Bharadwaja Rangavajhala ………… No one else will be born like him
సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం …తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ బైటకి ఇంకోటీ రకం కాదు.తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు.ఆయనతో ఏం చెప్పాలన్నా …చాలా జాగ్రత్తగా ఎలా చెప్తే వింటారో అలానే చెప్పి కన్విన్స్ చేసేవారు ఇండస్ట్రీ పెద్దలు.
భక్త ప్రహ్లాద లో క్లైమాక్స్ రీషూట్ చేయాలనుకున్నప్పుడు …నిర్మాతలు డి.వి.నరసరాజుగారిని ప్రయోగించారు. నిన్న రాత్రి ప్రివ్యూ చూశానండీ …ఎందుకో ఆ క్లైమాక్స్ కాస్త డల్ అయినట్టనిపించింది. నా ఉద్దేశ్యమైతే మీరు రీషూట్ చేయమని డిమాండ్ చేయండి …ఎందుకంటే రేపు మంచి పేరొచ్చినా చెడ్డ పేరొచ్చినా మీకేగా అనడంతో ఎస్వీఆర్ కన్విన్స్ అయిపోయి రీషూట్ చేయమని ఆదేశించి మరీ నటించి మెప్పించారు.
అలాంటిదే ఇంకో సంఘటన …1967 లో ఎస్వీఆర్ స్వీయ దర్శకత్వంలో చదరంగం అనే చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడుగా ఎస్వీఆర్ మీద బిఎన్ ప్రభావం ఉండేది. ఆయన తీసిన సినిమాలు రెండు మూడూ కూడా ఆ ధోరణిలో నడిచేవే … ఉదాత్తమైన కథలతోనే సినిమాలు తీశారాయన.చదరంగం, బాంధవ్యాలు కాస్త అతి అనిపించినా … సినిమా అనేది జనాలకు ఏదో చెప్పాలనే తపన ఉండేదాయనకి.
చదరంగం సినిమాకి క్రిటిక్స్ నుంచీ మంచి రెస్పాన్సే వచ్చింది. ఆడియన్స్ నుంచీ కూడా పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి. ఓ మంచి సినిమా తీశాననే తృప్తి ఆయనకి మిగిలింది. అయితే . ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా చదరంగమే అవార్డు గెలుస్తుందని ఎస్వీఆర్ బలంగా అనుకున్నారు.
తీరా పురస్కారాల ప్రకటన వెలుడింది …ఉత్తమ చిత్రంగా సుడిగుండాలు అనే సరికి ఎస్వీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. ధిక్ అన్నాడాయన.ఇదంతా రాజకీయం … ఆ నాగేశ్వర్రావు తెల్లారి లేస్తే కాంగ్రెస్ మంత్రులతోనూ ముఖ్యమంత్రితోనూ తిరుగుతూంటాడు …అందుకే ఎపి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ఎవరికివ్వాలో తనే డిసైడ్ చేసేస్తున్నాడు …అలా రాజకీయం చేసి నా సినిమాకు రావాల్సిన అవార్డును తన సినిమాకు వేయించుకున్నాడు ..అని బహిరంగంగానే వ్యాఖ్యానించడం ప్రారంభించారాయన.. ఎస్వీఆర్ కామెంట్స్ ఆ నోటా ఈనోటా దర్శకుడు ఆదుర్తికి చేరాయి.
ఆయన వెంటనే ఎస్వీఆర్ ను కల్సి …ఒక్క సారి సుడిగుండాలు సినిమా చూడు … ఆ తర్వాత మాట్లాడదాం అనడంతో సరే అన్నారు ఎస్వీఆర్ …సినిమా వేశారు. ఆయన చూశారు … బైటకు వచ్చారు .. సారీ బ్రదర్ … బాగా తీశారు. నా సినిమా కన్నా కూడా ఇదే బాగుంది. అవార్డు విషయంలో ప్రభుత్వం సవ్యంగానే ఆలోచించింది … నేను చేసిన కామెంట్స్ కు సారీ అన్జెప్పి ఆదుర్తిని కౌగలించుకుని వెళ్లిపోయారట.