Does that hill pull like a magnet?…………………….
అరుణాచలం …… ఆ పేరే ఒక మహా మాయ … ఒక మహా అద్భుతం.. ఇక్కడికి వచ్చినవారిని ఆ కొండ అయస్కాంత శక్తి లాగా లాగేస్తుంది.. బలంగా ఆకర్షిస్తుంది .. అక్కడే ఉంటే చాలు .. ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తుంది.మనసు అరుణాచలశివ అంటూ ధ్యానం చేస్తుంటుంది, ఆ గిరి 260 కోట్ల సంవత్సరాలుగా ఉందని పురావాస్తు శాఖ వారు ఎప్పుడో నిర్ధారించారు.
ఆ కొండ రూపంలో దక్షిణామూర్తి ఉంటారు. సాక్షాత్తు స్వామి.. అమ్మవారు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు.. అక్కడకి వెళ్లినవారిలో చాలామంది అక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి వెళ్లిపోతుంటారు.సమయం తెలియకుండా ఎంత సేపయినా అలా ధ్యానంలో ఉండిపోతుంటారు.. భవబంధాలు గుర్తుకు రావు, బాహ్యసృహ కూడా ఉండదు.
ఆ స్థలానికి ఉన్న శక్తి అలాంటిది. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు, మనస్సు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. అన్నీ మర్చిపోయి అరుణాచల శివ అనే మాయలోకి మునిగిపోతాము.. ఆ మాయ ఎప్పటికి వదలదు , మాయ అని ఎందుకు అనుకోవాలంటే అప్పటి వరకు గడిచిన జీవితాన్ని అక్కడ అడుగు పెట్టాక మర్చిపోతాము,
అరుణాచలంలో అడుగు పెట్టాక అక్కడి నుండి జీవితం కొత్తగా మొదలు అవుతుంది అదే మెదలు అదే చివర అనే ధ్యాసకు లోనవుతుంది మనసు, అంతే ఆ మాయలో జీవితకాలం మొత్తం కూడా గడిచి పోవచ్చు..ఈ మాట ఎంతో మంది భక్తులు చెబుతుంటారు.
ఎందరో నాస్తికులు కూడా కుతూహలంతో ఆ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఏదో మాయ ఒక మహా శక్తిలాగా మనసు లాగేస్తుందని.. కారణం తెలియని ఆనందాన్ని పొందుతామని చెప్పిన ఉదాహరణలున్నాయి. దేవుడికి దండం పెట్టని వారు కూడా దాసోహం అంటూ ఆ కొండ చుట్టూ తిరిగేస్తారు. ఆ స్వామి కరుణామయుడు నాస్తికులకే అంత అనుభూతి కలిగితే భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? అడుగడుగునా శివ దర్శనం.. నిదర్శనం గోచరిస్తుంది.
‘అరుణాచలం’ అనే పదానికి ఎవరి అవగాహనను బట్టి వారు పలు అర్ధాలను చెబుతారు.
అరుణాచలం అంటే ఆగమ ప్రధానులు అరుణాచలేశ్వర దేవాలయములో ప్రతిష్టించిన శివలింగం. పౌరాణికులకు,భక్తులకు అరుణాచల పర్వతం శివ స్వరూపం.
యోగులకు,జ్ఞానోపాసకులకు పరంజ్యోతి… దానికి అతీతం కూడా. నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి. భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీన మైన కొండ ఇలా ఎన్నో… ఎన్నెన్నో అర్ధాలు ప్రచారంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఇక భగవాన్ శ్రీ రమణ మహర్షి అనేక పర్యాయములు అరుణాచలం గురించి భక్తుల వద్ద ప్రస్తావించారు.అరుణాచలం సాక్షాత్తు కైలాసమే .. ఇక్కడి ప్రతి శిలా శివలింగమే. ఇక్కడ తీసుకొన్న ఆహారము, నీరు అమృతమే. ఈ క్షేత్రములో ఏమి మాట్లాడుకున్నా శివ స్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది శివ పూజయే.
గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే. గిరిచుట్టూ ఉన్న 24 మైళ్ళలోపు ఎక్కడ మరణించినా వారికి ముక్తి కలుగుతుంది. అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి కలుగుతుంది. దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రమో తెలుస్తున్నది. మిగిలిన అన్ని గిరులను ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించారు.
అరుణాచలాన్ని మాత్రం గిరి రూపంలో నున్న దేవుడే అంటారు. మనం దేహంతో తాదాత్మ్యం చెందినట్లే పరమ శివుడు ఈ కొండతో తాదాత్మ్యం చెందాడు. అందువల్ల ఈ కొండ పరమశివుడే. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనపడాలని శివుడు కొండ రూపం దాల్చాడు
ఎంతో మంది అక్కడి నుండి రాలేక.. అరుణగిరికి దూరంగా ఉండలేక, అక్కడే స్థిరపడిపోయారు.. ఒక మైనింగ్ వ్యాపారం చేసే ఆవిడ ౨౦యేళ్ళుగా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని .. అక్కడ నుండే తన వ్యాపార పనులు చేసుకుంటూ ప్రతి రోజూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.. ఇంకొకరు పన్నెండు సంవత్సరములుగా అక్కడే నివాసం ఉంటున్నారు.
ఇలా ఎందరో అక్కడ స్థిరపడ్డారు.. నిత్యం ఆ కొండను దర్శించి పునీతులవుతున్నారు, వారి లక్ష్యం ఒక్కటే.. బతికి ఉన్నంత కాలం అలా ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడే ప్రాణం వదిలి .. శివైక్యం చెందడమే .. విదేశీయులు సైతం అరుణాచలం వచ్చి స్వామి సన్నిధిలో ఉండిపోతున్నారు.
అరుణాచలశివ