Subramanyam Dogiparthi …………………………………… Megastar’s first step
చిరంజీవి నటించిన మొదటి సినిమా. 1979 లో వచ్చిన ఈ ‘పునాదిరాళ్ళు’ సినిమా చిరంజీవి నట జీవితానికి అద్భుతమైన పునాదిని వేసింది. పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ ఆడియన్సుకు ఎలా ప్రెజెంట్ చేసారు అనేదాన్నిబట్టి ఉంటుంది. ఆడియన్స్ కి పట్టేలా ఈ సినిమాను ప్రెజెంట్ చేసారు.
టైటిల్సులోనే నిర్మాతలు సినిమా ఉద్దేశం చెప్పేసారు. యువతే పునాదిరాళ్ళు అని. యాదృచ్చికంగా చిరంజీవి మొదటి మూడు సినిమాలు ఇలాంటి కధాంశంతోనే వచ్చాయి.మన ఊరి పాండవులు, ప్రాణం ఖరీదు ఈ కోవకు చెందినవే .
చిరంజీవి నలుగురు మిత్రులలో ఒకడిగా నటించినా తన ప్రతిభను చక్కగా ప్రదర్శించుకున్నాడు. ముఖ్యంగా ‘ఏ పల్లె ఏ వాడ’ అనే పాటలో చీరె కట్టుకుని కులుకు డాన్స్ వేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సాఫ్ట్ విలనీలో గోకిన రామారావు గొప్ప నటనను ప్రదర్శించాడు .ఇలాంటి పాత్రలు అతనికీ కొట్టిన పిండే.
ఇతర పాత్రల్లో నరసింహరాజు, కె వి చలం, కవిత, రోజారమణి, మహానటి సావిత్రి, జయమాలినిలు నటించారు . ఈ సినిమాకు హీరో నరసింహరాజే . హీరోయిన్ రోజారమణే అని చెప్పాలి . బాలనటిగా కానివ్వండి యువతిగా కానివ్వండి ఈ సినిమా తనకు వందో సినిమా అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు .
ఈ సినిమాకు దర్శకుడు , మొదట సోలో నిర్మాత గూడపాటి రాజకుమార్. మొదట బ్లాక్&వైట్లో కొంత తీసిన తర్వాత కలర్లో తీయాలనే ఆలోచనతో ఫజలుల్లా హక్ అనే ఔత్సాహకుడిని కలుపు కున్నారు.నిర్మాతగా టైటిల్సులో ఈయన పేరే ఉంటుంది. ఆయనతో పాటు మరి కొందరు ఆయన స్నేహితులు భాగస్తులు లాగా ఉన్నారు.చాలా ముస్లిం పేర్లు టైటిల్సులో పడతాయి.
ఈ సినిమాకు కధ , మాటలు ధర్మవిజయ పిక్చర్స్ అందించారు. సంగీతం ప్రేంజీ సమకూర్చారు. పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి. బయట కూడా బాగానే పాపులర్ అయ్యాయి. ‘చిరు చిరు నవ్వుల చిలకల్లారా’ అనే పాట పిల్లల మీద తీసింది.. చాలా బాగుంటుంది. అలాగే ‘భారతదేశపు భావి పౌరులం’ అనే పాట నరసింహరాజు , చిరంజీవి , వారి మిత్రుల మీద ఉంటుంది. బాగా చిత్రీకరించారు కూడా.
‘కంచె చేను మేయునాడు కాచువాడు ఎవడురా’ అనే విషాదగీతం బాగుంటుంది . పాటల్ని జాలాది , గూడపాటి రాజకుమార్లే వ్రాసారు . పి యస్ నివాస్ ఫొటోగ్రాఫీ దర్శకుడు . ఈ సినిమాలో నటనకు గోకిన రామారావుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది .
అలాగే సినిమాకు కూడా కాంస్య నంది వచ్చింది.మొత్తం మీద చిరంజీవికి గట్టి పునాది వేసిన ఈ పునాదిరాళ్ళు సినిమా చూడవలసిన సినిమాయే. యూట్యూబులో ఉంది. వీడియో క్వాలిటీ బాగాలేదు . చిరంజీవి అభిమాన సంఘాలు మెగాస్టార్ మొదటి సినిమా వీడియోని క్వాలిటీగా ఉండేదాన్ని యూట్యూబులోకి ఎక్కించుకోకపోతే ఎలా ! మీ తర్వాత తరం అభిమానులు చిరంజీవి మొదటి సినిమాను క్వాలిటీగా చూడాలి కదా అభిమానులూ ! ఆ పని చేస్తే బాగుంటుంది.