Who told NTR to wear a saffron dress?………………………………….
మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీరామారావు ఏది చేసినా ఒక సంచలనమే.ఆయన నాటకాలు, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ఎపుడూ అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా వ్యవహరించేవారు. అలాగే కొన్నివిషయాలను గోప్యంగా ఉంచి నాటకీయంగా,ఆకస్మికంగా ప్రకటించేవారు.అందులో ఎన్టీఆర్ ను మించినవారు ఎవరూలేరు.
తిరుపతిలో జరిగిన ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధరించి హాజరయ్యి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎన్టీఆర్ ను ఆ గెటప్ లో చూసి నిర్వాహకులు … అభిమానులు సంభ్రమానికి గురయ్యారు. పార్టీనేతలు,కార్యకర్తలు ఇదేమిటి అని అడగాలనుకున్నారు కానీ ధైర్యం చేయలేకపోయారు.కార్యక్రమం ముగిశాక ప్రింట్ మీడియా విలేకర్లు ఆయన వెంటబడ్డారు. ప్రశ్నల వర్షం కురిపించారు.అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా లేదు కాబట్టి లైవ్ ప్రసారాలు లేవు.
విలేకరుల ప్రశ్నలకు స్పందించిన ఎన్టీఆర్ జవాబు చెబుతూ కాషాయానికి మారడాన్ని సన్యసించడంగా అభివర్ణించారు. ప్రాపంచిక సుఖాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని … అందుకే ఈ కొత్త వేషధారణ అని స్పష్టం చేశారు. ముక్కుపచ్చలారని బాలికను దారుణంగా చెరిచిన సంఘటన తన మనసును కలచి వేసిందని … జీవితం పట్ల విరక్తి పుట్టిందని ఎన్టీఆర్ అన్నారు.
అధికారంలో ఉండగా సన్యసించడం ఎలా కుదురుతుందని ఒక విలేకరి ప్రశ్నించగా ఎన్టీఆర్ తనను తాను రాజయోగిగా వర్ణించుకున్నారు. తెల్లవారేసరికి ఎన్టీఆర్ కాషాయ దుస్తుల విషయం దేశమంతా తెలిసిపోయింది. అదొక సంచలన వార్తగా మారింది. ఎన్టీఆర్ కొత్త వేషధారణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విమర్శకులు … కాంగ్రెస్ నేతలు అవహేళన చేసారు. అయినా ఎన్టీఆర్ లెక్కచేయలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ మాంసాహారం మానేశారు. గండిపేటలో కుటీరం నిర్మించారు. కొంతకాలం అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ తలపాగా చుట్టి వివేకానందుడి గెటప్ లో కనిపించేవారు. ఇవన్నీ చూసే ఎన్టీఆర్ ను కాంగ్రెస్ నేతలు డ్రామారావు అంటూ విమర్శించేవారు.
కాగా ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధరించడానికి స్ఫూర్తి స్వామి అగ్నివేశ్ అని అంటారు. మానవ హక్కుల ఉద్యమం లో భాగంగా స్వామి అగ్నివేశ్ ఒక సారి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ను కలిశారు. అపుడు సీఎం గా ఉన్న ఎన్టీఆర్ కాషాయ వస్త్రాల్లో ఉన్న అగ్నివేశ్ ను చూసి ఈ దుస్తుల ప్రత్యేకత ఏమిటి ? తమరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు అని స్వామిని అడిగేరు.
దానికి సమాధానంగా అగ్నివేశ్ ” సన్యాసిగా ఉంటే మనకు ఎలాంటి స్వార్ధం ఉండదు. మనం మనకోసం కాకుండా సమాజం కోసం పనిచేస్తాం. మీరు నిజాయితీగా పనిచేయాలంటే సన్యసించండి” అని చెప్పారట. ఈ మాటలు ఎన్టీఆర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. తర్వాత కొద్దీ రోజులకే ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధరించారు.
రాజయోగి నని ప్రకటించుకున్నారు.మూడో కంటికి తెలీకుండా దుస్తులు కుట్టించుకుని తిరుపతి వెళ్లి వాటిని ధరించి ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ దుస్తులు ప్రభావం నుంచి బయటపడి మామూలు దుస్తులు ధరించడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టింది.92 నాటికి మామూలు దుస్తుల్లోకి వచ్చేసారు.93 లో లక్ష్మి పార్వతి ని రెండో పెళ్లి చేసుకున్నారు.
———— KNM