Taliban Ruler’s Progress Report………………………..
నిరుడు ఇదే ఆగస్టులో అఫ్ఘానిస్తాన్ మళ్ళీ తాలిబన్ల చేతుల్లో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోయిన కొద్ది రోజులకే తాలిబన్లు పాగా వేశారు. తాలిబన్ల ఆరాచక పాలనకు ఏడాది నిండింది.
అప్పటినుంచి .. తాలిబన్లు అఫ్ఘాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. తాలిబన్ పాలనలో విద్య, వైద్యం, కనీస వసతులు అందని ద్రాక్షగా మారాయి. మానవ హక్కుల జాడే లేదు. పేదరికం, కరవు ప్రధాన శత్రువులుగా మారిపోయి పీడిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలీక .. పట్టించుకునే వారే లేక అఫ్ఘాన్ పౌరులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇక మహిళల పరిస్థితి అయితే మరింత దైన్యంగా మారింది. గత 12 నెలలుగా మహిళలు, బాలికల హక్కులను పాలకులు కొల్లగొట్టారు. మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోయాయి. షరియా చట్టంలో మహిళలు తమ హక్కులను వినియోగించుకోవడానికి అనుమతిస్తామని మొదట వాగ్దానం చేసినప్పటికీ తర్వాత తూచ్ అన్నారు.
మహిళలు పని చేసే హక్కును .. చదువుకునే హక్కు ను తొక్కేశారు. మహిళలు, బాలికలను ప్రజా జీవితం నుండి మినహాయించారు. తాలిబన్ల పరిపాలనలో మహిళలకు క్యాబినెట్ పదవులు లేవు.. మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా రద్దు చేశారు. రాజకీయ భాగస్వామ్యానికి పూర్తిగా మంగళం పలికారు.
తాలిబన్లు ఆరవ తరగతి దాటిన బాలికలను పాఠశాలకు .. మహిళలు బయటకెళ్ళి ఉద్యోగాలు చేయకుండా నిషేధం విధించారు. మహిళల కదలికలపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను కప్పి ఉంచాలని ఆదేశించారు. అవసరమైన సందర్భాల్లో తప్ప.. ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
మగ తోడు లేకుండా మహిళలు ఎక్కువ దూరం ప్రయాణించడంపై కూడా నిషేధం విధించారు. ఈ క్రమంలో మహిళలు తమకు అవసరమైన సేవలు పొందలేకపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే .. దాడులతో హింసకు గురి చేస్తున్నారు. ఆఫ్ఘన్ మహిళలు , బాలికలు దుర్భర పరిస్థితిలో జీవితాలను కొనసాగిస్తున్నారు. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే.
మగవారికి చేద్దామంటే ఉద్యోగాలు లేవు. ఆర్ధిక వనరులు లేక ఉపాధి మార్గాలు మూసుకు పోయాయి. పేదలు ఉపాధి కోసం పొరుగుదేశం ఇరాన్ కు వలస వెళ్తున్నారు. అక్కడా పనులు దొరక్క తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోయారు.
తినడానికి తిండి దొరికితే చాలు అదే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఘోరంగా మారింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే. అఫ్ఘాన్ జనాభా 4.07 కోట్లు కాగా, సగానికి పైగా ప్రజలు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులోనూ బతుకులు మారుతాయన్న సూచనలు ఏవీ లేవు.
ప్రపంచంలో తాలిబన్ పాలకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. తాలిబన్ ప్రభుత్వాన్ని చాలా దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. విదేశీ సాయం నిలిచిపోయింది. 2020-21లో అఫ్రాఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో 5.5 బలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ ప్రకటించారు. ఇందులో 75 శాతం నిధులు విదేశాల నుంచి సాయం రూపంలో అందినవే.
తాలిబన్ల రాకతో ఈ విదేశీ సాయమంతా హఠాత్తుగా నిలిచిపోయింది. అఫ్ఘాన్ కు చెందిన 7 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఆర్థిక ఇబ్బందులు పౌరులను కుంగదీస్తున్నాయి. పౌష్టిక ఆహార లోపంతో బాలలు విలవిలలాడిపోతున్నారు.
దేశంలో ఈ ఏడాది కరవు తీవ్రత పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రధాన పంట గోధుమల ఉత్పత్తి తగ్గింది. చదువుకున్న యువకులు కూడా ఉపాధి కోసం పొలాల్లో పని చేస్తున్నారు.కాగా దేశంలో అవినీతిని అంతమొందించామని..దురాక్రమణ దారులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని తాలిబన్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. మానవ హక్కుల అణిచివేత గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఇది ఏడాదిగా తాలిబన్ పాలకుల ప్రోగ్రెస్ రిపోర్ట్.