మస్తాన్ ఇడ్లీ తింటే …ఆ మజానే వేరు !

Sharing is Caring...

ఇడ్లీనే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. మస్తాన్ ఇడ్లీ.. మస్తాన్ ఇడ్లీనే. దానికి సాటి మరొకటి లేదు.
ది గ్రేట్ గ్రాండ్ ట్రంక్ రోడ్.. ఎక్కడెక్కడి వారినో కలగలుపుకుంటూ వెళ్లిపోయే ఆ జీటీ రోడ్డులో.. ఒంగోలు దగ్గర కాసేపు ఆగితే.. మతిపోయే రుచులు మన సొంతం అవుతాయి. ఒకదానికి మరొకటి సాటిరాని రుచులు. అందులో మస్తాన్ ఇడ్లీ ఒకటి.
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుసందు మొదట్లోనే వుంటుంది. సాధారణంగా బస్టాండ్ పరిసరాల్లో టిఫిన్లు, భోజనాలు పెద్ద గొప్పగా వుండవు. ఎందుకంటే.. అంతా ఫ్లోటింగ్ పబ్లిక్. ఏదో ఆకలి మీద వస్తారు. ఇంత తినిపోతారు. బావుంది, బాలేదు అని చెప్పడానికి ఏమీ వుండదు. మళ్లీ ఆ ఊరు వెళతామనే గ్యారంటీ ఎవరికీ వుండదు.

కానీ.. ఒంగోలు బస్టాండ్ ఎదురుగా.. అరవై అడుగుల  రోడ్డు అంటారు దానిని. అక్కడ మస్తాన్ హోటల్లో ఇడ్లీ.. ఒకసారి రుచి చూస్తే.. ఆ ఇడ్లీలకోసం మళ్లీ ఒంగోలు వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఇంతవరకూ ఒంగోలు మొహం చూడనివాళ్లు కూడా.. మస్తాన్ ఇడ్లీ తినడంకోసమైనా ఒంగోలులో ఆగాలని అనిపిస్తుంది.ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మస్తాన్ హోటల్ ఎంత ఫేమస్ అంటే.. ఒంగోలు విడిదిచేసిన మంత్రులయినా, ముఖ్యమంత్రులయినా.. మస్తాన్ హోటల్ నుంచి ఇడ్లీలు పార్సిల్ తెప్పించుకోవాల్సిందే.అలా అని  అదేమీ స్టార్ హోటల్ కాదు. చిన్న హోటల్. ముప్ఫై ఏళ్లనాటి కాకా హోటల్. నిజానికి ఆ హోటల్ కి బోర్డు కూడా వుండేది కాదు. ఈ మధ్యనే పెట్టారు. మస్తాన్ హోటల్ అని కూడా వుండదు. ‘మస్తాన్’ అని వుంటుంది. అంతే!

ప్రతిరోజూ ఉదయం మూడు నాలుగు గంటలు, సాయంత్రం మరో మూడునాలుగు గంటలు తెరిచివుంటుంది. ఆదివారం మాత్రం సాయంత్రం వుండదు. చిన్న షట్టర్. అందులోనే ఇరుకిరుకుగా సర్దిన సోఫాలు, కుర్చీలు. అక్కడే వంట, వడ్డనలు. ఎప్పుడూ కిటకిటలాడే ఆ హోటల్లో కూర్చోడానికి సీటు దొరకబుచ్చుకోగానే.. ఆకులో మూడు ఇడ్లీలు వస్తాయి. చారెడంత వుంటాయి. పప్పు చెట్నీ, అల్లం పచ్చడి, కారప్పొడితో వస్తాయి. చారెడంత నెయ్యి పోస్తాడు. నిమ్మకాయ చెక్క ఇస్తాడు.
పప్పు చెట్నీలో నిమ్మకాయ పిండుకొని టిఫిన్లలో అద్దుకుని తినే సంప్రదాయం.. అన్ని ఇళ్లలోనూ వుండేది. ఈమధ్య పోయింది. ఆ సంప్రదాయాన్ని ఈనాటికీ కొనసాగిస్తోంది మస్తాన్ హోటల్. ప్లేటు ఇడ్లీతో పాటు నిమ్మకాయ బద్ద తప్పనిసరిగా ప్లేటులో వుంటుంది. పప్పు చెట్నీలో నిమ్మకాయ పిండుకుని, ఇడ్లీలను ఆ పచ్చడితో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు.
మస్తాన్ ఇడ్లీ.. అందుకే అంత ఫేమస్. అది నోస్టాల్జియా ఇడ్లీలు అందించే హోటల్.

ప్లేటులో వున్న మూడు ఇడ్లీలు.. అసలు ప్లేటులో ఏమున్నాయో మనం తెలుసుకునే లోగానే మన నోట్లో వెన్నలాగా కరిగిపోతాయి. అసలేం జరిగిందో తెలుసుకునేలోగా… వేడివేడి దోసె.. ఆకులోకి వచ్చేస్తుంది. నిజానికి వాటిని దోసెలు అనకూడదు. అట్లు అనాలి. కొంచెం మందంగా వుంటుంది. రవ్వదోసెకు వుండేట్టుగా వెయ్యి కళ్లు వుంటాయి దానికి. మన ప్లేటులో వున్న మూడు ఇడ్లీలు మన కడుపులోకే వెళ్లాయా, ఎవడన్నా ఎత్తుకెళ్లిపోయాడా అనే మీమాంసలో మనం వున్నప్పుడు.. ఈ అట్టు వస్తుంది ప్లేటులోకి. మన ప్లేటులో ఇడ్లీలు ఎవడో దొబ్బేశాడనుకుంటా.. ఈ అట్టు అయినా తిందాం అన్నట్టుగా వుంటుంది మన పరిస్థితి. అది అట్టు కాదు.. ఒట్టు.. అంత రుచికరమైన అట్టుని ఈ భూమండలంమీద ఎవడూ వేయలేడేమో అనిపిస్తుంది.మస్తాన్ హోటల్లో అట్లు.. ఒక వరసలో నెయ్యితో వేస్తారు, రెండో వరసలో నూనెతో వేస్తారు. పెనంమీద నెయ్యి, నూనె మారిపోతూ కలగలిసి వుంటాయి. దాంతో చాలా చిత్రమైన రుచి ఆ అట్లకు వస్తుంది.

ఇంతకీ ఇంత గొప్ప హోటల్  ఎవరిది ? 
బంధువుల హోటల్ దగ్గర పనిచేసుకుంటూ వచ్చిన మస్తాన్ షేక్.. మూడు దశాబ్దాల క్రితం దీనిని ప్రారంభించాడు. పదిహేనేళ్లనుంచి మస్తాన్ కుమారుడు మీరావలి  దీనిని నిర్వహిస్తున్నాడు. మీరావలి .. ఎంబీఏ చదువుకున్నాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటుండేవాడు. తండ్రికి చేదోడుగా వుండడంకోసం ఉద్యోగం మానేసి 2000లో హోటల్ బాధ్యతలు తీసుకున్నాడు. 2003లో మస్తాన్ చనిపోయాడు. కానీ మస్తాన్ చేతి రుచులు మరుగవలేదు. నేటికీ ఘుమఘుమలాడుతూనే వున్నాయి. వాడే బియ్యం, వాడే ఇడ్లీ రవ్వ, వాడే మినపగుళ్లు, వాడే జీడిపప్పు, వాడే నెయ్యి.. అంతా ఎక్కడా రాజీపడకుండా నడిపే హోటల్. నెయ్యి విషయంలో ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా.. వెన్న తెప్పించి, నెయ్యి తయారు చేయిస్తామని చెబుతాడు మీరావలి . మస్తాన్ లాంటి వారికి మరణం వుండవచ్చు. కానీ.. మస్తాన్ హోటల్ లాంటివి సజీవాలే ఎప్పటికి. 

——-   Vasireddy Venug0pal 

 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూవీరత్నం November 9, 2020
error: Content is protected !!