ఆ మూలికలకు అంత డిమాండ్ ఉందా ?

Sharing is Caring...

Himalayan viagra 

ప్రస్తుతం వనమూలికలకు డిమాండ్  అంతా ఇంతా కాదు. విలువైన మూలికల కోసం ఎంతోమంది కొండల్లో ..కోనల్లో తిరుగుతుంటారు. అడవుల్లోకి  వెళ్లి గాలిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నోఆపదలు  ఎదుర్కొంటుంటారు. ఏవైనా విలువైన మూలికలు దొరికితే వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటారు. వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటారు.

కొందరైతే మూలికల బేహారులకు ఏజంట్లుగా కూడా పని చేస్తుంటారు. గాలింపులో భాగంగా దొరికిన మూలికలను బేహారులకు  విక్రయిస్తుంటారు. వారు వేరేవారికి ఎక్కువ సొమ్ముకు అమ్ముకుంటారు. కొండ ప్రాంతాల్లో నివసించేవారికి  మూలికల కోసం గాలించడం ఒక ఉపాధిగా మారింది.

ఇటీవల కాలంలో ‘లైంగిక సామర్థ్యం’ పెంచే మూలికలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో జనాలు ప్రాణాలకు తెగించి మరీ, ఆ తరహా మూలికల కోసం హిమాలయాల లోయల్లోకి  .. దిగువ ప్రాంతాలకు వెళుతుంటారు.  

ఈ మధ్య కాలంలో ‘హిమాలయన్ (Himalayan) వయాగ్రా’గా పిలిచే అత్యంత విలువైన మూలిక కోసం కొండప్రాంత వాసులు విపరీతంగా గాలిస్తున్నారు. ఇదో రకం శిలీంధ్రం. ఇది హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ మూలిక  ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తుందని అంటారు. అలాగే లైంగిక సామర్ధ్యాన్నిపెంచుతుందని నమ్ముతారు.

లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలో దీన్ని మించిన మూలిక మరొకటి లేదంటారు. ప్రస్తుతం  మార్కెట్‌లో దొరికే ‘వయాగ్రా’లేవీ దీని ముందు అసలు పనికిరావని అంటారు.  ఈ మూలిక ప్రకృతి ప్రసాదం.. సహజ సిద్ధమైనది. వెయ్యేళ్ల  నుంచి  దీన్ని లైంగిక పటుత్వ చికిత్సల్లో ఉపయోగిస్తున్నారని నిపుణులు కూడా చెబుతున్నారు. 

అందుకే దీనికి విపరీతమైన డిమాండ్. ఈమూలికలను ‘వయాగ్రా’ మందుల తయారీలో  ఉపయోగిస్తుంటారు. కొందరైతే  దీన్ని నేరుగా టీ, సూపుల్లో కలుపుకుని తాగుతారు. భారత్‌లో లభ్యమయ్యే మూలికలతో పోలిస్తే  నేపాలీ మూలికలకు  డిమాండ్ ఎక్కువ.

నేపాల్ ప్రభుత్వం 1995లో యార్సా గుంబు మూలికల సేకరణ,వాటి వ్యాపారంపై నిషేధం విధించింది. కానీ 2001లో యార్సా గుంబు సాగు ..అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఆ ప్రాంతాల్లో నివసించే వారు నెలల తరబడి మూలికల సేకరణలో ఉంటారు. సొంత భూములు ఉన్నవారు సాగు చేస్తున్నారు.

గిరిజనులు  కఠినమైన చలిగాలులు, మంచు తుఫాన్లను  ఎదుర్కొంటూ ఈ మూలికల  కోసం అన్వేషిస్తారు.కొన్ని కుటుంబాలు ఈ మూలికలపై  ఏటా రూ.5-6లక్షలు సంపాదిస్తున్నాయి.   అంతర్జాతీయ మార్కెట్లో దీన్ని విలువ కేజీకి 20 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. 

దీంతో ఈ మూలికల సేకరణ కోసం చాలా మంది హిమాలయాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో  అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ మూలిక కోసం చైనా సైనికులు  భారత భూ భాగంలోకి పదేపదే చొరబాట్లకు పాల్పడుతున్నారని  వార్తలు కూడా  ప్రచారం లో ఉన్నాయి..కొన్నాళ్ల క్రితం  నేపాల్ లో ఈ మూలికల అన్వేషణ కోసం వెళ్లిన వారు మంచు తుఫాన్ లో కొట్టుకుపోయారనే వార్తలు కూడా వచ్చాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!