The glory of time………………………..
కొందరికి టైమ్ అలా కలసి వస్తుంది. కొద్దీ రోజుల్లోనే ప్రముఖులుగా మారిపోతారు. ఒక వెలుగు వెలిగి అంతలోనే ఆరిపోతారు. ఆ కోవకు చెందిన వాడే ఈ చంద్ర స్వామి. వివాదాలే ఆయన ఇంటి పేరుగా మారిపోయాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త చంద్ర స్వామి ఒకప్పుడు పవర్ ఫుల్ స్వామి గా ఒక వెలుగు వెలిగారు.
మామూలు స్వాములకు ఈయనకు చాలా తేడావుంది . ఈయనది జాతీయ , అంతర్జాతీయ స్థాయి . ప్రధానమంత్రుల నుంచి పెద్ద పెద్ద ప్రముఖులవరకు ఈయన అపాయింట్మెంట్ కోసం వేచి చూసేవారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ , రాజీవ్ గాంధీ , పీవీ.నరసింహారావులకు చంద్ర స్వామి సన్నిహితంగా ఉండేవారు.
జ్యోతిష్య శాస్త్రం లో ఉద్దండ పండితుడని చంద్రస్వామికి పేరుంది. మాజీ బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ కి ఆమె ఛాంబర్ లో కూర్చుని జాతకం చెప్పారట. ఆయన చెప్పినవన్నీ జరగడంతో చంద్ర స్వామిపై ఆమెకు గురి కుదిరిందని అంటారు. ఇక ఢిల్లీ లో ఆయన కట్టుకున్న ఆశ్రమానికి భూమిని కేటాయించింది ఇందిగాంధీ యే అంటారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయన సలహాలు తీసుకున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు. బ్రూనై సుల్తాన్, బహరైన్ సుల్తాన్, నటి ఎలిజబెత్ టేలర్, మాఫియా డాన్ దావూద్ , ఆయుధాల వ్యాపారి అద్నాన్ ఖషోగి తదితరులు ఈ స్వామి వద్ద తీర్ధప్రసాదాలు స్వీకరించినవారే.
ఇంకా రాజకీయ నాయకులు సినిమా హీరోలు, నిర్మాతలు, వ్యాపారులు , నేరగాళ్లు కూడా చంద్ర స్వామి ని తరచుగా దర్శించేవారు. సలహాలు తీసుకునే వారు. ప్రభుత్వం లో పనుల కోసం ఆయనను సంప్రదించేవారు. చంద్ర స్వామి కరుణా కటాక్షాలు కోసం వేచి చూసే వారు. అంతర్జాతీయంగా పేరు మోసిన వారెందరికో మార్గ నిర్దేశనం చేసిన చంద్రస్వామి అదే రేంజిలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఆయన హవా నడిచింది. 1996 లో ఆర్ధిక సంబంధమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ఫోర్స్మెంట్ అధికారులను దీవిస్తాను రమ్మంటే వారు పట్టించుకోకుండా స్వామిని కోర్టుకీడ్చారు. దీంతో స్వామి 9 కోట్ల రూపాయల జరిమానా కట్టారు. సుప్రీం కోర్టు చంద్రస్వామికి పలుమార్లు జరిమానాలు విధించింది.
వీటన్నింటికంటే ఆశ్చర్యపోయే విషయం ఏమంటే మాజీ ప్రధాని రాజీవగాంధీ హత్యకేసులో చంద్రస్వామి ప్రమేయం ఉందని జైన్ కమీషన్ రిపోర్ట్ వెల్లడించడమే. ఇది కోర్టుల్లో నిరూపితం కాలేదు. కానీ చంద్రస్వామి ప్రమేయం రాజీవ్ హత్యలో ఉందని కాంగ్రెస్ వాదులు ఇప్పటికి నమ్ముతారు. 1991 లో పీవీ ప్రదాని అయ్యాక ఢిల్లీ కుతుబ్ ఇన్ స్టిట్యూట్ ఏరియాలో “విశ్వ ధర్మయతన్ సనాతన్ “పేరుతో చంద్రస్వామి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు.
పీవీకి ఆధ్యాత్మిక సలహా దారుడిగా వ్యవహరించారు. లండన్ కి చెందిన లఖు భాయి పాఠక్ అనే ఒక పచ్చళ్ళ వ్యాపారి వద్ద లక్ష డాలర్లు తీసుకుని మోసం చేసారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో స్వామిని అరెస్ట్ కూడా చేశారు.ఈ కేసులో పీవీ పై కూడా ఆరోపణలు వచ్చాయి.
అన్నివైపులనుంచి ఒత్తిడి రావడంతో చంద్రస్వామి అరెస్ట్ కి పీవీ ఆదేశాలు ఇచ్చారని చెబుతారు. చంద్రస్వామి మూలంగా పీవీ కూడా ఇబ్బందులు పడ్డారు. జైన్ కమీషన్ తన నివేదికలో ఓ భాగం మొత్తం చంద్రస్వామి పాత్ర గురించే రాసింది. రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్ టీ టీ ఈ కి నిధులు సమకూర్చింది చంద్ర స్వామి యే అని రాసుకొచ్చింది. దీంతో చంద్రస్వామి విదేశీ ప్రయాణాలను కూడా కోర్టు నిషేధించింది. ఈ నిషేధం 2009 వరకు కొనసాగింది.
ఇది కూడా చదవండి >>>>>>>> చంద్రస్వామి లీలలు ఎన్నెన్నో (2)
——– KNMURTHY