కొండ రెడ్ల జీవన శైలి మారిందా ?

Sharing is Caring...

Siva Racharla ……………………………………. 

‘నా స్మృతి పదంలో’  పుస్తకాన్ని చదివాను. 50 ఏండ్లలో ఒక గ్రామంలో జరిగిన మార్పులను ఆంథ్రొపాలాజిస్ట్ శ్రీనివాస్ ఆ పుస్తకం లో చిత్రీకరించారు. 2011 డిసెంబరు లో మొదటిసారి కొండెరెడ్ల తో కలిసే అవకాశం వచ్చింది. తరువాత 2013 లో పాపికొండల యాత్రలో పాములేరు ఒడ్డున అనేక మంది కొండరెడ్లతో మాట్లాడ్డం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తరువాత తొలిసారి కొండరెడ్లు నివసించే గబ్బిలాల గొందికి వెళ్లే అవకాశం వచ్చింది.

కోయ, భగత, చెంచు ఇలా గిరిజనుల్లో అనేక తెగలున్నా కొండరెడ్లు చాలా భిన్నమైన వారు. నుదురు, కనుబొమ్మలు, ముక్కు, శారీరక ఆకృతితో పాటు  జీవన విధానంలో వీరిది ప్రత్యేకమైన అస్తిత్వం. వేరే గిరిజనుల తెగతో పోలిక ఉండదు.

చింతూరు-కునవరం దారిలో 25 km ప్రయాణం చేసిన తరువాత భగవాన్ పురం ఊర్లో నుండి 4 km కొండ ఎక్కితే గబ్బిలాల గొంది చేరుకొంటాం. నలభై కుటుంబాలున్న కొండరెడ్లలో మూడు ఉప కులాలు, మూడు గుంపులుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. చూడటానికి బక్కపలచగా ఉండే శరీరాల్లో సత్తువ ఎక్కువ. కొండ ప్రాంతాల్లో నివాసం, అక్కడి క్లిష్ట పరిస్థితులకు తగ్గట్టు వారి శరీర నిర్మాణం, ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. వారికి అతిపెద్ద అనారోగ్యం అంటే మలేరియానే.

గత కొంత కాలంగా ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తల వల్ల కొండరెడ్డి మహిళలు కొండ దిగి వచ్చి కాన్పులకు సమీప ఆస్పత్రులకు పోతున్నారు. దీనితో శిశు మరణాల రేటు బాగా తగ్గింది. గిరిజనుల్లో పోడు వ్యవసాయం సాధారణం కానీ కొండరెడ్లు పెద్ద పెద్ద రాళ్ల నీడన పంటలు పండిస్తారు. వాళ్లు చూపిస్తే కానీ మనకక్కడ పొలం ఉన్న సంగతి తెలియదు.

కొండ రెడ్లకు పంటలు అంటే పచ్చ పండగ, గోంగూర పండగ, మామిడి పండగ, చిక్కుడు పండగ. పచ్చ పండగ అంటే జొన్నలు, మొక్క జొన్నలు, సామలు. ఆయా పంటలు చేతికి వచ్చే కాలాన్ని బట్టి వాళ్లు పండగ చేస్తారు. కూర గాయల్లో చిక్కుడు, ఆకు కూరల్లో గోంగూర వారి ఆహారంలో ప్రధానమైనది. మెత్తటి వెదురుతో గోంగూర, బెండకాయలు కలిపి చేసేది వారికి మాత్రమే ప్రత్యేకమైన వంట.

కాలంతో పాటు కొండ రెడ్ల జీవన శైలి మారింది, ఆలోచన విధానం కూడా మారింది. పన్నెండేళ్ళ కిందట తొలిసారి చూసిన కొండ రెడ్లకు ఇప్పటి కొండ రెడ్లలో ఆహార్యంలో ఆధునికీకరణ ప్రభావం ఉంది. ఇప్పుడు వారు వేసుకునే దుస్తులు మారిపోయాయి, మాట తీరు మారింది, మాటలో స్పష్టత పెరిగింది.

కొండ రెడ్లలో కన్నప రెడ్డి అనే పేరు ఎక్కువగా ఉంటుంది. నిన్న మేం కలిసిన వాళ్లలో కూడా భీం రెడ్డి, కన్నప రెడ్డి, గంగి రెడ్డి తదితరులున్నారు. కానీ ఈ జనరేషన్ పిల్లలు మాత్రం నాగార్జున, అరవింద్, శివ శంకర్, జగదీప్, సంధ్య, సంగీత, దుర్గ.ఇప్పటివరకు కొండ ప్రాంతంలో నివసించిన కొండ రెడ్లలో డిగ్రీ చదివిన వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ లేరు.

మీరెందుకు ఇంకా కొండలపైనే ఉంటున్నారు అంటే మేం కొండ దిగి వస్తే ప్రభుత్వం మాకు ఇంటి స్థలాలు ఇస్తుంది కానీ సాగుకు భూములు ఇవ్వడం లేదు. మేం మైదాన ప్రాంత రైతులతో పోటీ పడి సాగు చెయ్యలేము, మైదాన ప్రాంత కూలీలతో కలిసి పోటీ పడి పని చెయ్యలేము. అక్కడ బతకడం కష్టం అవుతుందని అన్నారు.

కొండ రెడ్లకు ప్రభుత్వ పథకాల కోసం దాదాపు అందరికీ పాన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయి. క్రమంగా మైదన ప్రాంత జీవన విధానానికి అలవాటు పడుతున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!