బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది?

Sharing is Caring...

The chair was shaken ……………….

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌ లో తీవ్ర ఉద్రికత్తలకు కారణమైంది. దేశాన్ని అగ్ని గుండంలా మార్చేసింది. పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలతో పరిస్థితి చేజారింది. సైన్యం రంగంలోకి  దిగి పరిస్థితులను అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ రక్షణ కోసం భారత దేశానికి  రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే  తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడనుంది . ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. 

దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లో ప్రస్తుతం తలదాచుకున్న షేక్ హసీనా భారత్ నుంచి యూకేకి వెళ్లాలనుకుంటున్నారు. హసీనా సోదరి రెహానా బ్రిటన్‌లో ఉన్నారు.ఆమె కూతురు తులిప్‌ ప్రస్తుతం లేబర్‌ పార్టీ ఎంపీగా ఉన్నారు.

బ్రిటన్‌లో లేబర్‌ పార్టీనే అధికారంలో ఉండటంతో తులిప్ హసీనా కు ఆశ్రయం కల్పించమని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ బ్రిటన్ ఆశ్రయం ఇవ్వడానికి  సుముఖత చూపకపోతే  మరో దేశానికి వెళ్లాలని హసీనా భావిస్తున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రహమాన్ ప్రధానిగా ఉన్నపుడు  ఫ్రీడమ్ ఫైటర్స్ కోసం రిజర్వేషన్ కోటాను ప్రవేశ పెట్టారు. అయితే  సంవత్సరాలు గడిచేకొద్దీ, కోటా ను పొందగల సమరయోధుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఫ్రీడమ్ ఫైటర్స్ మరణానంతరం పిల్లలకు, ఆ తర్వాత మనవళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. దీంతో కోటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ విధానంపై వ్యతి రేకత వచ్చింది. ప్రత్యేకించి హసీనా అవామీ లీగ్‌కు చెందిన పార్టీ సభ్యులకు కోటాను పొడిగించడం యువతలో అసంతృప్తికి బీజాలు వేసాయి. 2018లో బంగ్లాదేశ్ హైకోర్టు 1970ల నుండి దేశంలో ఉన్న కోటా వ్యవస్థ చట్టబద్ధతను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బంగ్లా విముక్తి పోరాట యోధుల వారసుల కోటాను కొనసాగిస్తానని హసీనా ప్రకటించారు.

హసీనా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి పూనుకున్నారు. ఆమె వ్యవహార శైలి విద్యార్థుల్లో పెద్ద ఆందోళనకు దారితీసింది. అప్పటినుంచి ఆమె పై వ్యతిరేకత బాగా పెరిగింది  ఆ తర్వాత విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వం కోటాను నిలిపివేసింది..అయితే గత నెలలో హైకోర్టు తీర్పు ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. మళ్ళీ గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలోనే 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా కేటాయించాలని , ఐదు శాతం యుద్ధంలో పనిచేసిన యోధులకు కేటాయించాలని జులై 21న సుప్రీంకోర్టు ఆదేశించింది. మిగిలిన రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులకు రిజర్వ్ చేయాలని సూచించింది.

ఉద్యమకారులతో చర్చించి పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ హసీనా సర్కార్ అలా ఆలోచన చేయలేదు. రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా విద్యార్థులు తగ్గలేదు.షేక్ హసీనా రాజీనామా చేసి తీరాలనే  డిమాండ్‌తో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.

ఈ ఆందోళన వెనుక జమాతే ఇస్లామీ ఉంది. ఆ పార్టీ వెనుక పాకిస్తాన్ .. చైనా ఉన్నాయనే కథనాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. మొత్తం మీద హసీనా మొండి వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలున్నాయి. ప్రధాని పీఠాన్ని విద్యార్థి లోకం కదిలించింది అని చెప్పుకోవాలి 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!