Enjoy the beauty of nature
ప్రకృతి అందాలు చూస్తూ మైమరచిపోవడానికి .. కొత్త అనుభూతులు ఆస్వాదించడానికి ఊటీ కో, మరో చోటుకో వెళ్లనక్కర్లేదు .హైదరాబాద్ పక్కనే ఉన్న ‘అనంతగిరి’ కి వెళితే చాలు. హైదరాబాద్‌కు 75 కి.మీ. దూరంలో ఉన్న ఈ అనంతగిరి…ప్రకృతి అందాలకు నెలవు.
అక్కడికి వెళితే ఆ ప్రశాంత ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు. అనంతగిరి వెళ్లే మార్గంలో ప్రకృతి మనల్ని అడుగడుగునా పలకరిస్తుంది.. ఎత్తయిన గుట్టలు.. నెమళ్ళ విన్యాసాలు.. పరుగులు తీసే జింకలు.. పక్షుల కిలకిలరావాలు పర్యాటకులను ఆహ్లాద పరుస్తాయి.
ఈ కొండల్లో వెలసిన అనంతపద్మనాభస్వామి ఆలయం కి ఎంతో చరిత్ర ఉంది. స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో “మార్కండేయ” ఋషి నిర్మించాడని చెబుతారు. ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.. వికారాబాద్ కి దగ్గర్లోనే ఈ ఆలయం ఉంది.
వికారాబాద్ ప్రాంతం చల్లని ప్రదేశం. కొండలు, కోనలు, దట్టమైన అటవీప్రాంతం .. లోయలు, చిన్న జలపాతాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. నిజాం నవాబులు ఈ ప్రాంతాన్ని విశ్రాంతి కేంద్రంగా ఉపయోగించుకునే వారు. తప్పక చూడాల్సిన క్షేత్రం ఇది.
పర్యాటకులు ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని కూడా దర్శించవచ్చు. శ్రీరాముడు రావణ సంహారం అనంతరం ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. శివలింగాన్ని అభిషేకించేందుకు శ్రీరాముడు బాణం సంధించి పాతాళగంగను పైకి రప్పించాడని అంటారు.
గంగ బుడగ రూపంలో రావడంతో బుగ్గ రామలింగేశ్వరుడు అన్న పేరు వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఆలయంలోని నంది నోట్లో నుంచి నిరంతరం నీటి ధార వస్తూ ఉంటుంది. చిన్న పుష్కరిణి కూడా ఉంది. పర్యాటకులను ఆకట్టుకునే ఆలయమిది.
ఈ అనంతగిరి కొండలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటేపల్లి రిజర్వాయర్ కూడా చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ బోటు షికారు చేయవచ్చు. ఒకప్పటితో పోలిస్తే ఇపుడు పర్యాటకుల సంఖ్య పెరిగింది. సదుపాయాలు కొంతవరకు మెరుగు పడ్డాయి. ఈ కొండల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. నైట్ క్యాంపింగ్ సదుపాయాలు ఉన్నాయి.
ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఆ మొక్కల మీదుగా వీచే గాలిని పీలిస్తే కొత్త అనుభూతి కలుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇక్కడ పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పించే పనిలో టూరిజం శాఖ నిమగ్నమైంది. అనంతగిరి చేరుకోవడానికి వికారాబాద్ వరకు రైలులో వెళ్ళవచ్చు.
అక్కడ నుంచి టాక్సీ లేదా ఆటోలలో అనంతగిరి కొండకు వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే బస్ లో అనంతగిరి వరకు వెళ్ళవచ్చు. తెలంగాణ టూరిజం వారు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ వారు కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.