ఎవరీ ఆర్టెమిస్ ? నాసా ఆ పేరు ఎందుకు వాడుతోంది ?

Sharing is Caring...

Artemis history ……………………………

చంద్రునిపై నాసా చేస్తోన్న ప్రయోగాలకు “ఆర్టెమిస్” అనే పేరు పెట్టుకుంది. ఇంతకూ ఎవరీ “ఆర్టెమిస్” అని కూపీ లాగితే వివరాలు చాలానే ఉన్నాయి.చంద్రుని ఆరాధించిన దేవతగా “ఆర్టెమిస్” కి పేరుంది. చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్నది కాబట్టి నాసా “ఆర్టెమిస్”  పేరును ఎంపిక చేసుకుంది.

ఇక  గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ ఒక దేవత. జ్యూస్ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది.

నాసా మొదటి నుంచి తన మిషన్‌లకు పౌరాణిక వ్యక్తుల పేర్లు పెడుతోంది. 1950 దశకం నుంచి రాకెట్లు .. ప్రయోగ వ్యవస్థలకు గ్రీకు ఆకాశ దేవతల పేర్లు పెట్టింది. అపోలో,అట్లాస్ సాటర్న్ వంటి పేర్లు ఈ కోవలోకి వస్తాయి. అంతరిక్ష ప్రయోగాలు మొదలు పెట్టాక జ్యూస్ పిల్లల పేర్లు  మిషన్లకు పెట్టింది. 1958 నుండి 1963 వరకు యాక్టివ్‌గా ఉన్న మెర్క్యురీ ప్రోగ్రామ్‌కు హెర్మేస్ రోమన్ కౌంటర్‌పార్ట్ పేరు పెట్టింది. కాస్టర్, పొలక్స్ పేర్లను కూడా వాడింది.    

కాగా ఈ  “ఆర్టెమిస్” ప్రయోగం లక్ష్యం చంద్రుని పైకి మనిషిని పంపి దీర్ఘ కాలం అక్కడ నివశించగలడో ? లేదో తెలుసుకోవడమే. ఈ ప్రయోగాలకు నాసా 9300 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతోంది. ఇందులో ఆర్టెమిస్-1 ఖర్చు 400 కోట్ల డాలర్లు 42 రోజుల యాత్రలో ఆర్టెమిస్-1 13 లక్షల కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే…  “ఆర్టెమిస్” -1 ప్రయోగం విజయ వంతమైతే నాసా భవిష్యత్ ఆలోచనలకు పునాదులు పడతాయి. ఈ ప్రాజెక్టు లో  ప్రధానంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ ( ఎఎస్) అనే రాకెట్, ఒరాయన్ అనే క్యాప్సూల్ ఉన్నాయి. ఒరాయన్ ఎస్ఎస్ పైభాగంలో క్యాప్సూల్ ఉంటుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంటుంది.

మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం లేకుండానే ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఇది పని చేస్తుంది. ఆర్టెమిస్-1 యాత్ర ఆరు వారాల పాటు సాగుతుంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్‌ఎస్ నింగిలోకి దూసుకెళుతుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్ తో ఒరాయన్ విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే ‘ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్’ పథంలోకి వెళుతుంది.

3.86 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని చేరుకోవడానికి ఒరాయన్ కు దాదాపు వారం పడుతుంది. తొలుత చంద్రుడి ఉపరితలానికి ఎగువన 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుతుంది.
ఆ తర్వాత 61వేల కిలోమీటర్ల దూరంలోని సుదూర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ దశలో అది భూమికి 4. 5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అపోలో యాత్రలో ఇంత దూరం వెళ్లలేదు. భూమికి తిరిగి రావడానికి ఒరాయన్.. చంద్రుడి గురుత్వాకర్షణను ఉపయోగించుకుంటుంది. ఈ వ్యోమనౌక.. గంటకు 40వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి దూసుకొస్తుంది. ఆ దశలో గాలి రాపిడి వల్ల ఒరాయన్ పై 2,750 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉత్పత్తవుతుంది.

 దీన్ని తట్టుకునేలా ఆ వ్యోమనౌకకు ప్రత్యేక రక్షణ కవచాన్ని అమర్చారు. ఆ తర్వాత పారాచూట్లు విచ్చుకొని ఒరాయన్ వేగాన్ని తగ్గిస్తాయి. కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసముద్రంలో ఈ వ్యోమనౌక పడుతుంది. రక్షణ సిబ్బంది దీన్ని వెలికి తీస్తారు. ప్రయోగించే టైం ను పట్టి … ఎపుడు పడుతుందో సమయం నిర్ణయిస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!