Taadi Prakash ……………………………………………
Old man and the sea of telugu literature ………………………………………
మన వాళ్లు వొట్టి వెధవాయిలోయ్! ఎంతసేపూ 30 రోజుల్లో రామోజీరావు అవ్వడం ఎలా? అన్న పాడు బుద్ధులే తప్ప, పది కథల్తోనే ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్లెవరైనా వున్నారా? ఒక్క సి.రామచంద్రరావుగారు తప్ప! ఏ కొద్దిమందినో మినహాయిస్తే, ఈ తరం కుర్రసన్నాసులెవరికీ రామచంద్రరావుగారు తెలీక పోవచ్చు.
ఆయన కథల గురించీ విని వుండకపోవచ్చు. అది పెద్ద నేరమూ కాదు. ఏ నాటి వాడు రామచంద్రరావు! విశాలాంధ్ర వాళ్లు ఆయన కథల పుస్తకాన్ని 1964లో వేశారు. అంటే 56 సంవత్సరాల క్రితం. అప్పటికి ఏడంటే ఏడే కథలు రాసినాయన, తర్వాత 50 ఏళ్లలో మూడంటే మూడు కథలే రాశారు. కథా సంకలనం పేరు ‘వేలుపిళ్లై’. ఆ కథలన్నీ పాఠకుల్ని మెప్పించాయి. కవులూ, రచయితలూ, సంపాదకులూ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.
‘ఈయన రచయితలకు రచయిత’ అన్నారు. నాకు బాగా నచ్చిన కథ ‘వేలుపిళ్లై’ అన్నారు నండూరి రామ్మోహనరావుగారు. తమిళనాడులోని ఒక టీ ఎస్టేటులో కూరగాయలు అమ్ముకునే చిన్న వ్యాపారి వేలుపిళ్లై. అతని భార్య గయ్యాళి. దెబ్బలాడి వెళిపోతుంది. యవ్వనంతో మెరిసే సెందామరై అతని జీవితంలోకి వస్తుంది. కూరగాయలు అమ్మీ, వండిపెట్టీ, సుఖాన్నిచ్చీ వేలుపిళ్లై జీవితానికో అర్థాన్నిస్తుంది.
‘‘బిగువైన రవికలోంచి పొంచి చూసే సెందామరై చనుకట్టూ, అప్యాయత వొలకబోసే పెదిమెల సొంపూ, మంచిచెడ్డలు ఆలోచించనివ్వని వెచ్చని కౌగిలింతా, మగతానాన్ని కలత పెట్టే పొంగు యవ్వనం అతనికి జ్ఞాపకం వచ్చాయి…’’ అని రాస్తారు రా.రావు. అగ్గిపుల్ల వెలుగులో వేలుపిళ్లై, సెందామరైని చూస్తుండటాన్ని బాపు బొమ్మ వేశారు.
వేలుపిళ్లై వయసులో పెద్దవాడు. సెందామరై నవయవ్వన శృంగార దేవత! ఆ contrast ని బాపు బొమ్మలో చూసి తరించాలి! ఎక్కడో తమిళనాడు కొండల్లో కూరగాయలు అమ్ముకునేవాడు ‘వుంచుకున్న’ ఓ ఆడదానికి- ఆ పాత్రకి గొప్ప కావ్య గౌరవం యిచ్చి ఒప్పించాడు రా.రావు. (ఇక్కడెందుకో Paulo Coelho – Eleven minutes నవల్లో బ్రెజిలియన్ బార్ డాన్సర్ మారియా గుర్తొస్తోంది).
రామచంద్రరావు చాలా అరుదైన వేటగాడు. జన్మానికో శివరాత్రి… once in a blue moon అన్నట్టు… అయిదారేళ్లకోసారి సాహితీ సముద్రం మీదికి పడవేసుకుని బయల్దేరతాడు, ఒంటరిగా. బతుకుని బిగువుగా అల్లిన వలలో… పడితే అపురూపమైన చేపే పడాలి!
రాస్తే, ఆ కథ, పది కాలాలపాటు గుర్తుండిపోవాలి. ఇప్పటి దాకా ఆయన పది చేపల్ని మాత్రమే పట్టాడు. most precious things of his life and our literature. ముందుగా కథ గుండెల్లో రూపుదిద్దుకోవాలి. దానికో ఎత్తుగడ. వాక్యం తర్వాత వాక్యం, ఒక నిజమైన సహజమైన ముగింపు…. ఇవన్నీ కుదిరాయి అనుకున్న తర్వాతే, ఆయన కాగితమ్మీద పెడతాడు.
బావుంటుంది. ఐనా ఏదో లోపం… సంతృప్తియివ్వదు. మార్పులుంటాయి. రీరైట్ చేస్తాడు. ప్రతి పదాన్నీ, ప్రతి expression న్నీ ఆయన అనుకున్న ఎఫెక్ట్ వచ్చేదాకా చిత్రిక పడతాడు. ‘హమ్మయ్య’ అనుకున్నాకే ఆయన పటియాలా పెగ్ బిగిస్తాడు. శ్రీశ్రీ భాషతో వూడిగం చేయించుకున్నాడు అంటారు. రా.రావు గారిలోనూ ఆ తత్వం వుంది. ఆయన వచనంలో వినిపించని సంగీతం, కనిపించని కవిత్వం తొంగి చూస్తాయి.
నిజానికి రావుగారు వుంచుకున్నామె పేరు వచనం. ఒకవేళ రామచంద్రరావుగార్ని మనం వేలుపిళ్లై అనుకుంటే, అతని వచనం పేరు సెందామరై! కార్తీక పౌర్ణమి లాంటి వెలుగు వెన్నెల వచనంతో పాఠకుణ్ణి ఒక సృజన కళా సౌందర్య లోకం అంచుల్లోకి నడిపిస్తాడు.
మానవ భావోద్వేగాల జడివానలో నిలువునా తడిపేస్తాడు. వాస్తవానికి గొప్ప చిత్రకారుడు కావాల్సిన మనిషి. ఆ కొండవాలుల్లోని టీ తోటల్నీ, అక్కడి పనివాళ్లనీ, చంద్రోదయాల్నీ ఆయిల్ పెయింటింగ్ లు వేయాల్సిన వాడు. ఆ Land scape నే కల్పనా చాతుర్యమూ, శిల్ప నైపుణ్యమూ కలిసిన అక్షరాలుగా మలిచి, మన ముందు పరిచి… చూడండి ఎంత ఇన్నోసెంటుగా నవ్వుతున్నాడో!
‘‘గొప్ప కథలు రాసిన టాప్ టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొ్చ్చే ఒక్క పేరు చెప్పమని అడగ్గానే, చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి.రామచంద్రరావు. రాసి కన్నా వాసికే విలువనిచ్చే అమిత మిత రచయితలలో చాసో (చాగంటి సోమయాజులు) తర్వాత సి.రామచంద్రరావుగారనే చెప్పుకోవాలి’’ అన్నారు ముళ్లపూడి వెంకట రమణ, ‘వేలుపిళ్లై’కి రాసిన ముందు మాటలో. కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.
‘‘ఎన్నోయేళ్లు టీ ఎస్టేట్స్ లో ఉన్నతాధికారిగా వున్న యీ లాయర్, మేనేజర్, తెల్లదొరల నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. టెన్నిస్ ఛాంపియన్ గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్లే. ఒక సోదరుడి కొడుకు- వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి!
2010వ సంవత్సరం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లోని ‘సాక్షి’ దినపత్రిక ఆఫీసు, కేర్ హాస్పిటల్ మధ్య రోడ్డు డౌన్ లో ఆర్టిస్టు మోహన్ ఆఫీసు. కవీ, జర్నలిస్టూ నున్నా నరేష్, రామచంద్రరావు గారితో వచ్చాడు. మోహన్ కి పరిచయం చేశాడు. 2011లో రచయిత, ఆర్టిస్టుల మధ్య అది ప్రణయంగా మారింది.
‘‘పదరా రామచంద్రరావు గారింటికి వెళదాం’’ అనేవాడు మోహన్. నందినగర్, కేసీఆర్ ఇంటికి అవతలి రోడ్డులోనే రా.రావు గారి భవంతి. ఇంట్లోనే లిఫ్టు. రెండో అంతస్తులో ఆయన డ్రాయింగ్ రూం. పలకరింపులయ్యాక, ‘‘ప్రకాష్ హెల్ప్ యువర్ సెల్ఫ్’’ అనేవాడు.
పక్క గదిలో ఫ్రిజ్ నిండా స్వదేశీ విదేశీ విస్కీలు, బీర్లు, సాఫ్ట్ డ్రింకులూ వుండేవి. నచ్చింది తెచ్చుకోమని ఆయన సజెషన్. పార్టీ మొదలయ్యేది.. రా.రావు ఆర్ట్ కలెక్టర్. చాలా పెయింటింగులు వుంటాయి. వాటి గురించీ కథల గురించీ కబుర్లు. మంచి కాన్వర్ సేషనలిస్ట్. సెన్సా్ఫ్ హ్యూమర్ కి కొదవేలేదు. పాశ్చా్త్య సంగీతమేదో వింటున్నట్టు ఇంగ్లీషు ఉచ్ఛారణ. Lively company. మేం కలిసినపుడు ఆయన వయసు 78 ఏళ్లు. సన్నగా, అందంగా కాంతులీనే మేని ఛాయతో చిరు నవ్వుల్తో హాయిగా వుంటారు.
part 2 ……………https://tharjani.in/he-wrote-ten-stories-all-are-wonderful/