A symbol of spirituality and architecture……..
అమెరికా లోని అతిపెద్ద దేవాలయం అక్షర ధామం.. ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం, కళలకు చిహ్నం గా నిలిచింది. న్యూజెర్సీలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి BAPS స్వామినారాయణ్ అక్షరధామ్.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి నారాయణకు ఈ ఆలయాన్ని అంకితం చేశారు. ఆలయ నిర్మాణం 2011లో ప్రారంభమైంది. న్యూజెర్సీ నడిబొడ్డున ఉన్న BAPS స్వామినారాయణ అక్షరధామ ఆలయం శాంతి, ఆధ్యాత్మిక చింతనకు స్వర్గధామం.
భక్తుల కోసం ఈ BAPS స్వామినారాయణ అక్షరధామ్ అక్టోబర్ 8న ప్రారంభమైంది. ఈ ఆలయం న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే నగరంలో ఉంది. BAPS స్వామినారాయణ సంస్థ , హిందూమతంలోని స్వామినారాయణ శాఖకు చెందినది. BAPS సంస్థ ఉత్తర అమెరికాలో వచ్చే సంవత్సరంలో 50వ వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. స్వామినారాయణ శాఖకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1,200 కంటే ఎక్కువ దేవాలయాలున్నాయి. ఎన్నో విద్యా కేంద్రాలను నిర్వహిస్తున్నది.
అక్షరధామ్ ఆలయ నిర్మాణం సహస్రాబ్దాలుగా విస్తరించి ఉన్న హిందూ సంప్రదాయానికి చిహ్నం. ఈ ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ప్రపంచం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులను, యాత్రికులను ఆకర్షిస్తోంది. వాస్తవానికి ‘అక్షరధామ్’ అనే పదానికి అర్ధం ఏమిటంటే.. ‘అక్షర్’ అంటే శాశ్వతం.. ‘ధామ్’ అంటే నివాసం.. ‘దేవుని నివాసం లేదా శాశ్వత నివాసం’ అనే రెండు పదాలకు అర్ధం చెబుతూ ఈ ఆలయం నిర్మితమైంది.
ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించిన తరువాత 11 అడుగుల ఎత్తైన స్వామినారాయణుని అందమైన చిత్రం చూడవచ్చు. ఈ ఆలయంలో అడుగు పెట్టిన పర్యాటకులు అడుగడుగునా ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారని భక్తులు అంటున్నారు. ఢిల్లీ, గుజరాత్ తర్వాత అమెరికా అక్షరధామ్ మూడో స్థానంలో ఉంది.ఈ ఆలయ నిర్మాణం 2011 లో ప్రారంభమైంది. ప్రపంచం నలుమూలల నుండి 12,500 మంది కార్మికులు నిర్మించారు. ఈ ఆలయం రాబిన్స్‌విల్లేలో 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.