ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం !!

Sharing is Caring...

New facility for old age persons ………………..

రాబోయే ఎన్నికల్లో ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ కల్పించబోతోంది. 80 ఏళ్లుదాటిన వృద్ధులు.. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యం కల్పించేలా ఈ సి ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సజావుగా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్న ఈసీ… దివ్యాంగులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

తెలంగాణాలో తొలిసారిగా అమలు చేస్తోన్న ఈ విధానంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు మాత్రమే ఇంటి వద్ద ఓటు వేయటానికి అర్హులు. ఓటర్ల జాబితా ప్రకారం ఎవరెవరు ఓటు ఫ్రమ్‌ హోమ్‌కు అర్హులో ఇప్పటికే గుర్తించింది ఈసీ.

తెలంగాణా రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్లు నాలుగున్నర లక్షల మంది ఉండగా, వీరిలో శతాధిక వృద్ధులే ఏడు వేల మంది. ఇక 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు 5 లక్షల మంది ఉన్నారని ఈ సి చెబుతోంది.

అయితే ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ముందుగా ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచి ఐదు రోజుల పాటు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే నవంబర్‌ 3 నుంచి 8వ తేదీవరకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాలి.

పూర్తిచేసిన ఫార్మ్ 12డి దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలి.ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది.. సీరియల్ నంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. వృద్ధులు తమ వయసు, వికలాంగులైతే పర్సన్ విత్ డిజెబిలిటీ అనేది తెలియ జేయాలి.

దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హతను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారు. అర్హత ఉన్న వారి ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. ఇంటి వద్ద ఓటు తీసుకున్నా.. ఎవరికి ఓటు వేస్తున్నారనేది రహస్యంగా ఉంచుతారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఈ సదుపాయం కల్పించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!