అచ్చెరువున ‘ఆ చెరువున’ విచ్చిన కన్నుల చూడ …

Sharing is Caring...

Sheik Sadiq Ali ………………….  A symbol of Kakatiya technology

వరంగల్ నగరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ములుగు దాటాక జంగాలపల్లి వస్తుంది.అక్కడి నుంచి కుడి వైపు సిమెంట్ రోడ్డులోకి తిరిగి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొత్తూరు గ్రామం వస్తుంది.అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అడవిలోకి ఏటవాలుగా ప్రయాణిస్తే దేవునిగుట్ట చేరుకోవచ్చు.

ఈ మార్గంలో దాదాపు కిలోమీటర్ దూరం వాగులాంటి జలధార లో నుంచే ప్రయాణించాలి. ఆ గుట్ట పైకి వెళ్ళాక వందల ఎకరాల సమతల ప్రదేశం కన్పిస్తుంది.అందులో ఒకానొక చోట ప్రాచీన గుడి,దాని వెనుక కొద్ది దూరంలో ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు అందరిని  ఆకట్టుకుంటుంది. 

విశాలమైన ఆ చెరువుకు మూడువైపులా కొండలు,ఒకవైపు కొండరాళ్ళతో కట్ట,దానిమీద మట్టి కప్పి ఉంటుంది.మేము వెళ్ళేటప్పటికి కొండల మీద కురిసిన వర్షంతో చెరువు నిండి ఉంది.గత నాలుగు రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయట. చెరువు మధ్యలో నేరేడు చెట్ల వనం వందలాది చెట్లతో నిండి ఉంది.మాకు దారి చూపించిన గ్రామ ప్రముఖుడు రవీందర్ రావు ఆ చెరువు గురించి ఒక విశేషం చెప్పారు.

కొండల మధ్య అన్ని నీళ్ళతో ఉన్న చెరువు సాధారణంగా ఎండి పోదు.కానీ వర్షాలు 15 రోజులు కురవకపోతే చెరువు మొత్తం ఎండిపోతుంది.చుక్క నీళ్ళు ఉండవు అని రవీందర్ చెప్పాడు.ఆ నీళ్ళు ఎమైపోతాయో ఎలా ఇంకిపోతాయో తెలియదు అదే మాకు అర్ధం కావటం లేదు అని చెప్పాడు.అప్పుడు మాకు మేము నడిచి వచ్చిన జలధార గుర్తుకు వచ్చింది.

వాస్తవానికి ఆ ధార కొండల పైనుంచి కాకుండా రెండు అతి పెద్ద బండల కింది నుంచి రావటం గమనించాం.ఆ రెండు రాళ్ళు చెరువుకు వ్యతిరేక దిశలో ,చెరువు కట్టకు 50 అడుగుల కింద ఉన్నాయి. చెరువుకు,రాళ్ళకు,ఆ నీళ్ళకు సంబంధం ఏమైనా ఉందా ?అనే అనుమానం మాకు వచ్చింది.దాంతో మా బృందంలోని నలుగురు,ఇద్దరు గ్రామస్తులు కలిసి చెరువు కట్టకు రెండువైపులా పరిశోధించాం.

ఒక చోట చెరువు లోపలి వైపు చిన్న సొరంగం కన్పించింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న ఒక కట్టెను ఆ సొరంగంలోకి దూర్చాం.కర్ర మొత్తం లోపలికి పోయినా అడుగు తగల లేదు. దాంతో సొరంగం పైన వున్నా కొన్ని రాళ్ళను తొలగించి చూశాం.లోతెంతో తెలియలేదు కానీ,లోపల నీళ్ళు ప్రవహిస్తున్న శబ్దం మాత్రం విన్పించింది.

అక్కడి నుంచి పైకి వెళ్లి కట్టకు అవతలి వైపున చూడగా ఆ రెండు బండరాళ్ళు ,వాటి కింద నుంచి జలధార కన్పించాయి. ఆ ధార అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి లక్నవరం చెరువులో కలిసిపోతుంది అని స్థానికులు చెప్పారు.దాంతో మాకు విషయం మొత్తం అర్ధం అయ్యింది.

కొండల్లో కురిసిన నీరు ముందుగా జలాశయంలోకి చేరుతాయి. అందులోని నీరు లక్నవరం చేరటానికి వీలుగా చెరువు లోపలి భాగం నుంచి ఒక నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు. దానిమీద మళ్ళీ బండ రాళ్ళు,మట్టీ కప్పారు.వాటి మీద చెట్లు మొలిచి మళ్ళీ సహజమైన అడవిలా మారింది.

ఈ లక్నవరం చెరువు గణపతి దేవుడి సోదరి అయిన లక్కమాంబ పేరుమీద 1230-1240 సంవత్సరాల మధ్యకాలంలో స్వయంగా గణపతి దేవుడు త్రవ్వించాడు అని చెబుతారు.  ఈ లెక్కన ఈ నీటి సరఫరా వ్యవస్థను ఎన్ని వందల సంవత్సరాల క్రితం రూపొందించారో అర్ధం చేసుకోవచ్చు. కాకతీయుల ముందు చూపు,సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనా వేయ వచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!