A woman leader with a bright future………..
ప్రణితి షిండే… 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లోని షోలాపూర్ నియోజకవర్గం నుంచి 74,197 ఓట్ల మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ నేత . ఈ ప్రణితి ఎవరో కాదు … మహారాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూతురే. షిండే ఉమ్మడి ఏపీ గవర్నర్ గా కూడా చేశారు. ప్రణితి తండ్రి నుంచి రాజకీయాన్ని వారసత్వంగా పుచ్చుకుంది.
షోలాపూర్ లో సుశీల్‌కుమార్ షిండే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీ జై సిద్ధేశ్వర స్వామి కి బదులుగా బీజేపీ రామ్ సత్పుతేను 2024 ఎన్నికల బరిలోకి దించింది. షోలాపూర్ లో హోరాహోరీ పోరు జరిగింది. ఎన్నికలకు ముందు షిండేను,ప్రణితి ని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలే చేశారు.
సుశీల్‌కుమార్ షిండే ఈ విషయం బహిరంగంగానే చెప్పారు. ”కాంగ్రెస్ సంస్కృతిలో పుట్టి పెరిగా. సెక్యులర్ భావజాలాన్ని వదులుకొని ఇంకో పార్టీ లోకి వెళ్లలేను” అని ప్రణితి కూడా స్పష్టం చేశారు. షోలాపూర్‌లో తెలుగు వారితో పాటు ముస్లిం ఓట్లు కూడా బాగా ఉన్నాయి. అక్కడ ప్రణితి కాంగ్రెస్ జెండా ఎగరేసి విజయ పరంపరకు శ్రీకారం చుట్టారు.
పొలిటికల్ ఎంట్రీకి వారసత్వం పనికొచ్చినా .. ఒక మహిళగా రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, తండ్రి పేరు నిలబెట్టడానికి ప్రణితి చాలా కష్టపడ్డారు. లోకసభ కు వెళ్లేముందు ప్రణితి షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు.
2021 నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. షోలాపూర్‌లో బీడీ, పవర్‌లూమ్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ పనిచేసే కార్మికుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువ.. వారితో తెలుగులో మాట్లాడుతూ.. . వారి సమస్యలు తెలుసుకుంటూ.. వారి హృదయాల్లో స్థానం సంపాదించారు.
ప్రణితి తిరుగులేని రాజకీయ నాయకురాలవుతుందని తండ్రి కూడా ఊహించలేదు. లా పూర్తయ్యాక ఆమె ‘జై జుయ్’ అనే స్వచ్ఛంద సంస్థ ను నడిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు..షోలాపూర్‌లో మహిళలు, యువతతో కలిసి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. స్వయం సహాయక బృందాలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకి కృషి చేశారు
ప్రణితి 2008లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటిసారిగా 2009 ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ప్రణితి కి సభల్లో మాట్లాడం కంటే నేరుగా ప్రజలను కలవడం ఇష్టం. ప్రజలను నేరుగా కలుస్తూ వారికి బాగా దగ్గరయ్యారు. విజయం సాధించారు.
అప్పుడామెకు కేవలం 28 ఏళ్లు. నాటి అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.
ప్రణితి రాజకీయాల్లో తనకు ఇందిరాగాంధే ప్రేరణ అంటారు. భర్తను పోగొట్టుకుని .. బాధను దిగమింగి .. మొండి ధైర్యంతో నిలిచిన సోనియా కూడా స్ఫూర్తేనంటారు.
ఆ మధ్య రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో తళుక్కున మెరిసిన ప్రణితిని చూసి ఈ అందమైన అమ్మాయి ఎవరా? అని చాలామంది ఆరా తీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జుక్కల్ నియోకవర్గానికి పరిశీలకురాలిగా వ్యవహరించారు.