IRCTC New Decision……………………..
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ సాయంతో రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు.ఇకపై వెబ్సైట్ లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.IRCTC ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ తాజా నిర్ణయంతో వెబ్సైట్/యాప్‌లో టికెట్ బుక్ చేసుకొనే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం బీమా ఆప్షన్ పక్కనున్న టిక్ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకొనే పని లేదు.
ఇక నుంచి ఈ ఆప్షన్‌ను ఐఆర్సీటీసీ డిఫాల్ట్‌గా ఇస్తోంది. దీంతో టికెట్లు అయిపోతాయేమో అనే తొందరలో బీమా సదుపాయాన్ని ఎంపిక చేసుకోలేదని చింతించాల్సిన పనిలేదు. అయితే ఈ ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్ మార్క్‌ను తీసేయచ్చు. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) నియమాల ప్రకారం ఏ సంస్థ కూడా బీమాను డిఫాల్ట్‌గా ఇవ్వరాదు. ఐఆర్సీటీసీకి మాత్రం వెసులుబాటు ఇచ్చింది.ఇంతకు ముందు ఈ సదుపాయం లేదు.
ఇదివరలో తప్పనిసరిగా భీమా ఆప్షన్ ఎంచుకోవాల్సిన అవసరముండేది. టికెట్ బుక్ చేసుకొనే తొందరలో బీమాను ఎంపిక చేసుకోవటం మర్చిపోయేవారు దీంతో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు బీమా ప్రయోజనాలకు వారు దూరమయ్యేవారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్‌లో చిన్న మార్పు తీసుకొచ్చింది. కేవలం 35 పైసలకే లభించే బీమా సదుపాయాన్ని డిఫాల్ట్ చేసింది.
ఈ బీమా ద్వారా రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పనీ చేయలేని పరిస్థితి ఎదురైతే బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షల వరకు బీమా సొమ్ము పొందొచ్చు. క్షతగాత్రులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షల వరకు అందిస్తారు. బీమా కు ప్రయాణికులు నామినీ వివరాలను జత చేయాల్సి ఉంటుంది.
నామినీదారు లేదా ప్రయాణికులు ఈ బీమాను క్లైమ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత పత్రాలను తీసుకొని దగ్గర్లో ఉన్న బీమా సంస్థను సంప్రదించాలి. ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లో బీమా తీసుకున్న వ్యక్తి వీటి ప్రయోజనాలను పొందుతారు. ఒక వేళ నామినీ వివరాలు అందించకపోయినా, నామినీ వ్యక్తి చనిపోయినా వారసులు ఈ బీమా ప్రయోజనాలు పొందుతారు.