‘నరబలి’ సంచలనం !

Sharing is Caring...

 Human Sacrifice ……………………………………………….

కేరళ నరబలి ఉదంతం  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు మహిళలను బలి ఇచ్చి వారి మాంసాన్ని తినేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భగవత్ సింగ్ ,లైలా దంపతులు  షఫీ అనే మంత్రగాడి సహకారంతో..కోటీశ్వరులు అయిపోవచ్చనే దురాశతో ఇద్దరు మహిళలను బలి ఇచ్చారు. 

ఈ కేసు విచారణ జరిగే  కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయట పడుతున్నాయి.  ముగ్గురు నిందితులు(దంపతులతో సహా) నేరాన్ని అంగీకరించారు. అయితే  అవశేషాలు దొరక్కపోవడంతో పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి.  కేరళలోని పథనంతిట్ట జిల్లా ఎలంతూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలుత బాధిత మహిళలు రోసలిన్ , పద్మలను నరబలి ఇచ్చి.. వాళ్లను ముక్కలుగా నరికి కాల్చేసి.. పాతేసి ఉంటారని అనుమానించారు. అయితే.. కాల్చేసిన, పాతేసిన ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదు. క్లూస్‌ టీమ్‌ రంగం లోకి దిగినప్పటికీ  ఎలాంటి ఆధారాలు లభించలేదు.

దీంతో నరికి కాల్చేసి… తినేసి ఉంటారని భావిస్తున్నారు. రెస్లీని 56 ముక్కలు, పద్మను 5 ముక్కలుగా చేసినట్లుగా నిందితులు(దంపతులు భగవంత్‌ సింగ్‌, లైలా.. మంత్రగాడు షఫీ).. అంగీకరించారు. 
వారు చెప్పిన మాటలను బట్టి  తర్వాత ఆ కాల్చిన భాగాలను తినేసి ఉంటారని పోలీసులు సందేహిస్తున్నారు.

లైలా ఈ మేరకు వాంగ్మూలం ఇవ్వగా.. భగవంత్‌ సింగ్‌ మాత్రం నోరు మెదపడంలేదు. దీంతో ఈ విషయంపై ధృవీకరణ కోసం.. ముగ్గురు నిందితులను మరోసారి విచారించే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. 

మాంత్రికుడు షఫీ చెప్పాడని ఆ ఇద్దరినీ నర బలి ఇచ్చినట్లు విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎర్నాకుళం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. ఇక నిందితుల కస్టడీ కొరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

మాంత్రికుడిని అని  చెప్పుకుని తిరుగుతున్న మొహమ్మద్ షఫీ అనే వ్యక్తి గురించి తెలుసుకున్న భగవంత్‌ సింగ్‌ అతన్ని కలిశాడు. మీ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని, తరువాత నువ్వు కోటీశ్వరుడు అయిపోతావని మాంత్రికుడు మోహమ్మద్  భగవంత్‌ సింగ్‌కు చెప్పాడు.

డబ్బులు నేనే ఇస్తానని, మహిళలను నువ్వు పిలుచుకుని వచ్చి నరబలి ఇవ్వాలని  భగవంత్‌ సింగ్‌  మోహమ్మద్ షఫీకి చెప్పాడు. ఎర్నాకుళంలో లాటరీ టికెట్లు అమ్ముతున్న పద్మా (52), రోసలిన్ (49) అనే ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వాలని మోహమ్మద్ షఫీ నిర్ణయించుకుని  ఆ ఇద్దరినీ  కలిశాడు.

సినిమాల్లో నటించడానికి మీకు చాన్స్ ఇప్పిస్తానని, తన కూడా  వస్తే డబ్బులు కూడా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. రోసలిన్, పద్మాలను నేరుగా  భగవంత్ సింగ్  ఇంటికి పిలుచుకుని వెళ్లారు. అక్కడే నరబలి ఇచ్చారు.  భగవంత్సింగ్‌ను హతమార్చి లైలాతో కలిసి జీవించేందుకు షఫీ పన్నాగం పన్ని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నరబలి కేసు ను  వివాహేతర సంబంధం కోణంలోనూ  విచారణ జరుపుతున్నారు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!