Voters don’t like his style?……………………….
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలోని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. 24 ఏళ్ళు సీఎం గా పని చేసిన ఆ పార్టీ అధినేత పవన్ చామ్లింగ్ మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. నామ్‌చేబంగ్ స్థానంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) అభ్యర్థి రాజు బస్నెట్‌పై 2,256 ఓట్ల తేడాతో … పోక్‌లోక్ కమ్రాంగ్ నియోజకవర్గంలో SKM అభ్యర్థి భోజ్ రాజ్ రాయ్ చేతిలో 3,063 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తం మీద ఒకే ఒక స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు.
అత్యంత సుదీర్ఘకాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన నేతగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ చరిత్ర సృష్టించారు. చామ్లింగ్ సిక్కిం రాష్ట్రాన్ని 24 సంవత్సరాల 165 రోజులు పాలించి రికార్డు సృష్టించారు. (పదవీకాలం 12 డిసెంబర్ 1994 – 26 మే 2019). ఆతర్వాత కమ్యూనిష్టు కురువృద్ధుడు జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు పశ్చిమ బెంగాల్ ను పాలించారు.
జ్యోతిబసు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా 1977 జూన్ 21నుంచి 2000 నవంబర్ 6 వరకు ఉన్నారు. పవన్ చామ్లింగ్ 1993లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట ప్రత్యేకపార్టీ స్థాపించారు. స్వల్ప కాలంలోనే 1994 డిసెంబరు 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1973లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. 1985లో తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అంతకుముందు చామ్లింగ్ 1982 లో యాంగాంగ్ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. దమ్‌తాంగ్ శాసన సభ నియోజకవర్గం నుండి రెండవసారి ఎన్నికైన తరువాత, నార్ బహదూర్ భండారి మంత్రివర్గంలో 1989 నుండి 1992 వరకు పరిశ్రమలు, సమాచార, ప్రజా సంబంధాల మంత్రిగా చేశారు. సిక్కింలో వరుస రాజకీయ తిరుగుబాట్ల తరువాత చామ్లింగ్ 1993 మార్చి 4 న సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు తరువాత వరుసగా ఐదు పర్యాయాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా చామ్లింగ్ దేశంలో రెండవ వాడు. అతని పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1994, 1999, 2004, 2009, 2014 సిక్కిం శాసనసభ ఎన్నికలలో విజయం సాధించింది.
1994 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత చామ్లింగ్ పార్టీ సిక్కింలో మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి పనులు జోరుగా చేపట్టడం . వాగ్దానాలు అమలు చేయడం … శాంతి పరిరక్షణ వంటి కార్యక్రమాల వల్ల సిక్కింలో చామ్లింగ్ ఆదరణ పెరుగుతూ వచ్చింది. 2009 లో సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలను అతని పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుచుకుంది. అది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.
2009 లో పార్టీ నాయకుడు ప్రేమసింగ్ తమంగ్ కి చామ్లింగ్ కి తేడాలొచ్చాయి. పార్టీ లో అసమ్మతి ఎమ్మెల్యేగా ప్రేమసింగ్ వ్యవహరించారు.2013 లో సిక్కిం క్రాంతి కారి మోర్చాపేరిట పార్టీని స్థాపించారు. అవినీతి ఆరోపణల మీద ప్రేమసింగ్ కు కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. 2018 ఆగస్టులోనే ఆయన జైలు నుంచి విడుదలై తన పార్టీ ని జనంలోకి తీసుకెళ్లారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించాడు.
అపుడే ఆయనకు ఎన్నికలకమీషన్ 6 ఏళ్ళ వరకు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆయన సీఎం అయ్యాడు. మిగిలిన 15 సీట్లను ఎస్‌డిఎఫ్ పార్టీ గెలిచినప్పటికీ 2019 ఆగస్టులో భారతీయ జనతా పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు.
అదే నెలలో మిగిలిన శాసనసభ్యులు సిక్కిం క్రాంతికారి మోర్చాలో చేరిపోయారు. చివరికి చామ్లింగ్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా మిగిలి పోయారు. ఫిరాయింపు రాజకీయాల కారణంగా పాతికేళ్ళు సీఎం గా చేసి కూడా పార్టీ ని కాపాడుకోలేక పోయారు.. ఇక తాజా ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసారు..
——KNMURTHY