ఈయన మరో అమర శిల్పి జక్కన్న !

Sharing is Caring...

పై ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖుని పేరు S.M.గణపతి స్థపతి.ఈ అమర శిల్పి గురించి ఈ తరం వారిలో  చాలామందికి తెల్సి ఉండక పోవచ్చు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న కళాకారుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్ ‌లోని బుద్ధవిగ్రహన్ని రూపొందించింది ఈ ప్రముఖుడే. కఠిన శిలలను సైతం ఆకర్షణీయమైన రూప లావణ్యంతో అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో గణపతి స్థపతికి తిరుగులేదు.  

తిరుపతిలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటు గరుడ వాహనం తదితర నిర్మాణాలు, భద్రాచలం, సింహాచలం, శ్రీశైలంలోని దేవాలయాల గోపురాలు, హైదరాబాద్‌ ట్యాంక్ ‌బండ్‌పై తెలుగు ప్రముఖుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహం, స్కందగిరిలోని ఆంజనేయ స్వామి విగ్రహాలను గణపతి స్థపతి తీర్చిదిద్దారు.

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని దేవతామూర్తులను గణపతి స్థపతి స్వయంగా చెక్కి పంపించారు. విశాఖపట్నం లోని రామకృష్ణ మఠం, విశాఖ శ్రీ శారదాపీఠం నిర్మాణాలు గణపతి స్థపతి చేతుల మీదుగా రూపుదిద్దు కున్నాయి. కన్యాకుమారిలోని 133 అడుగుల తిరువళ్ళూరి విగ్రహాన్ని కూడా గణపతి స్థపతి తీర్చిదిద్దారు.

ఐదువేలకు పైగా హిందూ సంప్రదాయ నిర్మాణాలు ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో సమీపంలోని 102 గ్రామాలు నీటి ముంపుకు గురికాగా ఆయా గ్రామాలలోని దేవాలయాలన్నీ చెల్లాచెదురయ్యాయి. అప్పట్లో వాటిలో మిగిలిన చిన్నపాటి శిలల ఆధారంగా మళ్ళీ దేవాలయాలు, విగ్రహాలను నిర్మించిన ఘనత గణపతి స్థపతికే చెందుతుంది.

ఆయనలోని శిల్పకళా నైపుణ్యాన్ని గుర్తించిన రాష్ట్రపతి ప్రత్యేక పురస్కారాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.1964లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న పాటూరి చంద్రమౌళి రాష్ట్రంలోని దేవాలయాలలో శిల్పాల నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా గణపతి స్థపతిని నియమించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయనకు ప్రత్యేక గౌరవం లభించింది.

ఎన్టీఆర్‌ నిర్మించే పౌరాణిక చిత్రాలలోని సెట్టింగ్‌లను గణపతి స్థపతి పర్యవేక్షించే వారు. ఇక అయన వ్యక్తిగత వివరాల్లోకి వెళితే తమిళ నాడులోని రామనాథపురం జిల్లా ఎల్విన్‌కోటయా  గ్రామంలో జన్మించిన గణపతి స్థపతి కంచి పీఠాధిపతి పరమాచార్య అనుగ్రహాన్ని పొందారు. సంప్రదాయ వాస్తుశిల్పి కుటుంబంలో జన్మించిన గణపతి స్థపతి తండ్రి, మేనమామల వద్ద శిల్పకళలో శిక్షణ పొందారు.

దేశ, విదేశాల్లో దాదాపు 600 హిందూ దేవాలయాల నిర్మాణ శిల్పిగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. ఆధునిక భారతీయ సమాజంలో హిందూ శిల్పకళా సంపదపై 1980లొ  పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడమే కాక, మద్రాస్‌ యూనివర్శిటీలో డిగ్రీ కోర్సుకు అనుబంధంగా శిల్ప కళా కోర్సును ప్రవేశపెట్టాలని అప్పటి పాలకులను ఒప్పించారు. వాస్తు శాస్త్రాన్ని కూడా ఇందులోమిళితం చేశారు. ప్రభుత్వ సేవల నుంచి వైదొలగిన తర్వాత గణపతి స్తపతి ‘వాస్తు వేదిక ట్రస్ట్‌’, ‘వాస్తు వేదిక రీసెర్చ్‌ పౌండేషన్‌’ ఏర్పాటు చేశారు.

గణపతి స్థపతి  2011 సెప్టెంబర్ ఆరున చెన్నైలో కన్నుమూశారు. అంతకుముందు రెండేళ్ళ కిందట మద్రాసు నుంచి కాంచీపురంకు వెళ్తూ ప్రమాదానికి గురికాగా మెదడు భాగం రెండుగా చిట్లిపోయింది. అప్పటి నుంచి ఆయన వైద్యసేవలు పొందుతూనే తన వారసులకు శిల్పకళకు సంబంధించిన అనేక కీలకాంశాలలో మెళకువలను నేర్పించారు.

ఆయనకు ఇద్దురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా కంచిపీఠంపై ఉన్న పరమభక్తితో కొడుకులిద్దరికీ జయేంద్ర, శంకరం అనే పేర్లు పెట్టుకున్నారు. అల్లుళ్ళను కూడా శిల్పకళారంగం నుంచే ఎంచుకుని ఈ కళ పట్ల తనకున్న చిత్తశుద్ధిని గణపతి స్థపతి చాటుకున్నారు.

——— KNM

Sharing is Caring...
Support Tharjani

Comments (2)

  1. పూదోట శౌరీ లు November 24, 2020
  2. సత్యనారాయణ November 24, 2020
error: Content is protected !!