B.Tech Chaiwali………….
ఆ మధ్య పశ్చిమ బెంగాల్ కి చెందిన ఎమ్మె ఇంగ్లీష్ చాయ్ వాలీ గురించి తెలుసుకున్నాం. అదే బాటలో బీహారీ అమ్మాయి కూడా చాయ్ దుకాణం పెట్టి వార్తల్లో కెక్కింది. ఇటీవల కాలంలో సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలకు బదులుగా సాంప్రదాయేతర వృత్తులను యువతరం ఎంచుకుంటోంది. ఆర్థిక స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగం రాలేదని కుమిలి పోయే వారికి స్ఫూర్తి నిస్తూ నెటిజన్ల ప్రశంసలు పొందుతున్నారు.
బీహార్‌కు చెందిన ఛాయివాలీ పేరు వర్తికా సింగ్. చదువుతూనే తన కలలను సాకారం చేసుకునేందుకు తొలి అడుగు వేసింది. వర్తికా సింగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.వర్తికా సింగ్ తన డిగ్రీ చదువు నిమిత్తం హరియాణాలోని ఫరీదాబాద్‌కు వచ్చింది. అక్కడ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తోంది.
సొంతంగా వ్యాపారం చేయడమే వర్తికా లక్ష్యం. కానీ డిగ్రీ చేతికి వచ్చేసరికి 4 సంవత్సరాల సమయం పడుతుంది. బీటెక్ పూర్తయ్యే వరకూ వేచి ఉండటంలో అర్థం లేదని భావించి వెంటనే టీ దుకాణం తెరిచింది.ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ వద్ద తన టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
దానికి ‘బీటెక్ చాయ్‌వాలీ’ అంటూ పేరుపెట్టుకుంది. తన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుచేసేలా ‘ఆత్మవిశ్వాసం, కృషి ఎప్పుడూ విజయాన్నే అందిస్తాయి ‘ అని స్టాల్ దగ్గర ఓ బ్యానర్‌నూ పెట్టుకుంది. తన కాలేజీ పూర్తైన తర్వాత సాయంత్రం 5.30 గంటల నుంచి 9 గంటలవరకు టీ విక్రయిస్తోంది.
ఆమె దగ్గర లెమన్, మసాలా చాయ్ కూడా అందుబాటులో ఉన్నాయి. మసాలా, లెమన్ చాయ్‌లను ఒక్కొక్కటి రూ. 20 కి.. సాధారణ చాయ్‌ని రూ. 10కి విక్రయిస్తుంది.జనం ఆదరణ కూడా బాగుంది. వర్తికా ఆత్మ విశ్వాసం అందరిని మెప్పిస్తోంది. చిన్నవయస్సులో ఆమె చూపుతున్న పట్టుదలకు నెట్టింట్లో ప్రశంసలు దక్కుతున్నాయి.
‘ఇలాగే ముందుకు సాగండి. ఏడాదిలో మీరొక బ్రాండ్ అవుతారు’ అంటూ ప్రోత్సాహకర కామెంట్లు పెడుతున్నారు. కరోనా సమయంలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా కూడా ఉద్యోగం రాకపోవడంతో బీహార్ రాజధాని పాట్నాలోని ఓ మహిళా కళాశాల సమీపంలో టీ స్టాల్ పెట్టింది. “MBA చాయ్‌వాలా”గా ప్రసిద్ధి చెందిన ప్రఫుల్ బిల్లోర్ కథ విన్న తర్వాత టీ స్టాల్ తెరవడానికి ప్రేరణ పొందానని వర్తిక అంటున్నారు.
చివరగా ఈ వీడియోలో ఆమె ఒక అభ్యర్థన కూడా చేసింది. ‘ఈ వీడియోను షేర్ చేసి, వైరల్ చేయకండి. దాని వల్ల ఏమీ రాదు. ఇక్కడకు వచ్చి, ఒకసారి టీ తాగి చూడండి. నచ్చకపోతే మళ్లీ రావొద్దు’ అంది.