట్టింగ్ ఇవ్వాలా, కవి కూడా కౌన్సిలింగ్ చేసేస్తాడా అంటే పాబ్లో నెరుడా అదేదో చేసేసి చూపించినట్లున్నారు. జీవిత తత్త్వాన్ని ఒడిసిపట్టినట్లు YOU START DYING SLOWLY అనే కవితలో చెప్పేస్తున్నాడు.
ఏయే సందర్బాలు మీకు ఎదురవుతున్నాయి అనేది ఇంటర్వూ క్వశ్చనీర్ లా ఇచ్చి అలాంటి స్థితిలో వుంటే అదేదో మొదలయినట్లే అని నిరూపణ చేస్తున్నాడు. ఇక్కడో సందేహం రావొచ్చు మరి కౌన్సిలింగ్ పాజిటివ్ వైబ్ తో వుండాలి కదా ఇదంతా సచ్చుడు సచ్చుడు అంటూనే సాగటం సమంజసమేనా అని, నిజానికిది నెగెటివ్ టూది నెగెటివ్ పొతావ్ రొరేయ్ అంటే పొమాకా అని చెప్పినట్లే పొరపాటున ఈ దశలకు వెళ్ళావా జీవితమనేది చేజారుతున్నట్లే అని చెప్పడం కదా ఇది.
కొన్నిలక్షణాలు చూడండి. ప్రయాణాలేవీ చేయక పోవడం,చదవడం అసలే ఆపేయడం, జీవీతం చెప్పే మాటలు వినకపోవడం, నిన్ను నీవు పొగుడుకోనప్పుడు, ఆత్మాభిమానమనేదే లేకుండా నిస్సిగ్గుగా బతకాల్సి వచ్చినప్పుడు, ఇంకెవరి సాయం తీసుకోన్నప్పుడు, కొత్తవాళ్ళతో మాట్లడటం చేయనప్పుడు, అదే రొటీన్ లో బిగిసిపోయినప్పుడు, కొత్త రంగులేవీ వేసుకోలేనప్పుడు.
అలాగే వాహనానికి ఇంధనంలా నీ జీవితాన్ని నడిపించే కల అనేదేమీ లేనప్పుడు, మనసుని ఉద్వేగానికి గురిచేసి, కళ్ళను మెరిపించే పనుల్లోకి నువ్వు వెళ్ళనప్పుడు, తోటివాళ్లో, జీతమో, ఉద్యోగమో నచ్చకపోయినా తప్పక కట్టుబడిపోయినప్పుడు, భద్రజీవితంలో నత్తగుల్లలా అలాగే ముడుచుకుని కొంచెం తొంగిచూసినా లేనిపోని ప్రమాదం ఎందుకులే అని అక్కడే ప్రపంచం అనుకుంటున్నామో ?
తెలివైన సలహాలకు కట్టుబానిసగా యాంత్రికంగా అమలుచేస్తూ వుంటావో, అసలు నీకు నువ్వే నచ్చకుండా ఎప్పటికీ వుంటూ వుంటావో, పాబ్లో నెరుడా రాజకీయనాయకుడిగా, విప్లవకారుడిగానే కాదు కవిగా తనదైన ముద్రవేసుకున్నది.. దానిలోని లోతుల గురించే.
1971 సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వరించిన, చిలీ తమ జాతీయ కవిగా ఇతనిని భావించినా అందుకే కదా. కొలంబియన్ నవలా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్ అయితే మరోక్క అడుగు ముందుకు వేసి 20 వ శతాబ్దంలో ఏ భాషలోనైనా అతి గొప్ప కవి పాబ్లోనే అంటూ కితాబు ఇచ్చాడు.
అటువంటి కవితను తెలంగాణభాషలోకి ఒంపుకుని చూద్దాం అనిపించిది. పక్కన కుర్చుని దోస్తుతో మాట్లాడుకున్నట్లు. ఇవే లైన్లను సునో సహకారంతో పాటలా పాడించాను. చివర్లో లింకు వుంది వీలుంటే చూడండి.
లింకు ఎందుకంటే అందులోనుంచి ఐడి వెతికితే ఇంకా మరికొన్ని పాటలపై చేసిన ప్రయత్నాలు ప్రయోగాలూ కూడా వున్నాయి. అది సరే జీవితం ఉత్సాహంగా వుండాలంటే నిస్సత్తువ తొలగాలంటే మీరేదైన మరో మంచి ప్రిస్క్రిప్షన్ వుంటే తప్పకుండా కామెంటండి. పై పైన కాకుండా నిదానంగా మనసుతో చదువుకుంటూ వెళ్ళగలరేమో ప్రయత్నం చేయండి.
===========================================
|| నీ సచ్చుడు నింపాదిగా మొదలయితది ||
ఫాబ్లో నెరుడా కవితకు తెలంగాణీకరణ కట్టా శ్రీనివాస్
*******************************************************************
నువు సచ్చుడు నింపాదిగా షురూ అయితది
నువ్వేడకీ పయానమే సెయనప్పుడు
సదువుడనేదసలే ఆపేసినప్పుడు
జిందగీ సెప్పెడి ముచ్చటేదీ ఇనిపించుకోనప్పుడు
నిన్నునువెప్పుడూ పొగుడుకొనుడేలేనప్పుడు.
నువు సచ్చుడు నింపాదిగా షురూ అయితదిరా భయ్
నీ ఇజ్జత్ ని సుతరామూ సంపేసుకున్నప్పుడు
ఇంకెవని సాయమూ నీకొద్దని గిరిగీసుకున్నప్పుడు
నీ సచ్చుడు నింపాదిగా మొదలయితది.
నీ అలవాట్లకు నువ్వే బానిసగానివయినప్పుడు
గవ్వే దారుల్లా దినాం నడుస్తాన్నప్పుడు
నిన్నట్లానే ఎప్పుడూ బతుకుతాన్నపుడు
కొత్తరంగులసలే వేయనప్పుడు
ఎరుగనోళ్ళతో ముచ్చట్లేమీ పెట్టలేనపుడు.
నీ సచ్చుడు నిదానంగా జరుగుతున్నట్లేరా
ఎప్పుడైతే ఇష్టాల్లోంచి తప్పించుకునుడు షురూ జేస్తవో
ఊపేసే ఉద్వేగాలను కండ్లను మెరిపించే మదిని మురిపించే వాటినుంచి తప్పుంచుకుంటాటవో
నీ సచ్చుడు నిజంగా నిదానంగా మొదలయినట్లే
నీ నౌకరీనో దోస్తానానో నచ్చకున్నా జీవితాన్ని మార్చకుండా గట్లనే వుంటవో
తలబయటపెడితే ఏమయిదో అనుకుంటా నత్తగుల్లలా ఎచ్చగా దాక్కుంటవో
ఏ కలవెంట పరిగెత్తే పనేం లేకుండా రికాం గుంటవో
నీకు నువ్వే ఎప్పటికీ నచ్చకుండుంటవో
జీవితంలో ఒక్కసారయినా
తెలివైన సలహాలనుంచి పారిపోకుండుంటవో
గంతెనే మరి.
22-10-2024
సునోలో ఈ కవిత సునోజీ
https://suno.com/song/2bf330d9-092a-4818-8f97-baf9eafbd2a8
మీరు సునో వాడాలంటే
https://suno.com/invite/@irresistiblereview3721